Jaya Senapathi | జరిగిన కథ : ఆస్థాన నాట్యాచార్యుడు కంకుభట్టు నిర్వహిస్తున్న నాట్య గురుకులానికి ఓ సాధారణ పౌరుడిలా వెళ్లాడు జాయపుడు. గురుకులం తలుపు తోసి తొంగిచూస్తున్న జాయపుణ్ని.. ఎవరో మెడపట్టి బయటికి తోశాడు. లోపలికి ప్రవేశం లేదంటూ అక్కణ్నుంచి వెళ్లగొట్టాడు. కానీ, జాయపుడికి లోపలికి వెళ్లాలన్న ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతున్నది. ఏం చెయ్యాలని ఆలోచిస్తూ.. గురుకుల భవనం వెనక్కి వెళ్లాడు. కృష్ణమ్మ అంచుపై కట్టిన ఆ భవంతి వెనక ఏవేవో కర్రలు, చెక్కలు ఉండగా.. వాటిపైకెక్కి ఓ అమ్మాయి లోపలికి తొంగిచూస్తున్నది. రెండులిప్తల కాలం అలా ఆమెనే చూశాడు.
అప్పుడే ఆమె తల బయటికి పెట్టి.. చూపువాల్చి, తననే చూస్తున్న జాయపుణ్ని చూసింది. మరుక్షణం జాయపుడు చూసిన ఓ అద్భుత దృశ్యం అతణ్ని నివ్వెరపరచింది. ఎవరో తనను చూస్తున్నారని గుర్తించిన ఆ అమ్మాయి కంగారుపడి.. వెనక్కి కదిలి ఒక్కఊపు తీసుకుని, ఓ గొప్ప క్రీడాకారిణిలా ఎగిరి పెద్దమొగ్గ వేసి.. సర్రున కృష్ణానది పాయలోకి జారింది. ఎంతో అనుభవం ఉంటే తప్ప ఎవ్వరూ అలా మొగ్గవేసి నదిలోకి దూకలేరు. ఆమె మునక వేసి లేచి జాయపుణ్ని చూస్తూ అల్లరిగా నవ్వింది. నాలుక చాచి, మడిచి వెక్కిరించింది. వేలితో మరోలా వెక్కిరించింది. శరీరాన్ని మొత్తంగా ఊపి ఇంకోలా వెక్కిరించింది. ఎన్నో వైవిధ్యమైన వెక్కిరింపులు. ఆనక మళ్లా నీళ్లల్లో ఎగిరిదూకి సర్రున మునిగి లేచి.. వేగంగా అవతల ఒడ్డుకు ఈదుకుంటూ పోయింది.
నది పాయ తక్కువగా ఏమీ లేదు. మరీ పెద్దది కాదుగానీ, ఆమె ఆ పాయను లిప్తల సమయంలో ఈది ఆవలి ఒడ్డున లేచింది. నాలుగడుగులు వేసి.. వంగి.. కట్టిన చీరెగోచి విప్పి, తొడలవరకు చీరెను పట్టి నీటిని పిండింది. తర్వాత ఛాతికున్న కుప్పసాన్ని తీసేసి.. నీళ్లు పిండి, ఆనక జెండాలా తిప్పుతూ.. విజయ సంకేతంలా.. ‘నన్ను పట్టుకోలేకపోయావ్!’ అన్నట్లు గంతులేసింది.
రెప్పపడటం లేదు జాయపునికి. ఆమె ఆచ్ఛాదనా రహితమైన వక్షస్థలం మృదువుగా ఎగిరెగిరి పడుతుండగా.. ఆమె నాట్యమాడుతున్నది. కుప్పసం ఊపుతూనే ఉంది. రొప్పొచ్చి వగరుస్తూ ఆగి.. నడుముపై చేతులుంచి, జాయపుణ్నే చూస్తున్నది.
విజయవిలాసం ఆమె నిలబడిన భంగిమలో.. నాట్యం ఆపినా రొప్పువల్ల ఆమె నిండు వక్షస్థలం మంద్రంగా గంతులు వేస్తూనే ఉంది. కళ్లముందు కనిపిస్తున్న దృశ్యం.. జరిగిన మొత్తం సన్నివేశం.. అతనికి అబ్బురంగా తోస్తున్నది. ఏం జరిగింది!? ఎందుకు తను ఇక్కడికి వచ్చాడు!? ఏం చూశాడు!? ఈ పిల్ల.. ఈ అద్భుత లలామ ఎవరూ!? ఆమెనే చూస్తున్నాడు.. రెప్పవెయ్యకుండా.
తిరిగి కుప్పసం తొడిగింది. జుట్టు విప్పి పిండి మళ్లీ ముడివేసుకుంది. అప్పుడు చూశాడు.. అక్కడొక కర్రస్తంభం నాటి ఉంది. దానికేదో దేవతావిగ్రహం కట్టి ఉంది. ఆమె ఆ విగ్రహానికి నమస్కరించి స్థానకం తీసుకుని నర్తించసాగింది. మతిపోయింది జాయపునికి.. బహుశా లోపల చూసిన నాట్య విన్నాణం అక్కడ దేవుని ఎదుట నర్తిస్తున్నట్లు గుర్తించాడు.
అప్పుడే ఎవరో వెనగ్గా భుజంపై తడితే.. అప్పుడు ఇహలోకంలోకి వచ్చి వెనుదిరిగి చూశాడు. నాట్యాచార్యుడు కంకుభట్టు.. ఇందాక మెడపట్టి గెంటిన కాపలావాడు.
“ఎవరు మీరు? ఇక్కడ.. మా గురుకులం వెనుక ఏం చేస్తున్నారు?”.
‘హమ్మయ్య!’ అనుకున్నాడు జాయపుడు.
ఎందుకంటే జాయపుణ్ని కంకుభట్టు గుర్తించలేదు.
“తమరిని కలవడానికి వచ్చాను. ఇతగాడు నన్ను మెడపట్టి గెంటివేశాడు” అన్నాడు నవ్వుతూ జాయపుడు. మళ్లీ తనే..
“పర్లేదు! నేను తలుపు తట్టకుండా తోసి లోపలికి రాబోయాను. అది నా తప్పేకదా..” అంటూ ఇద్దరినీ ఆహ్లాదపరిచేలా మాట్లాడాడు. జాయపుణ్ని ఎగాదిగా చూస్తున్నాడు కంకుభట్టు.
ఆయన ప్రశ్నించకుండా జాయపుడే చెప్పాడు..
“నేను రాజధాని.. ధనదుప్రోలు కాదు. అనుమకొండ నుంచి వచ్చాను. ఇక్కడ నంగెగడ్డలో బంధువులు ఉంటేనూ!”.. ఎక్కువ ప్రశ్నించకుండానే భట్టు తనను సౌమ్యంగా లోపలికి ఆహ్వానించాలని జాయపుడి భావన.
“కొద్దో గొప్పో నాట్యం తెలుసు. కాస్తో కూస్తో సంస్కృతం వచ్చు. తమరి గురించి అక్కడే.. అనుమకొండలోనే విన్నాను!”.
బాణం గుచ్చుకుంది. పూర్తిగా ప్రసన్న వదనుడయ్యాడు కంకుభట్టు. వంగి లోపలికి ఆహ్వానిస్తున్నట్లు భంగిమ పెట్టి నడుస్తూ అన్నాడు..
“అలాగా.. మేము ఇక్కడ వెలనాడులో ఆస్థాన నాట్యాచార్యులం!”.
“అదే అదే! అలాగే విన్నాం. కాకతీయ సామంత రాజ్యాలలో అత్యంత పిన్నవయస్కులైన నాట్యగురువు.. ఆస్థాన గురువుస్థాయి వారు మీరేనని. మీరొక్కరేనని.. నాట్యాచార్యుల కబుర్లలో విన్న సంగతి!”.
తిరుగులేదు. బాగా గుచ్చుకుంది. ఉబ్బి తబ్బిబ్బయిపోయాడు. ఉన్నతాసనం చూపి..
“ఆశీనులు కండి..” అన్నాడు కంకుభట్టు.
తనలో ఇంత ప్రతిభ ఉన్నట్లు గుర్తించడానికి ఆలస్యం అయినందుకు జాయపుడు కించిత్ బాధపడ్డాడు. అది లిప్తకాలమే! మిగతా అంతా ఆనందమే.. నాట్యానందమే!
నాట్యం గురించి తనకు తెలిసింది చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా.. కంకుభట్టు తన ప్రత్యేకతలు ఎన్నెన్నో ఉదాహరణలతో వివరించాడు. కంకుభట్టు ప్రతిభ జాయపుణ్ని ఆకర్షించింది.
ప్రతిభావంతునికి స్వోత్కర్ష కూడా అలంకారమే.. సందర్భాన్ని బట్టి అవసరం కూడా!
విద్యార్థులు విశ్రాంతి మందిరాలకు వెళ్లిపోయారని, మరో రోజు రావాల్సిందిగా ఆహ్వానించాడు కంకుభట్టు.
మరోరోజు కాదు.. రేపే వస్తానని చెప్పి.. చెప్పినట్లు పక్కరోజు వెళ్లాడు జాయపుడు.
ద్వారం వద్దే స్వాగతం చెబుతున్నట్లున్నారు గురువు, శిష్యులు. అంతా అనుమకొండ మహిమ.
అంతా జాయపునికి నాట్య వందనం చేశారు. వారిని చూసి ఆశ్చర్యపోయాడు జాయపుడు. కారణం.. అంతా పరిణత విద్యార్థులే. నేర్చుకుంటున్నారు అన్నట్లు కాకుండా.. ఇప్పటికే ప్రదర్శనల్లో ఆరితేరినవారిగా గుర్తించాడు. అదే చెప్పాడు కూడా. అవునన్నాడు కంకుభట్టు.
“మా గురుకులంలో మూడు దశల్లో శిక్షణ ఉంటుంది. ప్రాథమిక దశ, ప్రగతి దశ, ప్రౌఢ దశ.. వీళ్లంతా ప్రౌఢ. అంటే పూర్తిస్థాయి నాట్యకారులు. ప్రదర్శనానుభవం ఉన్నవారు కూడా!”.
ఇవి అన్ని గురుకులాల్లో ఉండే విభజనలే. అయినా కొత్తగా వింటున్నట్లు ముఖంలో ఆసక్తి ప్రకటించాడు. కంకుభట్టు గురుకులం నిజానికి చాలా ఉన్నతంగా ఉన్నది. విద్యార్థులు కూడా ప్రదర్శనల్లో ప్రకాండుల్లాగే కనిపిస్తున్నారు. అంతా జాయపుణ్ని పెద్ద నాట్యకారుణ్ని చూస్తున్నట్లు అభినందన దృక్కులతో చూస్తున్నారు. అటు యుద్ధ శిక్షణతోనూ.. ఇటు నాట్య శిక్షణతోనూ రాటుదేలిన నాట్యకారుని దృఢత్వ సౌకుమార్య శరీరం వాళ్లకు ఎక్కడా.. ఎప్పుడూ కనిపించి ఉండదు. నాట్య విద్యార్థుల చూపుల తూపులతో అనేకానేక దెబ్బల అనుభవమున్న జాయపుడు మృదువుగా నవ్వుతూ.. అందరినీ అభినందనగా చూశాడు.
“వీళ్లతో కొత్తకొత్త నాట్యాంశాలు రూపొందిస్తాను మిత్రమా. ఇంతకూ.. తమరి నామధేయం??”.
“జగన్నాథుడు. అవును.. జగన్నాథుడు..”
“అయితే కళింగరాజ్య నాట్య ప్రభువులన్నమాట!”.
జవాబివ్వకుండా నవ్వి..
“మీ శిష్యుల ప్రదర్శన చూడాలన్న కుతూహలం..”
“తప్పకుండా తప్పకుండా..” అంటూ, రకరకాల నాట్య విన్యాసాలు జాయపుని ముందు ఆయన చేస్తూ.. శిష్యులను ప్రేరేపించి చేయిస్తూ.. తన ప్రజ్ఞ ప్రదర్శించాడు. జాయపుడు తన సమ్మతిని కరతాళధ్వనుల ద్వారా తెలియజేశాడు. విద్యార్థులను కూడా అభినందించాడు. అందరూ అతనికి చేరువ అయ్యారు.
“భట్టుగారూ.. కొత్త నాట్య రూపకాలు ఏమైనా సిద్ధం చేస్తున్నారా?”.
“చేస్తున్నాను జగన్నాథా! త్వరలో కళింగ రాజ్యంలో కొత్తగా నిర్మించిన జగన్నాథుని దేవాలయంలో నాట్య ప్రదర్శన ఇవ్వబోతున్నాం. కళింగ కవి జయదేవుడు రచించిన అష్టపదులు ప్రదర్శించే బృందాలు కావాలని ఆహ్వానం పంపారు. ఆ అష్టపదులను నేను, నాదైన కొత్తకోణంలో ఆవిష్కరించబోతున్నాను. ఆ ఓడ్ర దేశపు నాట్యబృందాలను ఎదుర్కోవాలిగా.. చూస్తారా??”.
ఉత్సాహంగా తల ఊపాడు జాయపుడు.
కంకుభట్టు శిష్యులను ప్రదర్శనకు సమాయత్తం చేస్తుండగా.. జాయపునికి భవంతి వెనుకనుంచి చూసే అమ్మాయి గుర్తుకొచ్చింది. చటుక్కున అటువైపు చూశాడు. అతని సందేహం నిజమే అయ్యింది. ఆ అమ్మాయి మెల్లగా లోపలికి తొంగిచూడటం కంటపడింది. అప్పుడే కంకుభట్టు కూడా జాయపునికి తమ ప్రదర్శన గురించి వివరించబోయాడు. జాయపుడు పైకి చూడటంతో.. ఆయనా తలతిప్పి చూశాడు. ఇద్దరూ చూడటంతో ఆమె ముఖం చటుక్కున మాయమైంది. మరో క్షణంలో వెనుక నీటినుంచి పెద్దశబ్దం వినవచ్చింది. ఎవరో దూకినట్లు అక్కడున్న అందరూ గుర్తించారు. జాయపుడు అన్నాడు ఏమీ తెలియనట్లు..
“అరెరే.. వెనుక పైనుంచి ఎవరో తొంగిచూస్తున్నారే?”.
కంకుభట్టు అదేదో తెలిసిన సంగతే అన్నట్లు..
“మా గురుకులం ఉన్నది నంగెగడ్డరేవు అంచులో. ఈ చుట్టుపక్కలంతా చండాలవాడలు ఎక్కువ. ఆ పిల్లలంతా ఇక్కడ జరిగే నాట్యాలు చూడటానికి ఎగబడతారు. వాళ్లు రాకుండా కాపలావాణ్ని పెట్టాను. కానీ, ఓ పిల్ల.. పిల్ల ఏమిటీ పెద్దదే! వదిలి పెట్టకుండా పైకెక్కి లోపలికి తొంగి చూసి.. చూసినదంతా ఆ రేవు ఇసుకలో చిందు తొక్కుతుంది. పట్టుకోవాలంటే దొరకదు. నదిని అవలీలగా ఈది పారిపోతుంది. ఏమీ చెయ్యలేక వదిలేశాం..” విన్న జాయపుడు నోరు తెరిచాడు.
“అంత ఆసక్తి ఉన్న అమ్మాయికి మీరే నాట్యం నేర్పవచ్చుగా భట్టుగారూ!”. భట్టు వికారంగా చూశాడు జాయపుణ్ని.
“ఏమిటీ.. ఆ చండాలాంగనకు నాట్యమా!? ఆ నటరాజుకు, భరతమునికి అవమానం కదూ!?”.
ఏం చెప్పాలో తోచలేదు. అతనికి ఇంద్రాణి గుర్తొచ్చింది.. అప్పటికి మౌనంగా ఉన్నాడు. కానీ, లోలోన ఆ చండాలికను తనే అత్యుత్తమ నాట్యకత్తెగా సమాజం ఎదుట.. ముఖ్యంగా కంకుభట్టు ఎదుట నిలిపితే?!
‘శాలివాహన శకం 1135, శ్రీముఖ సంవత్సరం, మధుమాస వసంత శుక్లపక్ష అష్టమి ఆదివారం.. ఆతుకూరు గ్రామంలో వెలసిన రుద్రేశ్వరస్వామి దేవాలయం ప్రతిష్ఠాపనా మహోత్సవానికి రావాల్సిందిగా వెలనాడు మండలేశ్వరులు శ్రీశ్రీశ్రీ జాయపచోడ సేనానుల వారికి ఇదే మా ఆహ్వానం!!’..
ఆతుకూరు మండలేశ్వరుడు రుద్రయ సేనానుల అధికార నియోగం నుంచి వచ్చిన ఆహ్వానపత్రికను ఉత్సాహభరితుడై.. తమ్మునికి స్వయంగా అందజేయడమే కాదు.. స్వయంగా చదివి వినిపించి ఆనందించాడు పృథ్వి. పులకిత మనస్కుడై ఆ లేఖను అపురూపంగా అందుకుని కళ్లకద్దుకున్నాడు జాయపుడు.
మరో లేఖను చూపి చేతికిచ్చాడు పృథ్వి. బావగారు పంపిన లేఖ.. ‘నువ్వు ఆ ముహూర్తవేళ అక్కడ నృత్తం చేస్తే బావుంటుందని మా అభిప్రాయం. లలితాంబకు కూడా చెప్పాను. నాలుగు రోజులు ముందుగా రాగలవు..’
ఆయన ఆదేశం శిరోధార్యం. ఆ లేఖలలో సాక్షాత్తూ ఆ రుద్రేశ్వరుణ్నే చూసుకుంటున్నాడు జాయపుడు. తనకు ఆ దేవళంతో ఎంతటి అనుబంధం.. ఆ దేవదేవుడే పంపినట్లు.. రామప స్థపతి నాట్యప్రదర్శనలో తనను చూసి ఎన్నుకోవడం.. తన శరీరం, భంగిమలు చూసి ఆ మహాశిల్పుల కళ్లలో కదలాడిన కళాతృప్తి.. తన శరీరశోభ మరింత అద్భుతంగా ఆ రాళ్లలో సృష్టించాలన్న కళాత్మక పట్టుదల. పూర్తయ్యాక అందరూ కలిసి తనకు చూపించినప్పటి విజయగర్వపు క్షణాలు! ఓహ్.. ప్రతి లిప్తకాలపు మధురిమలు ఇప్పటికీ.. ఎప్పటికీ మరపురావు.
‘ఎప్పటికీ.. ఎన్నితరాల తరాలు మారినా వాటిని చూసిన ప్రేక్షకుడు ఆ తృప్తిని పొందాలి’ అనేవాడు రామప. చటుక్కున మనసు చించుకునిగుర్తుకొచ్చింది.. కాకతి!
‘నిన్ను మర్చిపోలేదులే! ఈ శిల్పాలలో నిబిడీకృతమైన మన సాన్నిహిత్య రసజ్ఞత ఎల్లప్పుడూ నిత్యనూతనంగా రవళిస్తూనే ఉంటుంది కాకతీ..’ మురిసిపోయింది కాకతి.
(సశేషం)
– మత్తి భానుమూర్తి 99893 71284