Jaya Senapathi | జరిగిన కథ : ఆతుకూరు గ్రామంలో వెలసిన రుద్రేశ్వరస్వామి దేవాలయం ప్రతిష్ఠాపనా మహోత్సవానికి రావాల్సిందిగా.. జాయపసేనుడికి ఆహ్వానం పంపాడు ఆతుకూరు మండలేశ్వరుడు రుద్రయ సేనాని. ఆ ఆహ్వానపత్రికను పృథ్వీశ్వరుడే స్వయంగా తమ్మునికి చదివి వినిపించి ఆనందించాడు! ఆ ఆహ్వానపత్రికతోపాటు.. బావగారు పంపిన మరో లేఖ. ఆ ముహూర్తవేళ జాయపుడు అక్కడ నృత్తం చేస్తే బావుంటుందని.. నాలుగు రోజులు ముందుగా రావాల్సిందిగా కోరాడు మహామండలేశ్వరుడు. ఆ లేఖలలో సాక్షాత్తూ ఆ రుద్రేశ్వరుణ్నే చూసుకుంటూ.. తనకు ఆ దేవళంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు జాయపుడు.
రుద్రేశ్వరాలయం ప్రతిష్ఠాపనా మహోత్సవానికి నాలుగురోజుల ముందే వెళ్లాడు జాయపుడు. దేవాలయ నిర్మాత రుద్ర సేనాని శిల్పకళాకారుల నివాసవాడలో ఆవాసం కల్పించాడు. కాలకృత్యాలు తీర్చుకుని దేవళం వద్దకు వెళ్లాడు జాయపుడు. ఏళ్ల తరబడి నిరంతరంగా రూపకల్పన జరిగి పూర్తిరూపం సంతరించుకున్న రుద్రేశ్వరాలయం.. శివుని కైలాసంలా సమున్నత నిశ్శబ్దంతో, ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నది.
దేవళంలోకి వెళ్లాడు. మళ్లీ ఎన్నోఏళ్ల తర్వాత అదే గగుర్పాటు. లిప్తకాలపు స్పందనలు.. ఆనందంగా మొత్తం కలియదిరిగాడు. శిల్పశిల్పాన్నీ తడిమి చూశాడు. తన రూపాలను మరీమరీ చూసుకున్నాడు. అప్పుడే పక్కగా కాకతి! తృప్తిగా నవ్వుతున్నది. తనతో కలిసి చూస్తున్నది. ఇద్దరూ.. అన్నీ చూసుకుంటూ గుడి అంతా తిరుగాడుతున్నారు ఆనందంగా. లిఖిత సాహిత్యం, ఊహలు, సామాజికం, కళాత్మక ఊహలతో మేళవించగా వచ్చిన అద్భుత కళాసృష్టి. దాన్ని గుర్తిస్తే.. అదో కళాతృప్తి! అకళంక పారవశ్యం!!
బయట అలికిడి.. లలితాంబ!!
చీకటివెలుగుల క్రీనీడల్లో.. ఆ శిల్పాలమధ్య జాయపుని ముఖంలో తారాడుతున్న ఆనంద సందోహాల్ని అలా చూస్తూ లోపలికి వచ్చింది.
“పూర్తి రూపాలు చూసుకుంటున్నావా మామా..” అన్నది మార్దవంగా.
పాతశిథిలాలపై కట్టిన కొత్తకోటలా ఉంది. కొత్త చిగురుల పచ్చదనం.. కాస్త ఒళ్లు చేసి మరికాస్త అందంగా.. మరిన్ని శృంగార హొయలయలు అదనంగా. కనువిందుగా ఉంది జాయపునికి.
“మామా.. నేనిప్పుడు మీ అక్క వారసురాలిగా కాకతీయ సామ్రాజ్య ఆస్థాన నర్తకిని!”.
అతని ముఖంలోకి చూస్తూ దగ్గరగా వచ్చి.. జాయపుని చేతులు పట్టి విడదీసి హత్తుకుంది.
పరవశుడయ్యాడు. అదన్నమాట.. బావగారి లేఖలో పేర్కొన్నది.
“అద్భుతం లలితా! మట్టి తల్లిలాంటిది. మోడువారిన కట్టె మట్టిలోపడినా.. దులిపి చిగురును జతచేస్తుంది. నీ జీవితం తిరిగి చిగురించినందుకు నాకంటే సంతోషించేవాడెవ్వడు?! సరే. అక్క.. మా అక్క ఎలా ఉంది?” మధురత చిప్పిల్లేలా అడిగాడు.
ఆమె ముఖంలో ఉత్సాహం మాయమైంది.
“ఉంది. మా గృహం మంటల్లో తగలబడిన తర్వాత మరి కోలుకోలేదు. తల్పానికే పరిమితం. ఏమీ తినలేకపోతున్నది. బతికి ఉంది. అంతే!”..
బయట ఎవరో కదలాడటంతో విడిపోయారు.
స్థపతి రామప. జాయపుణ్నే ఆత్మీయంగా చూస్తూ వచ్చి లాక్కుని హత్తుకున్నాడు.
“గురుదేవా.. ఎలా ఉన్నారు??”.
“ఇదిగో.. ఇలా ఉన్నాను జాయతండ్రీ!”.
“ముక్కోటి దేవతలలో ఇప్పుడు మీరూ ఒకరు స్థపతిదేవా! పంచభూతాలు ఉన్నంతవరకూ మీకీర్తి అజరామరం!”.
ముగ్గురూ ఆత్మీయంగా చేతులు పట్టుకుని దేవళం అణువణువూ తిలకించి పులకించారు. వెనగ్గా కాకతి!!
గతంలో పెద్దన కళాగృహంలో అనుకున్నట్లు కొత్త నాట్యరూపకాల సృష్టి చేశాడు జాయపుడు. ఈ ప్రతిస్థాపన దినాన ప్రదర్శించడానికి అందులోంచి ఓ నృత్తరూపకం ఎంచుకున్నాడు. ‘కాకతీయ రుద్రేశ్వరాలయం’ దాని పేరు.
తను రచించిన తొలి నృత్తరూపకం అదే దేవాలయ ప్రాంగణంపై ప్రదర్శించడం.. అతనికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
లలితాంబ, ఆమె బృందంతో కలిసి ఈ నాలుగురోజులు అభ్యాసం చేశాడు.
ఈ జగత్తు ఉన్నంతవరకూ నిలిచి ప్రజానీకాన్ని ఆశీర్వదించడానికి ఆ కైలాసగిరి వాసుడు కొలువైన ఆతుకూరి రుద్రేశ్వరాలయ ప్రతిష్ఠాపనోత్సవం కన్నులపండువగా జరిగింది. చక్రవర్తి స్వయంగా విచ్చేసి అణువణువూ తిలకించి పులకించాడు. చివరిగా వెలనాడు మండలీశ్వరుడు, ప్రఖ్యాత నాట్యకారుడు జాయసేనాని, కాకతీయ ఆస్థాన నర్తకి లలితాంబ బృందంతో కలిసి ప్రదర్శించిన ‘కాకతీయ రుద్రేశ్వరాలయం’ నృత్త రూపకం అతిథులను మైమరపించింది.
ఆయన రచించి నాట్య దర్శకత్వం వహించి, నటించిన ఈ నృత్త రూపకం ఓ అద్భుతం!
దేవాలయ సృష్టి మొత్తం ఓ రూపక ప్రదర్శనగా.. అందులోనున్న శిల్పాలలో పొందుపరచిన అనేకానేక కథలు, గాథలు, పౌరాణిక మహత్తులు, సామాజికాంశాలు, జానపద కథలు, సంగీతం, గేయాలు, వాద్యాలు.. ఒకటేమిటి అందులోనున్న అన్ని అంశాలనూ కలగలిపి ఓ ప్రదర్శనాంశంగా చేసిన జాయపుడు.. రామప బృందపు శ్రమ, సృజనాత్మకత, నేర్పు, సృష్టి, ఆలోచన, వందలమంది శిల్పుల కష్టం.. చూపరులకు వివరంగా కళ్లకు కట్టాడు. భూమిపూజ నుంచి స్థాపన వరకు.. ప్రతి అంగుళమూ కళ్లెదుట కనువిందు చేస్తుంటే.. అందరూ మంత్రముగ్ధులై తిలకించారు.
ఆఖరున స్థపతి రామప, ఆయన బృందమంతా వేదికపైకి రావడంతో.. చక్రవర్తి సైతం లేచినిలబడి అభినందనగా చేసిన కరతాళధ్వనులతో ఆ దేవదేవుడు రుద్రుడు కూడా తృప్తి చెందినట్లు దేవళం మారుమ్రోగింది.
“ఇది స్థపతి రామప బృందం వారి అద్భుతసృష్టి. ఈ రుద్రేశ్వరాలయం.. రామప దేవాలయం”..
ముగింపుగా అన్నాడు జాయపుడు.
జాయపుడు రచించి ప్రదర్శించిన ఈ తొలి నృత్తరూపకం తెలుగు నాట్య ప్రదర్శన రంగంలో కొత్త ఒరవడికి నాంది పలికింది. జాయపుని పూర్ణప్రజ్ఞ ప్రదర్శనకు నాందీ వాచకమయ్యింది.
ఇక్కడ ఈ ప్రదర్శన జరుగుతున్న సమయంలోనే.. ఆవలగా కాటేశ్వరాలయంలో ఓ బిచ్చగత్తె చిరుగుల చీరె నడుముకు దోపి, కన్నీరు కాలువలు కట్టి ప్రవహిస్తుండగా.. ఉన్మత్తంగా జాయపుణ్నే చూస్తూ నృత్తం చేస్తున్నది. విగ్రహ రూపంలోనున్న రుద్రసేనాని తల్లిదండ్రులు మాత్రమే ఆమెకు ప్రేక్షకులు.
* * *
మాసంరోజులు అనుమకొండలో గడిపి స్వగృహం తలగడదీవి కోటలో ప్రవేశించగానే.. పిల్లలంతా చుట్టుముట్టారు. అందరినీ పేరుపేరునా పలకరించి ముద్దులిచ్చి ఆర్తిగా హత్తుకుని బెంగ తగ్గించుకున్నాడు. తిరిగి వాళ్లతో నర్తనం, ఆటలు, పాటలు మొదలయ్యాయి.
అదే సమయంలో కంకుభట్టు గురుకులం.. దాని వెనుకనుంచి చూస్తున్న ఆ జలకన్య.. అన్నీ గుర్తుకొస్తున్నాయి. కంకుభట్టు గురించిన కొంత అవగాహన ఏర్పడింది కానీ, మనసంతా ఆ మత్స్యకన్య ఆక్రమించింది. ముందు ఆమె ఎవరో.. ఏమిటో తెలుసుకోవాలి. తర్వాతే
కంకుభట్టయినా.. నాట్యమయినా!
నంగెగడ్డరేవు దగ్గరికి వచ్చాడు జాయపుడు. మారువేషం అంటే.. కేవలం రాజోచిత దుస్తులు వదిలేసి సాధారణ పంచె, కంచుకం, తలపై కండువా ధరిస్తే చాలు. రాజవంశీయులను ఎవరూ గుర్తించలేరు.
నంగెగడ్డలో రేవు ఒడ్డున కంకుభట్టు నాట్యారామానికి కాస్త దూరంనుంచే నీటి అంచువెంట వెళ్లి, దూరంగా నాట్యారామం వెనకవైపు ఆ నల్లపిల్ల కనిపించిన వైపు కళ్లు చికిలించి చూశాడు. ఆమె లేదు. బహుశా రాలేదు. ఉన్నచోటునే ఉన్నాడు. అదే సౌకర్యంగా ఉంది. దూరంగా నాట్యారామం ముందు ద్వారం, వెనకభాగమూ కనిపిస్తున్నాయి. పక్కగా ఏదో హాస్య సన్నివేశం చూస్తున్నట్లు.. నవ్వులతో గలగలా పారుతున్నది అమ్మ కృష్ణమ్మ!
దూరంగా ఆవల ఒడ్డున రహదారి రేవు కావచ్చు.. చాలా పడవలు. చిన్నవి పెద్దవి. అవతలగా విస్తృతంగా వ్యాపించి ఉన్న కృష్ణమ్మమీద మరెన్నో పడవలు.. వస్తూ పోతూ అదో సందడి. మరికాస్త ఆవలగా మరో రేవు.
పెద్ద పెద్ద పడవలు.. బహుశా సరుకుల రేవులా ఉంది. కూలీల పాటలు, పద్యాలు వినిపించీ వినిపించకుండా..
‘జోరుసేయ్.. బారుసెయ్.. నంగెగడ్డ రేవుసెయ్.. ఒయలో ఒయలో ఒయలో.. ఒయ్ ఒయ్!’..
చీకట్లు మెల్లగా కమ్ముకుంటున్నాయి. కృష్ణమ్మ దగ్గరగా నవ్వుతూనే ఉంది. వెనుకకు ఆమె రాలేదు. ముందు సందడి పెరుగుతున్నది. దీపాలు వెలిగించినట్లున్నారు. ఈరోజు ఏదైనా ప్రత్యేక నాట్యాంశం ఉండాలి. లేకుంటే ఈ రాత్రివరకూ శిక్షణ ఉండదు. లోపల వెలుగుతున్న కాంతి.. భవంతిని వెలిగిస్తున్నది. పడవల్లో దీపాలు.. పడవలతోపాటు ఊగుతున్న వెలుగులు.. జాయపునికి మనోహరంగా ఉన్నదా దృశ్యం. మామూలుగా అయితే ఎంతో పులకించేవాడే! కానీ, ఇప్పుడు అతని మనసంతా.. రసహృదయమంతా ఆమె కోసమే!!
అదుగో.. వచ్చింది వచ్చింది. ఆమె.. మెల్లగా కర్రలు, చెక్కలు పట్టుకుని ఒడుపుగా పైకి ఎగబాకుతున్నది. సంభ్రమంగా ఆమె ఒడుపును చూస్తున్నాడు. ఎక్కి స్థిరంగా నిలబడి లోపలి నాట్యాంశాన్ని చూస్తున్నది ఆసక్తిగా.
మెల్లగా వెళ్లాడు దగ్గరగా. లోపలినుంచి పైకి ఎగజిమ్ముతున్న కాంతిలో.. ఆమె ముఖం జాయపునికి స్పష్టంగా కనిపిస్తున్నది. ఇంతింత కళ్లు.. గుండ్రని మోము.. నీటిలో చేపలా ఈది ఈది నునుపుదేరిన శరీరం.. మొత్తంగా మీనలోచన! అతిపెద్ద మత్స్యకన్య! ఆ భంగిమలో ఆమెను చూడటం నిజంగా ఓ అబ్బురం! అనుకోకుండా చిన్నగా నవ్వాడు.
‘అయ్యయ్యో!’.. అనుకుంటూ, ఆమె కంట్లో పడకుండా మరింత అవతలికి జరిగాడు. ఆమెకు ఏదో సంశయం కలిగినట్లుంది. అటూఇటూ చూసి వెనక్కి మొగ్గ వేసి సర్రున ఏట్లో దూకేసింది.
‘అరెరే!’.. అనుకుంటూ అప్రయత్నంగా జాయపుడు కూడా దూకేశాడు. ఆమె వెనక ఈదుతున్నాడు. అతనికి ఈత తెలిసినా అనుమకొండలో అభ్యాసం తక్కువ. ఇప్పుడు ఊహాతీతంగా అనుకోకుండా ఉరికేశాడు. చీకట్లు ముదురుతున్నాయి. నదిపై చీకటి గాఢంగా ఉంది. ఆమె ఆ ఒడ్డుకు చేరేటప్పటికి.. జాయపుడు సగం దూరాన్ని మాత్రమే ఈదాడు. వగరుస్తూ తలెత్తి చూశాడు. ఆమె మునికాళ్లపై నడుచుకుంటూ ఒడ్డు చేరింది. మళ్లా ఈద సాగాడు.. రొప్పుతూ!
కవులు ఏదో అంటారు కానీ, జీవితాన్ని ఈదటం కంటే నదిని ఈదడమే కష్టం!
రొప్పు పెరిగిపోతున్నది. ఆవలి ఒడ్డు వేలమైళ్ల దూరంలో ఉన్నట్లు.. నీటితో కళ్లు మూసుకుపోతున్నాయి. ఊపిరి అందడం లేదు. అంగ వెయ్యలేక నీట్లో నిలబడిపోయాడు. ఆవలి ఒడ్డువైపు చూశాడు.
ఆమె.. ఆ మత్య్సపిల్ల మసకచీకట్లో, నీళ్లల్లో కదలాడుతున్న జాయపుణ్ని చీకటిలో కళ్లు చికిలించి చూస్తున్నది. చేయి ఎత్తాడు వగరుస్తూ. ఆమె గుర్తించి తనవైపు రావాల్సిందిగా చెయ్యి ఊపింది. ఏదో కొత్తశక్తి వచ్చినట్లు జాయపుడు మళ్లీ ఈత సాగించాడు. చివరికి ఒడ్డుకు చేరాడు. ఒడ్డుపై పాతేసిన సర్వి కర్రకున్న దైవవిగ్రహం ఎదుట నిలబడి ఉంది.
“ఎవురు నువ్వూ..? నా యనక ఎందుకొచ్చావ్..?” ఒకింత సంభ్రమం.
తనను, తన శరీరాన్ని పరిశీలనగా ఆమె చూడటం జాయపుడు గుర్తించాడు. తడిసిన పంచెను, కంచుకాన్ని పిండుకుంటూ అన్నాడు.
“నువ్వు గురుకులం వెనుకనుంచి లోపలికి తొంగి చూడటం నేను చూశాలే! చాటుగా నాట్యం చూస్తున్న పిల్ల ఎవరో తెలుసుకుందామని.. నీ వెనకే దూకేశా!”.
ఆమె విశాల మీన నయనాలలో మిలమిల.
“ఆడు.. ఆ పొంతులు నన్ను రావొద్దన్నాడు. ‘మీరు చండాలపోళ్లు.. మీకు నేర్పడానికి శాత్రం ఒప్పదు.. పో ఎల్లిపో!’ అని తరిమేశాడు. నాకేమో నాట్టెం అంటే వల్లమాలిన పేవ. అందుకే దొంగసాటుగా సూసి.. ఈడ నా సావి ఎదుట అచ్చు అట్టాగే ఆడేస్తా! అప్పుడు ఆడే కాదు.. దేవుడు కూడా నన్నాపలేడు!”.
ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. ఆమెను చూడటానికన్నట్లు మబ్బుల్ని విడదీస్తున్నాడు చందమామ.
కర్రకు కట్టిన దైవవిగ్రహం.. గోపాలుడు అంటున్నది. విష్ణురూపం.. వైష్ణవదేవుడు!
“ఇదిగో సూడు.. ఎట్టా ఆడతానో!”..
ఆ స్వామికి నమస్కరించి పది ఘడియల ముందు గురుకులంలో కంకుభట్టు, ఆయన శిష్యులు నర్తించిన అంశాలన్నీ ఆమె నర్తిస్తున్నది. కాస్త అటూ ఇటూగా. కళ్లు చికిలించి చూశాడు దిగ్భ్రమతో. అబ్బురం!!.
ఈవిడ శాపవశాన భూమిపై జారిపడిన అప్సరసో.. యక్షిణో.. కాదు కదా!
ఆపి నడుంపై చేతులుంచి చూస్తూ అన్నది..
“సూశావా.. అచ్చం అట్టాగే సేశానా నాట్టెం?!”..
‘చాలా బాగా చేశావు!’ అనబోయి..
“బాగా చేశావు. కాకపోతే అక్కడక్కడా తప్పులున్నాయ్. అయన్నీ నేను సరిచేస్తాలే..” అన్నాడు.
(సశేషం)
– మత్తి భానుమూర్తి
99893 71284