జరిగిన కథ : కొలని యుద్ధరంగంలో మొదటిరోజే బీభత్సం సృష్టించింది రుద్రమ. తన యుద్ధవిద్యా ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ.. శత్రుమూకలను చెల్లాచెదురు చేసింది. శత్రుయుద్ధ ప్రముఖులు రుద్రమ దూకుడును జాగ్రత్తగా గమనించి.. పక్షంరోజుల తర్వాత ఆమెపై మూకదాడికి దిగారు. ఆమె కాళ్లకు గురిచూసి బాణాలు వేసి, కత్తులతో దాడిచేశారు. అప్పుడొక యువసేనాని అడ్డుకొని.. కాళ్లలో బాణాలు దిగి ఉన్న రుద్రమను రథంలోకి ఎక్కించుకొని యుద్ధభూమి నుంచి బయటపడ్డాడు. అయితే, ఆ యువసేనాని ఎవరో.. అక్కడున్న వారెవరూ గుర్తించలేక పోయారు.
రుద్రమ జాడ తెలియకపోవడంతో.. జీవితంలో ఎప్పుడూ లేనంత కలవరపాటుకు గురయ్యాడు జాయచోడుడు. చిన్నతల్లి! యుద్ధ నైపుణ్యాలు చెట్లనీడన నేర్చుకున్న లేత ఆడపిల్ల ప్రత్యక్ష యుద్ధక్షేత్రంలో ఖంగుతిన్నది. ఇది ఆయన ఊహించాడు. హెచ్చరించాడు. కానీ, జరగరానిది జరిగిపోయింది. ఇప్పుడెలా.. ఎక్కడని వెతకాలి?
ఒకరిద్దరు సైనికులు, వేగులవాళ్లు కొన్ని సాక్ష్యాలు చెప్పారు. ఆ యువసేనాని కాకతీయ సేనానే. రథం మన సైన్యం మధ్యనుండే ఆమెతో వెళ్లిపోయింది.
ఈవార్తను అనుమకొండకు పంపవద్దని వేగు నియోగాధిపతికి చెప్పి.. నలువైపులా వెతికిస్తున్నాడు జాయచోడుడు. ఆ సంధ్యవేళ ఓ వార్తాహరుడు జాయసేనాపతికి ఓ లేఖ అందించాడు.
సారాంశం.. రుద్రమదేవి క్షేమంగా తమ రాజనగరిలో ఉన్నదని! ఆ వార్త పంపినవాడు నిడుదప్రోలు మహారాజు ఇందుశేఖరుడు!
‘హమ్మయ్య!’ అని నిట్టూర్చింది కాకతీయ స్కంధావారం. అయితే ఆమెను అక్కడికి చేర్చిన సేనాని ఎవ్వరు?
నిడుదప్రోలు రాజ్య ప్రాంతంలోనే ఈ స్కంధావారం ఉంది. ఆమె కాళ్లకు బాణాలు దిగబడటం చూసిన ఆ యువవీరుడు వెంటనే స్పందించి ఆమెకు స్కంధావారపు వైద్యసేవల కంటే మరింత మంచి వైద్యం అవసరమని గుర్తించి.. వెనువెంటనే తన రథాన్ని రాజనగరి వైపు మళ్లించాడు.
రాజ వైద్యులతో సత్వర వైద్యం ఏర్పాటుచేసి రుద్రమ కాళ్లు తొలగించాల్సిన పరిస్థితిని తప్పించాడు. అప్పటికప్పుడు వాయువేగ మనోవేగాలతో నిడుదప్రోలు రాజనగరికి వెళ్లి రుద్రమను చూశాక స్థిమితపడ్డాడు జాయసేనాపతి. అక్కడ తెలిసింది.. రుద్రమను కాపాడి రాజనగరికి తెచ్చినవాడు నిడుదప్రోలు యువరాజు, ఇందుశేఖరుని కుమారుడు వీరభద్ర భూపతి! రుద్రమను కాపాడినవాడు నిడుదప్రోలు యువరాజు.. ఇందుశేఖరుని కుమారుడు వీరభద్ర భూపతి!
ఆమె అంత బాధలోనూ జాయ మామను చూసి చిరునవ్వు నవ్వింది.
“కొంచెం తడబడ్డాను మామా..”
“మంచి అనుభవం చిన్నతల్లీ. ముందు కోలుకో..”
అతని హస్తాన్ని గట్టిగా పట్టుకుంది.
“నాకో మాటివ్వాలి మామా..”
ఆమె ఉద్వేగం గుర్తించి చిబుకం పట్టుకుని అన్నాడు..
“ముందు కోలుకో.. చిన్నతల్లీ..”
“నాపై ధనుస్సు ఎక్కుపెట్టిన వాళ్లను నువ్వు ఏమీ చెయ్యకూడదు. నేనే వాళ్లను ఖండఖండాలుగా నరకాలి..”
ఆమె కళ్లు విస్ఫులింగాలై ప్రజ్వరిల్లితున్నాయి. క్రోధాగ్నితో శరీరం వణుకుతోంది. జాయసేనాపతి వచ్చాడన్న వార్త విని మహారాజు ఇందుశేఖరుడు, అతని పట్టమహిషి ఉదయాంబిక వైద్యాలయానికి పరుగుపరుగున వచ్చారు. వెంట కుమారుడు వీరభద్రుడు.
“ముగ్గురికీ కాకతీయ సార్వభౌముని తరఫున నా కృతజ్ఞతలు! అమ్మాయికి సమయానికి వైద్యసాయం అందించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి!”.. చేతులు జోడించాడు జాయసేనాపతి.
“అయ్యయ్యో.. ఎంతమాట సేనాపతీ. మీరున్నది మా నేలమీద. అమ్మాయి అంతటి యోధురాలని విన్నాం. అబ్బాయి కూడా కుతూహలంతో ఆమె యుద్ధవిన్యాసాలను చూడాలని వెళ్లాడట. అప్పుడే శత్రుసేనానులు చుట్టుముట్టడంతో అబ్బాయి చురుగ్గా స్పందించి అమ్మాయిని కాపాడాడు. చేసిన తప్పు ఏమిటంటే.. మీ అనుజ్ఞ లేకుండా తీసుకురావడం!”
మరో మాసంరోజులకు రుద్రమ స్కంధావారం చేరింది. మరో పక్షంరోజులు వ్యాయామాలు చేసి యుద్ధ సన్నద్ధయై రణక్షేత్రంలోకి ఉరికింది. రుద్రమకొక ప్రతిభ ఉంది. అది త్రిపురాంతకంలో శైవమునుల సాహచర్యంలో సాధించింది. ఒక గొంతుక ఒక్కసారి వింటే తిరిగి ఎంత కాలానంతరం విన్నా గుర్తుపడుతుంది. యుద్ధరంగంలో అశ్వారూఢయై తిరుగాడుతోంది. చెవులు రిక్కించి వింటోంది. ఆమెలో ఆనాటి మాటలు తిరుగాడుతున్నాయి. కత్తుల కణకణలు, బరిసెల గరగరలు, ఏనుగుల ఘీంకారాలు, గుర్రాల ఘోష, ఆశ్వికుల అరుపుల మధ్య చెవులు రిక్కించి సైనికుల గొంతులు వింటూ ఖడ్గపువరపై చేయి ఉంచి తిరుగుతోంది. కసితో ప్రతీకారజ్వాలతో రగిలిపోతోంది.
“నా బాణాల దెబ్బ సరిపోలేదా.. మళ్లీ వచ్చావ్?!”
అదే.. ఆ గొంతే!
“ఆడదానివి.. పిడకలు చేసుకోక.. యుద్ధమా నీకు??” అన్నాడు వీడే. గుర్తించింది!
ఖడ్గంపై చెయ్యి కదిలింది. మరి రెండుఘడియల్లో వాడి శిరస్సు తెగి ఆవలపడింది. ఆమె అరిచిన అరుపులకు వాడి అశ్వం బెదిరి ఎటో పరుగులు తీసింది. వాడి తల అక్కడే పడి ఉంది. అందరూ చూస్తుండగా దానిపై కాండ్రించి ఉమ్మింది. జయజయ ధ్వానాలు చేశారు కాకతీయ సైనికులు.
అలా ఆరోజే ఆమె తనను చుట్టుముట్టిన పదిమంది సేనానుల శిరస్సులను ఖండించి తన కసి తీర్చుకుంది.
ఇప్పుడు రుద్రమ దెబ్బతిన్న బెబ్బులి. ఆమెను ఆపడం ఎవ్వరితరం కావడంలేదు. సోముడు, ప్రసాదిత్య, రాజ నాయకుడు, ఎరువభీముడు, మల్యాలగుండయ తదితర యువనాయకులు కూడా ఆమెను చూసి కదనోత్సాహంతో విజృంభించి పోరాడుతున్నారు. ఈలోగా జాయచమూపతి గజవ్యూహాన్ని రూపొందించి పది గజదళాలకు శిక్షణ పూర్తిచేశాడు. తను కూడా యుద్ధభూమికి కదిలాడు. శత్రువు కేశవదేవుడు కూడా ప్రాణాలు వొడ్డి పోరాడుతున్నాడు. యుద్ధం అత్యున్నత స్థాయికి చేరేవరకూ జాయసేనాపతి జాగుచేశాడు. ముఖ్యనాయకులను వారివారి ప్రధానబలం ఏమిటో ఆ ఆయుధాలతో సిద్ధమై ఉండమన్నాడు. జాయచోడుణ్నే కాదు.. రుద్రమను కూడా చూసుకుని కాకతీయ యోధులు వీరవిహారం చేస్తున్నారు.
అప్పుడు జాయచోడుని మాయాజాలం ప్రారంభమైంది. మెడలో కొమ్ముబూర.. నిర్దేశించిన శత్రుయోధుడు యుద్ధక్షేత్రానికి రాగానే అతనికి దూరంగా రుద్రమ కనిపిస్తుంది. ఆమెను చంపడం తేలిక అనే అభిప్రాయంతో ఆమెవైపు అశ్వాన్ని నడిపిస్తాడు. జాయచోడుని కొమ్ముబూర శబ్దం తెలియదు. అదే వాడి మృత్యుగీతిక. అతని దగ్గరికి ఏనుగులు రావడం గుర్తించడు. అతని దృష్టి రుద్రమపై ఉంటుంది. అతని ముందు వంగిన చిన్నఏనుగును గుర్తించేసరికి వెనగ్గా పది ఏనుగుల వంతెన ఉంటుంది. వాటిపై పరుగు పెడుతూ.. ఎప్పుడు రుద్రమ వచ్చిందో ఎప్పుడు అతని తల తెగి ఆవలపడిందో వాడికే తెలియదు. రుద్రమను చూసుకుని రెచ్చిపోతున్నారు కాకతీయ సైనికులు.
విజయమో వీరస్వర్గమో అన్నట్లు ఇరువర్గాలు పోరాడాయి. చివరికి కాకతీయ శక్తులదే అంతిమ విజయం!
కేశవదేవుడిని తన ఖడ్గానికే బలి ఇచ్చింది రుద్రమదేవి. ఎట్టకేలకు కొలని రాజ్యం విజయవంతంగా కాకతీయ సామ్రాజ్యంలో కలిసిపోయింది. కళ్లనిండా చూసుకున్నాడు జాయచోడుడు.. కాకతీయ వీర యువ కిశోరం రుద్రమను. అప్పుడే హఠాత్తుగా గుర్తొచ్చింది. వాడేడి? వాడు.. మురారి! వాడు యుద్ధానికి ఎందుకు రాలేదు??
* * *
అనుమకొండ విజయోత్సవాలలో ఉంటే మురారి కోసం వెతుకుతున్నాడు జాయచోడుడు.
ఎక్కడా కనిపించలేదు.
“అక్కా.. మురారి ఏడి? యుద్ధానికి రాలేదు??”
ఆమె మధురంగా నవ్వింది. ఎవరైనా కొడుకు ప్రస్తావన తేవడం ఆమెకు చక్కిలిగిలి..
“నీ ముద్దుల మేనల్లుడి గురించి కదూ అడిగావ్.. వాడి మిత్రుడి వివాహమట..”
మతిపోయింది. మిత్రుడి వివాహంవల్ల యుద్ధానికి వెళ్లలేదు!? చరిత్రలో ఏ యువరాజూ అలా అన్నట్లు వినలేదు. విస్తుపోయి నిలబడిపోయాడు. నారాంబ మరికొంత వివరణ ఇచ్చింది మృదుకంఠంతో.
“పిల్లలను ఈసారి యుద్ధానికి పంపడం మీ బావగారికి కూడా ఇష్టం లేదు. కానీ, రుద్రమతల్లి పట్టుపట్టి మరీ వెళ్లింది. అప్పుడే నువ్వు తీర్థయాత్రల నుంచి వచ్చావని.. ధైర్యంచేసి ఆమెకు నీతోడిచ్చి పంపారు జాయా..”
ఆడపిల్ల ఏదో పేరంటానికి వెళ్లతానంటే మగవాడిని తోడిచ్చి పంపినట్లు చెబుతోంది అక్క. సరే.. అక్క మీద చిరాకు పడినా ప్రయోజనం ఉండదు. అసలు ప్రయోజకుడు ఎక్కడ?? అక్కను ఆ ఆనందంలోనే ఉంచి వేగంగా వెళ్లి యుద్ధానంతర పనుల్లో తలమునకలుగా ఉన్న బావగారిని అడిగాడు.
“వాడు మురారి ఎక్కడ..? వాడు యుద్ధానికి ఎందుకు రాలేదు? మీరెందుకు పంపలేదు??”
మౌనం మౌనం.. చాలాసేపు. వదిలేలా లేడు జాయచోడుడు అన్నట్లు చెప్పాడు.
“ఏమో.. మిత్రుడి వివాహానికి వెళతానన్నాడు. వీరతిలకం దిద్ది పంపాను..” ఫెళ్లున నవ్వాడు.
అందులో జీవం లేదని జాయచోడుడు గుర్తించాడు. చిరాగ్గా విసవిసా నడుచుకుంటూ తన పురమందిరానికి వెళ్లాడు. సాయంత్రం వరకు అలా చిరాగ్గానే ఉన్నాడు. భావి కాకతీయ సామ్రాట్టు యుద్ధానికి రాకుండా మిత్రుడి పెళ్లికి వెళ్లాడట.. ఏమిటిది? ఏ శత్రురాజో వింటే నవ్విపోతాడు. ఏమిటి వాడి మనస్తత్వం?
అది శుక్ర చెప్పాడు.
ఆ రాత్రి దీపాలు వెలిగించి, వంట ఏదోచేసి పరిచారికలు వెళ్లడానికి ఉద్యుక్తులైన సమయంలో.. గుమ్మంవద్ద ఎవరో కనిపించగా భటుడు వచ్చి చెప్పాడు.
“ఆర్యా.. జాంఘీయుల నియోగాధికారి శుక్ర..”
జాయచోడుని భృకుటి ముడివడింది.
“రమ్మను..”
“జాయచోడుల వారికి వందనాలు..”
ప్రియమిత్రుడు శుక్రను ఆ గందరగోళ సమయంలో చూడటం పెద్ద ఉపశమనం..
“రా.. శుక్ర.. రా రా.. అంతా క్షేమమే కదా..?!”
“క్షేమమే జాయా! నా కుటుంబం, నా భార్యాబిడ్డలు క్షేమమే. కాకతీయ రాజ్యం కూడా క్షేమమే.. కానీ”
నవ్వుముఖం పెట్టినా శుక్ర మాటల్లో ధ్వనిస్తున్న ధ్వని ఏదో మనసుకు తాకింది.
“కూర్చో! ముందు విశ్రమించు..” పరిచారిక వచ్చి శుక్రకు మంచినీరిచ్చి ఆనక ఏవో తినుబండారాలు ఆయన ముందు ఉంచి వెనక్కి వెళ్లిపోయింది.
కాసేపు ఇద్దరూ పిచ్చాపాటిగా చిన్ననాటి అంశాలు నెమరువేసుకున్నారు.
హఠాత్తుగా అన్నాడు శుక్ర.
“ఏమి చెప్పాలో తెలియడంలేదు. ఇలా చెప్పడం న్యాయమో ధర్మమో.. చెప్పవచ్చో చెప్పకూడదో..” అలా గందరగోళంగా చెబుతూ..
“మురారి దేవుడు..” అన్నాడు ప్రస్తావనగా. ఉలిక్కిపడ్డాడు జాయచోడుడు. మురారి గురించే ఆయన తికమకపడుతుండగా శుక్ర మురారి పేరు ఉచ్చరించేసరికి నిటారుగా కూర్చున్నాడు. “ఆ.. మురారి? ఏమిటి మురారి?? చెప్పు చెప్పు..” అన్నాడు.
“మురారిదేవునికి రుద్రదేవమ్మవారికీ మధ్య..”
“ఊ.. మధ్య.. ఏమిటి చెప్పవయ్యా?!”
“ఇద్దరూ ఢీ అంటే ఢీ! అంటే ఒకరంటే ఒకరికి పడటం లేదు జాయసేనాపతి..” నిర్దిష్టంగా నొక్కి చెప్పాడు శుక్ర.
హఠాత్తుగా శరీరం చల్లబడింది జాయచోడునికి. ఆ ఇద్దరి మధ్య సయోధ్య లేకుంటే అక్క, బావగారు మనోవ్యధ చెందుతారు. అంతేకాదు మరిద్దరి మధ్య దూరం కాకతీయ సామ్రాజ్య భవిష్యత్తుకే వేరుపురుగు కావచ్చు. లేదా కుర్రతనపు ఆవేశకావేషాలు అనుకుందామా.. చిన్న పామునైనా పెద్దకర్రతోనే కొట్టాలి.
“నువ్వు చెప్పేది నాకేమీ అర్థంకావడం లేదు. నాకు చెబుతున్నది చక్రవర్తిగారికి నివేదించావా??”
“లేదు లేదు. నేనే ఇంకా స్పష్టమైన అభిప్రాయానికి రాని సంగతి. అందుకే ఆప్తులైన తమరికి చెప్పుకొంటున్నా”
జాయచోడునికి నచ్చిందీ మాట.
“చెప్పు. నువ్వు ఈ అభిప్రాయానికి రావడానికి కారణం.. ఏదైనా అంశం? ఉంటే చెప్పు..”
(సశేషం)
– మత్తి భానుమూర్తి
99893 71284