జరిగిన కథ : ‘తమిళ నాట్యబృందం నిర్వహిస్తున్న గోదాకల్యాణం యక్షగాన ప్రదర్శన చూద్దామా!?’ అంటూ వచ్చాడు పరాశరుడు. జాయపునికి కూడా ఆసక్తి కలిగింది. అతను ఇంతవరకూ పరభాషా ప్రదర్శనలు చూడలేదు. మిత్రునివెంట ఉత్సాహంగా వెళ్లాడు. పుర ప్రముఖులతో ఆ మందిరం కిటకిటలాడిపోతున్నది. కళా ప్రదర్శనలో చెలికత్తెల నృత్తం మనోహరంగా సాగుతున్నది. ఆ ప్రదర్శన చూస్తున్న జాయపుణ్ని.. ఏదో తెలియని తన్మయత్వం ఊపేస్తున్నది. రెప్ప వేయకుండా చూస్తున్నాడు.
ఆముద్రలు, స్థానకాలు, రేచకాలు, కరణులు, పిండిబంధాలు, బృంద రూపకల్పన.. సంగీతబద్ధ కదలికలు.. కంటికి ఇంపుగా ఉన్నాయి. నటీమణులు కూడా మెరపుతీగల్లా ఉన్నారు. పాడుతూ పాడుతూ వెళ్లి గోదాదేవిని తీసుకుని వచ్చారు. అద్భుతమైన సంగీతవాద్యాల నేపథ్యంలో.. గాయనీమణుల మృదువైన ఆహ్వానగీతంతో కదలివచ్చిన గోదాదేవిని చూస్తూ.. మాట పడిపోయినట్లయ్యాడు జాయపుడు. ఆ నటి ముమ్మూర్తులా దేవతలా దేవుణ్ని ప్రేమించి భజిస్తున్న ముగ్ధ జవ్వనిలా.. అచ్చమైన గోదాదేవి ఆమె!
శభాష్.. పాత్రధారణ అంటే ఇలా ఉండాలి!!
గోదాదేవీ వందనమూ.. శ్రీరంగనాయకీ వందనమూ..
ధరణిపుత్రీ.. వందనమూ.. మంగళ దీపికా వందనమూ..
రంగనాథుణ్ని ప్రేమించి పూజించి ఆరాధించి మార్గశిర మాసమంతా పాశురాలను రచించి పరవశించి పాడి ఆయనను పరవశింపజేసి.. విగ్రహమూర్తిగానే ఆయనకు దగ్గరైన గోదాదేవి కథాంశం.. నిజంగా మధురమే!
మొదటి అంకంలో ఈ సంగతులన్నీ చెబుతూ ఆమె ప్రతిమ ఆరాధనను, ప్రేమను ఆమెముందే కీర్తిస్తూ చెలికత్తెలు ఆ అంకాన్ని అద్భుతంగా రక్తి కట్టించారు.
జాయపునికి బాగా నచ్చింది కథ. అర్చామూర్తిని.. అంటే విగ్రహారూపాన్ని ప్రేమించడం.. భలే.. విస్మయం!!
విష్ణువు అర్చావతారాలు ఐదు. పరం, వ్యూహామూర్తి, విభవమూర్తి, అంతర్యామి, అర్చామూర్తి. రెండవ అంకంలో రంగనాథుడు అర్చామూర్తిగా ప్రవేశించాడు. నిజమైన స్వామి విగ్రహమే కదలాడుతున్నట్లు ఆ పాత్రధారికి రంగోద్దీపనం చేశారు.
ఆయనపట్ల గోదాదేవికి ఉన్న తీవ్రమైన ప్రేమను ఆరాధనను వ్యక్తపరుస్తూ ఈ అంకమంతా నడిచింది. గోదాదేవి, రంగనాథ అర్చామూర్తి, చెలికత్తెలు.. తమ నటనతో ఆ అంకాన్ని గొప్ప రమణీయ కావ్యంగా ప్రదర్శించారు. తర్వాత వారిద్దరి ప్రణయ సన్నివేశాలు.. ముగింపుగా వివాహఘట్టం!!
ప్రదర్శన అంతా చూశాక అద్భుతం అనిపించింది జాయపునికి. కానీ, నాట్య సంప్రదాయాలను.. అంగ, ప్రత్యంగ, కరణ, ముద్ర, పిండిబంధ.. తదితర నాట్య రూపకల్పనా విధానాలను పోల్చిచూస్తే.. మన ఆంధ్రుల కూర్పు మరింత అద్భుతంగా ఉంటుంది. నీలాంబక్క అయితే ఈ గోదాకల్యాణాన్ని మరింత గాఢంగా రూపుదిద్దగలదు. ఈ తమిళనాట్య సంప్రదాయాలు తెలుగువారి సంప్రదాయాల కంటే కాస్త తక్కువస్థాయిలో ఉన్నట్లు భావించాడు. కానీ కానీ.. ఈ ప్రదర్శనలో ఏదో ఆకర్షణ ఉంది. ఏమిటది.. ఏమై ఉంటుంది?!
ఆ నటీనటబృందం ప్రదర్శనలో ఏ తాదాత్మ్యాన్ని పొందుతుందో.. ప్రేక్షకుడిగా తనూ ఆ తన్మయత్వాన్ని పొందాడు.. అది నిజం!!
మళ్లీ తాదాత్మ్యం.. తన్మయత్వం!! ప్రదర్శన చూసి ప్రగాఢంగా ప్రభావితమైనవాడు పరాశరుడు.
“జగన్నాథా! చూడు చూడు భలే ఉంది. తెలుగులో దీనెమ్మా మొగుడులాంటి యక్షగానం రాస్తాను చూడు”.
చిరునవ్వు నవ్వాడు కానీ, లోలోన ఆలోచనలు.. ఆ నటులు తాదాత్మ్యంతో నర్తించారు. ప్రేక్షకుడిగా తను తన్మయుడై చూశాడు. రచయిత పరాశరునిపై ప్రగాఢ ప్రభావం చూపింది. కొత్త రచనలకు మార్గదర్శకం అవుతున్నది.
తాదాత్మ్యత.. తన్మయత.. ప్రగాఢ ప్రభావం!!
అనంతరం మఠాధిపతి ప్రవచనం..
“అదే ముగ్ధ భక్తి. ఆ రంగనాథుడు సృష్టించిన మోహావేశం.. అమ్మవారు ఆ ఆండాలు తల్లి.. స్వామిని కొలిచినతీరు.. ఆ భక్తి ఆ పారవశ్యం.. ఆ అద్భుత కళాసృష్టి.. వైష్ణవస్వాముల రచనల్లో మాత్రమే సాధ్యం. శైవంలో ఉన్న ఎగిరి గెంతడాలు.. అరుపులు కేకలు.. నిప్పులపై నడవడాలు.. వీపులకు శూలాలు గుచ్చుకుని గిరగిరా తిరగడాలు మన వైష్ణవంలో లేవు. దేవునికి భక్తునికి మధ్య ఉండాల్సింది ప్రేమ, భక్తి, పారవశ్యం. స్వామీ.. నిన్నే నమ్మాను. సర్వం నీవే. పాల ముంచినా నీట ముంచినా నీవే. నీవే సర్వస్వం. విశిష్టాద్వైతం మన ప్రధాన జీవనవిధానమని వైష్ణవం చెబుతున్నది. వైష్ణవులది మధురభక్తి. మన నాట్యాలు, రూపకాలు లలిత లాలిత్యంగా.. లాస్య ప్రధానంగా ఉంటాయి.. ఉండాలి. తాండవం మనకు సరిపడదు. అది శైవులగోల!”.
“తప్పు!”..
ఓ గొంతుక గట్టిగా వినిపించింది. మఠాధిపతే కాదు.. మొత్తం మఠమంతా నిశ్శబ్దమైపోయింది.
అర్థం అయ్యిందో లేదో తెలియని అలౌకిక మానసికస్థితిలో వింటున్న భక్తబృందపు వెనక వరుసనుంచి ఎవరో అరిచారు. జాయపుని పక్కన కూర్చున్న పరాశరుడు ఏదో పిడుగుపడ్డట్టు బెదిరిపోయాడు. ‘తప్పు!’ అంటూ అరచింది.. సాక్షాత్తూ తన పక్కనున్న జగన్నాథుడు.
జాయపుడు మళ్లీ గట్టిగా..
“తప్పు..” అంటూనే లేచి నిలబడ్డాడు.
మందిరంలోని భక్తులంతా తలలు మాత్రమే కాదు.. మొత్తంగా జాయపుని వైపు తిరిగారు. ఉద్వేగంతో అంతా మాటరాక రెప్ప వేయకుండా చూస్తున్నారు.
మఠాధిపతికి ఎదురుగా ఆయన చెప్పింది తప్పు అనడం వాళ్ల ఎరుకలో ఎప్పుడూ జరగలేదు. అడిగేటంతగా వాళ్లకు ఆయన ప్రవచనం అర్థంకాదు కూడా. యతిరాజాచార్యులు క్షణకాలంలోనే తెప్పరిల్లి ప్రసన్నదృక్కులతో జాయపుణ్ని చూశాడు. ఏ మాత్రం కోపగించుకోని ఆయన ప్రసన్నత జాయపునికి నచ్చింది కూడా.
“అవును మహాస్వామీ! తాండవం వైష్ణవ నాట్యసంప్రదాయాలలో లేదని ఎలా అంటారు?! బాలకృష్ణుడు కాళీయుని పడగలపై చేసింది తాండవ నృత్తమనే కదా భాగవతకారుడు రచించింది?! అందుకే ఆయనను తాండవకృష్ణుడు అని కదా మన ఆళ్వారులు కీర్తించినది!?”.
మందిరంలో చీమ చిటుక్కుమంటే వినపడేటంత నిశ్శబ్దం!! తాండవంపై, నృత్తంపై జాయపునితో పండితచర్చలో గెలిచే వారెవ్వరూ లేరు.
జాయపుడు అడిగిన ప్రశ్న, లేవనెత్తిన సందేహం, ఆయన చెప్పిన వివరణ మందిరంలోని భక్తులందరికీ విస్పష్టంగా అర్థమైంది. యతిరాజులు కూడా ఆనందాన్ని ముఖాన ప్రతిఫలింపజేస్తూ ఆశీర్వాదంగా చేయెత్తి తన అంగీకారాన్ని ప్రకటించాడు. ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నది జాయపుడే. తన అసలురంగు బయటపడటం.. అతనికి ఇష్టంలేదు. మనిషికి మారువేషం నప్పుతుందేమో కానీ, ప్రతిభకు మారువేషం నప్పదు.
నివురు ఎల్లప్పుడూ నిప్పును కప్పి ఉండటం సాధ్యంకాదు కదా!
అందరికంటే ఎక్కువ నిర్ఘాంతపోయినవాడు పరాశరుడు. రాజధాని అనుమకొండ నుంచి వచ్చిన నాట్యాచార్యుడంటే గౌరవించాడు కానీ, జగన్నాథునిపై సందేహపడలేదు పరాశరుడు. పెద్దన కళాగృహంలో అతని నాట్యకౌశలం, సంస్కృత తెలుగు సాహిత్యంపైనున్న అధికారాన్ని గుర్తించాడు కానీ, మఠాధిపతి ప్రవచనంలో తప్పులెంచి మందిరంలో లేచి నిలబడి.. భాగవతంలోని ఓ సూక్ష్మాంశాన్ని ఎత్తి వివరించాడంటే.. జగన్నాథునిపై గౌరవం మరింత పెరిగింది. అదే సమయంలో ఓ సందేహం.. ఇతను పండితుడు మాత్రమేనా..?!
ఇద్దరూ పక్కపక్కనే నడుస్తున్నారు. ఏం మాట్లాడాలో తెలియకుండా ఉంది ఇద్దరికీ. వాతావరణాన్ని తేలికపరుస్తూ అన్నాడు జాయపుడు.
“గుండయామాత్యుల గురుకులంలో బాలకృష్ణుని కథలతో ఓ నాట్యరూపకాన్ని రచించి ప్రదర్శించాం. కానీ, అప్పుడు నాకు శ్రీకృష్ణుడు దేవుడు అనే భావనే తెలుసుకానీ, ఆయన వైష్ణవదేవుడు అనే సంగతి తెలియదు పరాశరా.. కళారూపాలలో, సాహిత్యంలో శైవదేవుడు, వైష్ణవదేవుడు.. ప్చ్! అవసరమా.. అప్పుడే ప్రదర్శనను ఆస్వాదించగలమా.. ఏమో!?”.
జగన్నాథుడు ఈ మతాంశాల ప్రభావంపై లోలోపల సంఘర్షించుకుంటున్నాడని పరాశరుడు గుర్తించాడు. కానీ, అతని ప్రధాన సందేహం మతాంశాలు కాదు. “సరే సరే! నేను బయల్దేరతాను మిత్రమా..” అంటూనే, జాయపుని జవాబు కోసం ఆగకుండా వెళ్లిపోయాడు.
ధనదుపురం వీధులగుండా నడుస్తూ సంధ్యచీకట్లు కమ్మేవేళకు రాజనగరి చేరాడు జాయపుడు. మహాద్వారం వద్ద అతని కోసమే ఎదురుచూస్తున్న సహాయకుడు పల్లికేతు పరుగున అశ్వంతో దగ్గరికి వెళ్లాడు. జాయపుడు విక్రమ వీపు తట్టి అధిరోహించగా.. ధనధుపుర కోట శ్రీవాకిలి శివగండమయ, ఇతర ద్వారరక్షకులు తలవాల్చి నిలబడగా లోపలికి వెళ్లిపోయాడు జగన్నాథుడిగా తెలిసిన జాయపుడు.
దూరంగా.. చాటుగా చూస్తున్న పరాశరుని శరీరం గగుర్పాటుకు గురయ్యింది.
* * *
భక్తి.. మధురభక్తి! ముగ్ధభక్తి!!
గ్రంథాలను పరిశీలించి భక్తి అనే పదాన్ని మొదటగా అర్థం చేసుకుని పులకించాడు జాయపుడు. భలే.. భక్తి అంటేనే గమ్మత్తుగా ఏదో మనసుకు తాకుతున్నట్లుంది. భక్తిలో మళ్లీ మధురభక్తి అట.. భక్తి అంటేనే మధురంగా లేదూ!? మళ్లా మధురభక్తి అనడం.. ప్చ్! ఇది కూడా బావుంది. ఇది కాక ముగ్ధభక్తి అనేదొకటి ఉందిట. అసలు ఆ పదమే జాయపునికి నచ్చింది. ముగ్ధ!!
ఈ ముగ్ధ అనే భావాన్ని నాట్యభంగిమలో ఎలా ప్రదర్శించాలీ!? గేయంలో సంగీతమనే పాలు పోసి కలిపే వాగ్గేయకారులు ఏ లలితపదాలు వాడతారు.. ఈ ముగ్ధను వాద్యంలో ఎలా పలికించాలి!?
శరీరాన్ని, చేతులను వంపుతూ, తిప్పుతూ కరణాలు, భ్రమరి, ముద్రలు, పిండిబంధాలు ఆలోచిస్తూ.. లాస్య భావనల్లో ముంచి తీస్తూ అలౌకిక భక్తి తాదాత్మ్యాన్ని పొందుతున్నాడు.
ఈనాటికి.. అంటే తన కాలానికి తన చుట్టూ ఈ భారతీయ సమాజమంతా వైష్ణవంలోని భక్తితోనూ.. శైవంలోని భక్తితోనూ.. ఇటు మతాలు అటు కళారూపాలు.. ఉద్రిక్తంగా ఆత్మాహుతి చేసుకునేవి ఎన్ని ఉన్నాయో, అలాగే సౌమ్య భక్తి కళారూపాలూ అన్ని ఉన్నాయి. ఈ కాలానికి రెండూ రెండే అన్నంత సమ ఉజ్జీలుగా ఉండటం జాయపుణ్ని ఆహ్లాదపరచింది. కొండొకచో కొంత ఆనందపరచింది. కారణం.. శైవం పైచేయిగా ఉంటే అది తనను ఇబ్బంది పెట్టేది అనే భావన ఇప్పుడే పొడసూపింది.
భక్తిని కళలతో మేళవించడం వల్ల సమాజం భక్తిభరితం అయ్యిందా..!? లేక భక్తి వల్ల కళలు మరింత వికసించి విజృంభిస్తున్నయా..!?
ఆదిమ సంఘజీవి మానవుడు, గణాల యుగం, జనపదాల యుగం.. మనుషులు జంతువుల కంటే కాస్త నయం అన్నట్లుండే ఈ ఆదిమ యుగాల కాలంలో అంతా ఉగ్రమే! ఉద్రేకాలు ఎక్కువ. సాత్వికత తక్కువ. రెండుగణాల మధ్య చర్చలు అంటే జబ్బలు చరచుకోవడం.. కొట్టుకోవడం.. చంపుకోవడం! బతికినవాడే విజయుడు. కొట్టుకోవడం చంపుకోవడమే నాయకత్వ లక్షణం. ఎదుటివారిని కొట్టి చంపి వాళ్లు దాచుకున్న ఆహారాన్ని దోచుకున్నవాడే నాయకుడు. చేతిలో ఎప్పుడూ కత్తో, గొడ్డలో ఉంటుంది. మరివాడు మాట్లాడతాడా.. ఊహు! కలబడటమే మాట్లాడటం. వాడే మగతనం ఉన్నవాడు. వాడికి అప్పటికే పదిమంది పెళ్లాలున్నా.. నేనూ సిద్ధమని మరో ఆడది అనేలా మహిళా వ్యవస్థ ఉంది.
కాబట్టి అప్పటి దేవతలు రుద్రుడు, పశుపతి, భవుడు, శర్వుడు, ఈశానుడు, ఉగ్రుడు, భీముడు, మహాదేవుడు.. ఆయా యుగపు ప్రజల తీరుకు అనుగుణమైన లక్షణాలున్న దేవతలు. చిత్రంగా అప్పుడు కూడా నారాయణుడు, సంకర్షణ, వాసుదేవ.. ఇంద్ర.. విష్ణు.. ఈ పేర్లున్న దేవతలు కూడా ఉన్నారు. అంటే ఆ ఆదిమజాతుల్లో కూడా సాత్వికులు ఉండేవారని.. కొట్లాటల వల్ల ఫలితం రాదనీ.. నువ్వు ఒకణ్ని చంపి వాడి సొమ్మును, వాడి భార్యను లాక్కుపోతే.. రేపు మరొకడు నిన్ను చంపి నీపెళ్లాన్ని, నీ ఆవుల్ని, గేదెల్ని.. నువ్వు దాచుకున్న తిండిగింజల్ని ఎత్తుకుపోతాడు. కాబట్టి మాటామంతీతో అందరం కలిసిమెలసి ఉంటే పులీ రాదు తోడేలూ రాదు. అందరం భయంవదిలి వేళకు ఇంత తిని ప్రశాంతంగా కాస్త కునుకు తీయవచ్చు. ఇలా ఆలోచించే సాత్వికులకు ప్రధానదేవుడు విష్ణువు. నలుగురికి మంచి చెప్పి.. అంతూదరి లేని సముద్రమనే మహాప్రపంచాన్ని మధించి.. పుట్టిన అమృతాన్ని అందరికీ పంచే ఈ విష్ణుమూర్తి అనే దేవుడు ఎక్కువమందిని ఆకర్షించలేదు.
(సశేషం)
– మత్తి భానుమూర్తి
99893 71284