Jaya Senapathi | జరిగిన కథ : ఆస్థానవైద్యుడు తిరునగరిభొట్లు అనుచరుడు కొండుభొట్లును ఎవరో చంపి.. జాయపుని పురనివాసం ముందు పడేసి పోయారు. ఆ శవాన్ని చూసి తెల్లబోయాడు జాయపుడు. నారాంబ కొడుకు, జాయపుని మేనల్లుడు హరిహరదేవుడు అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఈ కొండుభొట్లే దగ్గరుండి మరీ వైద్యం చేస్తున్నాడు. వెంటనే నారాంబకు విషయం చెప్పాడు. అది విని నిలువెల్లా వణికిపోయింది నారాంబ.కొండుభొట్లు మరణం వెనకాల ఏదో కుట్ర ఉన్నదని జాయపుడు గ్రహించాడు. చాలా ఉద్విగ్నుడయ్యాడు.
ఈ ప్రచ్ఛన్నయుద్ధం కంటే ప్రత్యక్షంగా ఎదురుబదురుగా నిలబడి ధర్మయుద్ధం చెయ్యడం చాలా తేలిక. ఉద్రేకం క్షణక్షణానికీ పెరిగిపోతుండటంతో రాజనగరి ముందుకు వచ్చాడు జాయపుడు. అక్కడ కోట శ్రీవాకిలి అంకయనాయకుడు.. పుర రక్షకభటులకు ఏదో చెబుతూ తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు. ఆయన వద్దకు వేగంగా వెళ్లాడు.
తీవ్ర స్వరంతో.. “ఏం చేస్తున్నారు దండనాయకుడు గారూ.. రాజధానిలో హత్యలా!? రాజాస్థానపు వైద్యుణ్ని ఎవరో నరికి చంపి.. ఆ శరీర భాగాలను నడివీధిలో చక్కగా అలంకరించి పెట్టారు. మనమంతా యుద్ధాలలో శత్రువులను చంపుతాం కానీ రాజధానిలో ఆస్థానవైద్యుణ్ని చంపడం ఏమిటి.. ఇది ఎలా జరిగింది?”.. రాజనగరి పరిసరాలలో అధికారగణాలను ధిక్కరించి వేలెత్తి చూపుతూ ఇలా అరచి మాట్లాడటం జరగదు.
సాధారణ సంభాషణ కూడా చాలాతక్కువ గొంతుకతో మాట్లాడేచోట.. జాయపసేనానిలాంటి ముఖ్య నాయకుడు ఇలా మాట్లాడటం పెద్ద విశేషం.
జాయపుణ్ని అనునయించడానికి శ్రీవాకిలి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. కానీ, చాలా ఉద్రేకంగా ఉన్న జాయపుడు తగ్గడంలేదు. అకస్మాత్తుగా అతని దృష్టి పక్కనున్న ధర్మగంట మీదికి పోయింది. తీవ్ర ఉద్రేకంగా ఉన్న జాయపునికి అది చక్రవర్తి మొదటికొలువు ప్రారంభమయ్యే సమయమని గుర్తొచ్చింది. మరి ఆలస్యం చెయ్యకుండా వేగంగావెళ్లి ఆ ధర్మగంటను మోగించాడు.
లోపలినుంచి రాజ్యకార్యకలాపాల నియోగమంత్రి ధమ్మకీర్తి బయటికి పరిగెత్తుకొచ్చాడు.
“కాకతీయ రాజ్య రాజధాని నగరంలో ఆస్థానవైద్యులకే దిక్కులేదు. చంపి ముక్కలుచేసి వీధిలో పరుస్తున్నారు. దీనికి అధికారులు ఏం సమాధానం చెబుతారు? చక్రవర్తినే అడుగుతాను!”..
అధికారులంతా జాయపుని దగ్గరకువెళ్లి ఆయన్ను చుట్టుముట్టి అనునయించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన తగ్గడంలేదు. అలాంటిది ఉన్నట్టుండి అందరూ జాయపుణ్ని వదలి కాస్త పక్కకు జరిగారు. అరచి మాట్లాడుతున్న జాయపుడు తలెత్తిచూస్తే.. రాజనగరు సింహద్వారం వద్ద నిలబడి నిప్పులు చెరిగే కళ్లతో చూస్తున్న గణపతిదేవుడు!! క్షణకాలం తొట్రుపడ్డ జాయపుడు తమాయించుకుని..
“చూశారా దేవరా.. రాజధాని నగరంలో జరిగిన ఘోరం. నా భవంతి ముందు మన వైద్యుణ్ని చంపి పడేశారు. ఇది ఎంత ఘోరం. ఇలా అయితే మన నగరం, కాకతీయ రాజ్యపు..”.
“ఆపు.. ఆపు! ఏమా ధిక్కారం!? ఏమా వాచాలత్వం!? ఆపు ఆపు..” గర్జించాడు గణపతిదేవుడు.
అందరూ అదిరిపడి ఆయన ముందు తలవంచి నిలబడ్డారు. ఉగ్రుడైన చక్రవర్తిని చూడగానే జాయప కాస్త తగ్గాడు. ఉద్రేకం కాస్త చల్లబడింది. చక్రవర్తి బయటికి రావడం చాలా పెద్దవిషయం..
క్రోధారుణ దృక్కులతో.. “న్యాయాధికారికి చెప్పి ఈ వాచాలుణ్ని కారాగారంలో పడేయండి. పక్షంరోజులు తిండి తిప్పలు లేకుండా కఠినశిక్ష అనుభవిస్తే వాచాలత తగ్గుతుంది. తీసుకుపోండి!”.
జాయపుడు ఏదో చెప్పబోయాడు కానీ, రక్షకభటులు నోరుమూసి లాక్కుపోయారు.
మరో పదిఘడియల తర్వాత కారాగారంలో ఉన్నాడు జాయపుడు. మరోజాముకు ఉద్రేకమంతా పూర్తిగా తగ్గిపోయింది. ఏం జరిగింది!? ఎందుకు తను అంత ఉద్రేకపడి పోయాడు!? బావగారిని కలిసి జరిగింది చెబితే.. ఆయనే చర్య తీసుకునేవారేమో!? అసలు తనే దండనాయకుడికి చెబితే ఆయన తన మాటకు విలువ ఇచ్చి అసలు దుండగులను బంధించేవాడు కదా!? ఎందుకు ఇంత ఉద్రేకపడిపోవడం!? ప్చ్.. అసలు చక్రవర్తి అంత కోపంగా ఉండటం.. అప్పుడెప్పుడో చిన్నప్పుడు తను యుద్ధానికి వస్తానంటే కోపంగా అరిచారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇవ్వాళ ఆయన కోపంతో అరిచారు. లేదు లేదు.. తనే అరిచేలా చేశాడు. ఆయన ఎంత బాధపడుతున్నారో నా ఈ ప్రవర్తన వల్ల. మరి అక్కో?! ఆమె కూడా బాధపడుతుంటుంది. జాయపసేనాని లాంటి అత్యున్నత శ్రేణి యుద్ధవీరుణ్ని సాధారణ పౌరునిగా శిక్షించడం.. చతుష్పథ రాతిబండ వద్ద పురజనులు ఎలా భావిస్తున్నారో.. ఏమి వాఖ్యలు చేస్తున్నారో..
కారాగారంలో పక్షం రోజులున్నాడు జాయపుడు. ఎవ్వరూ రాలేదు. నారాంబ అక్కగానీ, చౌండ బాబాయి గానీ, రుద్రసేనాని పెదనాన్నగారు గానీ.. ఎవ్వరూ రాలేదు. కారాగారం నుంచి బయటపడినప్పుడు మాత్రం.. సుబుద్ధి మామ తమ్ముడు భైరయతో వచ్చాడు. వాళ్లిద్దరూ కూడా రావడానికి భయపడ్డారట. చక్రవర్తి ఇంకా ఉగ్రంగానే ఉన్నారని వాళ్లు చెప్పారు. ఆయనలో అంతకోపం ఎప్పుడూ చూడలేదని మొత్తం నియోగవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట.
కారాగారం నుంచి విడుదలయ్యాక వారంరోజుల వరకూ రాజనగరికి వెళ్లలేదు జాయపుడు. పుర నివాసంలోనే ఉండిపోయాడు. నారాంబ కబురు పెడితే వెళ్లాడు. ఆమె కన్నీటి వరద అయ్యింది.
“ఎందుకు జాయా.. అంత కోపం!? బావగారు చాలా బాధపడుతున్నారు. ‘నేను నా మనసులో మాటలు వాడితో చెప్పుకునేవాణ్ని. కానీ, వాడు వీధికెక్కి అధికారుల్ని అల్లరిపెట్టాడు’ అని ఆయన బాధపడుతున్నారు. వెళ్లి ఆయన కాళ్లపై పడు. క్షమించమని ప్రార్థించు!” అన్నది నారాంబ.
“అమ్మో.. అయన ముందు నిలబడే ధైర్యంలేదు. ఘోరమైన అపరాధం చేసేశాను!”. అప్పుడు గుర్తొచ్చింది అసలు ప్రశ్న.. కొండుభొట్లు మరణం సంగతి. కారణం తెలియరాలేదు. తన ఉద్రేకం వల్ల సమస్య పక్కదారి పట్టింది. అదే నారాంబను అడిగాడు. “అక్కా.. అసలు ఏం జరిగిందంటే పాపం కొండుభొట్లు..” ఆమె చివ్వున..
“వాడి చావు దేవుడు రాసింది. వాడు చావాల్సిందే!” అన్నది నారాంబ. ఆశ్చర్యపోయాడు జాయపుడు. “ఏమిటి అక్కా. ఏమిటి అంత కోపం? ఇదే కోపం నేను ప్రదర్శిస్తే..”. “వాడు నీ మేనల్లుడిపై విషప్రయోగం చేశాడు జాయా!”. విభ్రాంతితో చూశాడు జాయపుడు. ఊహాతీతమైన జవాబు!
“వాడు.. హరిహరునిపై విషప్రయోగం చేశాడు. రాజవైద్యుడు సమయానికి రాబట్టి వీడి బండారం బయటపడింది. లేకుంటే నాబిడ్డ నాకు దక్కేవాడు కాదు!”.
తిరిగి ఉద్రేకానికి గురయ్యాడు జాయపుడు. కాసేపటికి ఆ ఉద్రేకం అణచుకుని.. “బావగారికి చెప్పావా?” అన్నాడు.
“చెప్పాను. భయపడుతూనే చెప్పాను. వారు నిశ్శబ్దంగా విన్నారు. విన్నాక.. ‘ఇంకెవ్వరికీ చెప్పకు. నేను చూసుకుంటాను’ అన్నారు”.
దిగులు పడిపోయాడు జాయపుడు. పసివాడి మీద విషప్రయోగమా!? సాక్షాత్తూ అంతఃపురంలో.. ఆస్థాన వైద్యుడి చేత చేయించారంటే ఇది పెద్దకుట్రకు నాంది. సందేహం లేదు. ఏదో ఘోరమైన కుట్ర జరుగుతున్నది. అక్క మీద, ఆమె పిల్లలమీద, ఆమె తమ్ముడి మీద.. ఏదో జరుగుతున్నది. ఇది నిజం. గట్టిగా ప్రశ్నిస్తే బావగారికి కోపం వస్తున్నది. ఎలా? రెండు రోజులు తర్జనభర్జనలు పడ్డాడు. ఇది మిత్రులకు చెప్పే అంశం కాదు. ఆయనకు చెప్పకుండా తనే ఈ అంశాన్ని తేల్చుకుని అక్కకు రక్షణ కల్పించాలి. అంకమరట్టను పిలిచి ఏం చెయ్యాలో చెప్పాడు జాయపుడు.
“రోజూ అంతఃపురంలోకి వెళ్లే మగవాళ్లు ఎవరు? అందులో నేరచరిత్ర ఉన్నవారెవ్వరు? ప్రసాదిత్య సేనాపతి కదలికలు.. నాకు ఎప్పటికప్పుడు తెలియాలి!”.
వారం రోజుల తర్వాత అతను చెప్పినవార్త విని స్థాణువైపోయాడు జాయప.
“ఆ హత్యకు ప్రసాదిత్యసేనానికి సంబంధం ఉంది నాట్యాచార్యా!”.
“ఇది నేను సందేహించినదే!”.
“ప్రసాదిత్య సేనాపతికి సహకారం అంతఃపురం నుంచి అందుతున్నది నాట్యాచార్యా!”.
“అంటే.. అంటే.. వైద్యుని మరణం.. అంతఃపుర ప్రయోగమేనా?”. అవునన్నట్లు తల ఊపాడు అంకమరట్ట.
అంటే.. అంటే.. పసివాడు హరిహరునిపై విషప్రయోగం కావాలని చేసిందేనా. అది అంతఃపుర ప్రచోదితమేనా? అడగలేదు. ఆ అభిప్రాయం జాయపుని ముఖంలో తేజరిల్లింది. మీ అభిప్రాయం నిజమేనన్నట్లు తలపంకించాడు అంకమరట్ట. నవనాడులు కుంగిపోయినట్లు ఆసనంలో ముడుచుకుపోయాడు జాయపుడు. అంకమరట్ట వెళ్లినా అలాగే కూర్చుండిపోయాడు. ఈసారి గత అనుభవాల దృష్ట్యా స్థిమితంగా ఆలోచించాడు. ఇదేదో పెద్ద విషవలయంగా తోస్తున్నది. ఎలా? తన మేధస్సు ఇలాంటి వాటికి ఉపయోగపడదని జాయపుడు నిస్పృహ చెందాడు. ఆలోచనల్లో స్పష్టత రావడం లేదు. ఇవి చక్రవర్తికి తెలుస్తున్నాయా? ప్చ్.. ఏమో!?
మరునాడు గజశాల నుంచి చక్రవర్తి కొలువుకు వెళ్లాడు. అప్పుడే మొదటి కొలువు పూర్తయ్యింది. చక్రవర్తి తన మందిరానికి వెళ్లాడు. బయట ఉన్న జాయపునికి లోపలికి రావాల్సిందిగా పిలుపు వచ్చింది. ఆసక్తిగా లోపలికి వెళ్లాడు.
చక్రవర్తి పక్కన మహాప్రధాని గోపరాజు రామయతో మంత్రులు, అమాత్యులు, సైన్యాధ్యక్షుడు ప్రసాదిత్య, సకల సైన్యాధికారి రేచర్ల రుద్రయ కూడా ఉన్నారు.
ముందు దంతపుబల్లపై రాజపత్రం!!
దానిని చేతిలోకి తీసుకుని అన్నాడు చక్రవర్తి.
“జాయా.. శుభవార్త! రాజ్యశ్రేయస్సు తీవ్రంగా ఆకాంక్షించే నీకు మరొక అవకాశం. నిన్ను కొంతకాలం వెలనాడు మండలేశ్వరునిగా నియమిస్తున్నాం. వెలనాడు ఆవల పలనాడు, పొత్తపినాడు, పాకనాడు, కొణిదెన తదితర ప్రాంతాలలో మన సామంతుల మధ్య సయోధ్య తగ్గుతున్నది. దాన్ని గట్టి భద్రం చెయ్యాల్సిన బాధ్యత నీమీద పెడుతున్నాం. ఇది కాకతీయ సామ్రాజ్యపు అత్యుత్తమ నిర్వాహకమండలి తీసుకున్న నిర్ణయం. శుభం భూయాత్!”.
అందరూ ఆత్మీయంగా నవ్వుతూ ముక్తకంఠంతో..
“శుభం భూయాత్..” అన్నారు.
రెండు క్షణాలు తటపటాయించి.. తర్వాత ఆ రాజపత్రాన్ని అందుకున్నాడు జాయపుడు!!
తను ఇక్కడ లేకపోతే తన అక్క, మేనల్లుళ్ల రక్షణ ఏమిటి?? తనను అనుమకొండ నుంచి దూరం పంపడం.. ఇది మరో కుట్ర కాదు కదా?!
ఆ భావన అతని మనసులో కేవలం రెండు ఘడియలే ఉంది. కేవలం గణపతిదేవుడనే బావగారు చెప్పింది తు.చ. తప్పకుండా తలవంచుకుని ఆచరించడమే జాయపుని కర్తవ్యం.. ఇప్పుడూ ఎప్పుడూ.. ఎప్పటికీ. ఆ రాజపత్రాన్ని కళ్లకద్దుకుని గంభీరంగా ముందుకు కదిలాడు జాయపుడు!!
ఎనిమదవ అధ్యాయం : పరిణత మండలేశ్వరుడు శ. సం.1134 శ్రీముఖ సంవత్సరం మాఘమాసం చైత్ర ఏకాదశి బుధవారం. వెలనాడు రాజధాని ధనదప్రోలు. రాజనగరు సమావేశ మందిరం. కొత్త మండలీశ్వరుడు కొలువు తీరనున్నాడు. ఈవార్త వెలనాడు అంతటా విస్మయానందం కలిగించింది. కృష్ణానదీ పరీవాహక చివరి ప్రాంతం వెలనాడు రాజ్యం. చరిత్ర పూర్వ యుగాన మానవ కదలిక, నాగరికత ప్రారంభం నాటి ప్రాంతం వెలనాడు. వనరులున్న ప్రాంతం కావడం, సహజంగా ప్రజలు కష్టజీవులు కావడంతో.. అన్నివర్గాల ప్రజలు కష్టానికి తగ్గ ఫలితం అనుభవిస్తారు. చదువులేని బ్రాహ్మణుడు ఉండడు. చిన్నదో పెద్దదో వ్యాపారంలేని వైశ్యుడు ఉండడు. అష్టాదశ వృత్తులు లేని గ్రామాలు లేవు. చతుర్ధ కులస్తులు ఆత్మవిశ్వాసంతో ఎవ్వరికీ తలవంచనిరీతిలో ఉంటారు. వారిలో అత్యధికులు యుద్ధ విశారదులు, బలింజ వ్యాపారులు, వ్యాపార రక్షణ శ్రేణులు. పంచములు ఆర్థికంగా మరింత సుభిక్షంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అస్పృశ్యత జాతిపరంగా తక్కువ. శుభ్రత పరంగా ఎక్కువ.
కృష్ణాతీరపు నీటి పారుదలతోపాటు ముంగారు వర్షాలు సమయం తప్పక కురుస్తుండటం.. దేవుడిచ్చిన వరాలు.
(సశేషం)
-మత్తి భానుమూర్తి
99893 71284