Jaya Senapathi | జరిగిన కథ : రేపు యుద్ధం ప్రారంభం అనగా.. ముందురోజు సంధ్యవేళ రెండు రాజ్యాల యుద్ధముఖ్యులను స్కంధావారంలోని తన గోల్లెనకు ఆహ్వానించాడు జాయపుడు. మూడు రాజ్యాల వీరులంతా కూసెనపూండి కళాక్షేత్ర కళాకారుల ప్రదర్శనలను తిలకించాల్సిందిగా కోరాడు. యుద్ధ ఉద్రిక్త, ఉద్వేగాల నడుమ ఈ కళాప్రదర్శనలు ఏమిటో ఎవ్వరికీ అంతుపట్టలేదు. అయినా, కళాప్రదర్శన అంటే అర్థంపర్థంలేని పిచ్చి ఉన్న వాళ్లంతా.. ఆ ప్రదర్శనకు తరలివచ్చారు. యుద్ధక్షేత్రంలోనే నిర్మించిన రంగస్థలంపై ఒకే ఒక్క నటుడు ప్రతక్ష్యమయ్యాడు. తొలుత ఓ శైవభక్తుడిగా అభినయం ప్రారంభించి తరవాత వైష్ణవభక్తుడిగా మారాడు. ముగింపులో హరిహరుడిగా ప్రత్యక్షమయ్యాడు.
అదికూడా శివుడు, విష్ణుమూర్తి.. తర్వాత ఆ ఇద్దరి సమ్మేళనంగా హరిహరుని కథ. ఆరోజుకు ప్రదర్శనలు పూర్తయినట్లు యవనిక రంగస్థలాన్ని మూసేసింది.
చూసిన రాజులు, యుద్ధముఖ్యులు ఆ కళలలోకం నుంచి బయట పడటానికి చాలాసమయం పట్టింది.
“ఈరోజు ఇక్కడే అందరం కలిసి భోజనాలు చేద్దాం. అందరికీ వెలనాడు వారి ప్రత్యేక వింధు..” జాయచోడుని ప్రకటన. భోజనాలవద్ద శత్రు, మిత్రులు లేరు. అందరూ ప్రదర్శనలు కలిగించిన ఆలోచనలతో గందరగోళమై మౌనంగా భోజనాలు కానిచ్చారు. తింటూ ఉండగానే తోలుబొమ్మలాట మొదలయ్యింది.
‘రండి రండి..’ అంటూ వెలనాడు కళాసేవకుల బృందం అందరినీ వినయంగా పిలుస్తున్నారు. బొమ్మలాట మొదలయ్యేసరికి అందరూ ఎంగిలి చేతులు కడిగి వేగంగా అక్కడికి పరుగులుపెట్టారు. తోలుబొమ్మలాట అంటే రాజుకైనా బంటుకైనా.. యుద్ధం కంటే మక్కువ ఎక్కువ.
అదికూడా శైవ అంశాలతో మొదలెట్టి వైష్ణవ అంశాలను చర్చించి.. ఆనక హరిహరదేవుని గురించి వివరించి ముగిసింది. అందరూ కారుతున్న చొంగ తుడుచుకుంటూ లేచారో లేదో.. జాయచోడుడు నవ్వుతూ చెప్పాడు. “అందరూ మీమీ గొల్లెనలకు వెళ్లి విశ్రాంతి తీసుకోండి. రాత్రి కాగడాల వెలుగులో మరో అద్భుతమైన నాట్య ప్రదర్శన!”.
ఈ కళా తతంగం యుద్ధరంగంలో ఏర్పాటు చేయడంపై అందరికంటే ఎక్కువగా ఆశ్చర్యపోయింది పృథ్వీశ్వరుడు, జాపిలిసిద్ధి, వెలనాడు సేనానులు, మంత్రులు. వారిని తన గొల్లెనలో కూర్చోబెట్టుకుని చెప్పాడు జాయచోడుడు.
“నేను ఓ ప్రయోగం చేస్తున్నాను. యుద్ధంవల్ల వాళ్లలో మార్పురాదని జాపిలిసిద్ధి కూడా మొదటే అన్నాడు. అందుకే నేను సంప్రదాయ యుద్ధం పక్కనపెట్టి.. కళాయుద్ధం చేస్తున్నాను. మతోన్మాదానికి విరుగుడుగా కళాసైన్యంతో యుద్ధ సంసిద్ధుడనయ్యాను!”. అందరూ అయోమయంగా ఉండగా ముందు తేరుకున్న జాపిలిసిద్ధి అడిగాడు.
“నీ ఆలోచనను అర్థం చేసుకోవడానికి మేము మరొక జన్మఎత్తాలి. సరే.. మరైతే నన్నెందుకు పిలిచినట్లు? సైన్యాన్ని ఎందుకు సిద్ధం చేసినట్లు??”.
“నా ప్రయత్నంమీద నాకు నమ్మకం ఉంది. కానీ, మతోన్మాదం మీద నమ్మకంలేదు మిత్రమా! అది విషంకన్నా శక్తివంతమైనది. ఒకవేళ నా ప్రయత్నంలో నేను ఓడిపోతే.. సాంప్రదాయ యుద్ధం తప్పదు కదా! అందుకే నిన్ను పిలిపించి అన్నకు అండగా యుద్ధ సంసిద్ధత చేయించాను”.
తాము సైన్యాన్ని సమాయత్తం చేస్తుంటే.. జాయపుడు కూసెనపూండి కళాక్షేత్రంలో కళాకారులను సమీకరించి కళాయుద్ధానికి సిద్ధం చేశాడని పృథ్వీశ్వరునికి, జాపిలిసిద్ధికి అర్థమైంది. జాయపుని మహోన్నత మూర్తిమత్వం రూపుకట్టింది. అయితే జాయచోడుని ప్రయోగానికి సైన్యం నుంచి తిరుగుబాటు వచ్చింది.
యుద్ధ ముఖ్యులందరూ నిత్యమూ పగలూరాత్రి.. తెల్లవార్లూ కళాప్రదర్శనలు చూస్తున్నారు.
ఓరోజు తెల్లవారకుండానే జాపిలిసిద్ధి అద్దంకి సర్వసైన్యాధ్యక్షుడు కదిరీపతితో కలిసి జాయపుని గొల్లెన వద్దకు వచ్చాడు.
“ఏమి జాపిలి.. ఏమైంది?” అడిగాడు జాయపుడు.
“చెప్పవయ్యా.. చెప్పు..” అన్నాడు జాపిలి పక్కనున్న కదిరీపతితో.
“మహారాజా.. మా సైనిక స్కంధావారంలో తిరుగుబాటు మొదలయ్యింది. ‘కళా ప్రదర్శనలు మీరు మాత్రమే చూడటం ఏమిటి.. మాకు చూపించరా?’ అని గొడవ పెట్టుకుంటున్నారు. ఏమి చేద్దాం. వాళ్లకు.. లక్షలమందికి కూడా చూపాలంటే సాధ్యమా?” కదిరీపతి గందరగోళంగా ఉన్నాడు. పులకించాడు జాయపుడు. యుద్ధం, కత్తులు, కటార్లు సంగతి వదిలేసి సైన్యమంతా.. ‘కళాప్రదర్శనలు కావాలి!’ అనడం మార్పునకు నాంది.
ఇది ముందే ఊహించి, అందుకు సిద్ధంగా ఉన్న జాయపుడు చురుకయ్యాడు.
“కంగారుపడకు మిత్రమా. ఎవరి స్కంధావారంలో వాళ్లకు కళాప్రదర్శనలు ఏర్పాటు చేద్దాం..” అన్నాడు.
వెర్రిచూపులు చూస్తున్న జాపిలిసిద్ధి భుజంతట్టి..
“అద్దంకి స్కంధావారంలో వాళ్ల సైనికులకు, పాకనాడు స్కంధావారంలో వాళ్ల సైనికులకు ప్రదర్శనలు ఏర్పాటు చేద్దాం. ముఖ్య సైనికవీరులందరం యుద్ధ క్షేత్రంలోని రంగస్థలంలో ప్రదర్శనలు చూద్దాం. సరేనా?!”.
జాపిలిసిద్ధికి సర్వం అర్థమైంది. మూడు స్కంధావారాలలోనూ రాత్రి, పగలు ప్రదర్శనలు ఇవ్వగల కళాకారులను ఇక్కడికి ముందే తరలించాడన్నమాట జాయచోడుడు. మొత్తం మూడు స్కంధావారలలోనూ మరునాటికే కళాప్రదర్శనలు ఏర్పాటుచేశారు కళాసేవకులు.
ఇక ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకూ ప్రదర్శనలే ప్రదర్శనలు!! ఎడతెరిపి లేకుండా అద్భుతమైన అనేక రకాల నాట్యాలు, రూపకాలు, యక్షగానాలు, తోలుబొమ్మలాట, ప్రేరణి (యుద్ధోత్సవ ఉధృత నృత్తం), చర్చరి (వసంతోత్సవ స్త్రీ, పురుష బృందనృత్తం), బహురూపం (ఓ నటుడు బహుపాత్రలు), భాండిక (హాస్య సంభాషణ), ప్రేంఖణం (ఉధృత నృత్తం), గొండ్లి, రాసకం (మహిళల బృందనృత్తం), దండరాసకం (కోలాటం), శివప్రియం (శైవ ఉత్సవనృత్తం), చింతు (జాతర సరదాలు), కందుకం (విభిన్న సందర్భాలలో బంతి ఆట), ఘటిసరి(హడుక్కా వాద్యాన్ని ధరించి చండాలిక చేసే నాట్యం), చారణం (ఉత్తర భారత నృత్తం), కొల్లాటం (దొమ్మరుల నృత్తం).. మొదలైన ఎన్నో కళాప్రదర్శనలు.. కొన్ని ఏకవ్యక్తి ప్రదర్శనలు, కొన్ని ఇద్దరు ముగ్గురు, కొన్ని పదిమంది, పాతికమంది బృందంగా చేసేవి.. ప్రేరణి లాంటివి ఎనభైనాలుగు మందితో ఆడారు. కవులు కవిత్వాలు చదవగా.. గేయకవులు గేయాలు, పాటలు పాడారు. ఇక వాద్యాలతో సైనికులు శివమెత్తి ఆడారు.
కూసెనపూండి నాట్య ప్రయోక్తలు, వాగ్గేయకారులు వరదయ, భాగవత సిద్ధయ, సారంగుడు, నారాయణతీర్థులు మొదలైన నాట్య దిగ్దంతులు తమతమ ప్రత్యేక నాట్యప్రయోగాలను ప్రదర్శించినప్పుడు సమస్త సైనిక సమూహాలు దిగ్బ్రమతో.. నాట్యమాధుర్యంలో ఓలలాడారు. అలాగే శృంగార, బూతు కవిత్వ, పద్య పఠనం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
అంతర్లీనంగా ఏ కళారూపమైనా శైవ లేదా వైష్ణవ కథతో మొదలై.. హరిహరతత్వంతో ముగుస్తుంది. మొత్తంగా ఇరవైరోజులు ఎడతెరిపి లేకుండా రాత్రి పగలు.. ప్రదర్శనలు.. వాటిపై చర్చలు.. అభిప్రాయ సేకరణ వంటివి కళాసేవకులు చేశారు. విందు భోజనాలు, తినుబండారాలు, రుచికరమైన పానీయాలు.. అంతా ఆనంద కళా సందోహమే!!
యుద్ధమైతే వెలుతురు తగ్గేవేళకు ఆపాలి. ఇక్కడ రాత్రి పగలు తేడాలేదు. ప్రదర్శనలు.. తినుబండారాలు.. భోజనాలు!!
యుద్ధానికి కాదు కళాజాతరకు వచ్చినట్లుంది సైనికుల పని. మొదటి పదిరోజులకు అందరూ మిత్రులైపోయారు. వీరిని వారు.. వారిని వీరు.. తప్పుపట్టడం, ద్రోహుల్లా చూడటం తెలియకుండానే తగ్గిపోయింది.
అందరూ శైవులే. అందరూ వైష్ణవులే. అందరూ హరిహరులే. చివరి పదిరోజులలో స్నేహవాతావరణంలో ఒకరి మతనాట్యాలను మరొకరు ప్రశంసించడం ఒకరి ప్రదర్శనలోని మంచి సంగతిని మరొకరు చెప్పుకోవడం.. కలిసి భోజనాలు.. పరస్పరం అభినందనలు. అంతా ఏకమయ్యారు.
చివరిరోజు సోమాంబిక, జాయపుడు హరిహరతత్వానికి ప్రతీక అయిన అయ్యప్పస్వామి యక్షగానాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. సోమాంబిక సూత్రధారిగా పాతికమంది నాట్యకారులతో యక్షగానాన్ని నడిపించగా, జాయపుడు అయ్యప్పగా.. నిజమైన దేవుడిలా భాసిల్లాడు. ముగింపులో హరిహరతత్వం గురించి చెప్పాడు.
కిమస్తిమాలాం కిము కౌస్తుభం వా
పరిష్క్రియాయాం బహుమన్య సేత్వం
కిం కాలకూటః కిం వా యశోదా స్తన్యం
తవ స్వాదు వద ప్రభూ మే
(నీకు పుర్రెలమాల ఇష్టమా? కౌస్తుభం ఇష్టమా? కాలకూటవిషం ఇష్టమా? యశోదా స్తన్యం ఇష్టమా? ఇది పరిష్కరించు ప్రభూ! నీవెవరివో తెలుపు. హరివా? హరుడివా?) దైవాన్ని అడిగాడు మహాకవి తిక్కనామాత్యులు. మీరు శైవులైనా వైష్ణవులైనా.. హరిహర మార్గ అనుచర నీయులైనా నాకు అభ్యంతరం లేదు. కానీ మతహింస, మితిమీరిన మతధోరణులు నేను ఏమాత్రం ఉపేక్షించను. భగవంతుడు సర్వాంతర్యామి. నిరాకార నిర్గుణ సంపన్నుడు. మీ ఇష్టమొచ్చిన మతాన్ని అనుసరించండి. కానీ పరమత సహనం.. అది ముఖ్యం. కాకతీయ సామ్రాజ్యంలో అదే ముఖ్య మతవిధానం!”.. యుద్ధ విరమణకు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. మత ఘర్షణలకు పశ్చాత్తాపపడ్డారు.
“జరిగిందేదో జరిగిపోయింది ఇకపై ఎవరి మతాన్ని వారు అభిమానించి ఆయా దేవతలను, దేవుళ్లను పూజించుకోవాలి. కానీ, పరమతాన్ని ద్వేషించడం, పరమత సంస్థలపై దాడులు లాంటివి మనరాజ్యాలలో ఉండరాదు. అంగీకారమేనా?”.. స్వమత పూజ, పరమత సహనం, లేదా హరిహరదేవుణ్ని కొలవడం.. అంటే అదొక తీర్మానం కాదు. ప్రతి ఒక్కరూ త్రికరణశుద్ధిగా మనసా వాచా ఖర్మేణా పాటించే జీవనవేదం.
సైనికులందరూ ఇది కలా నిజమా అని చెప్పుకొంటూ తమ ప్రాంతాలకు, ఇళ్లకు తిరిగి పయనమయ్యారు. అయ్య కుటుంబం తలగడదీవిలో పండుగ చేసుకుంది. కూసెనపూండి కళాక్షేత్రం, పెద్దన గృహంలోనూ సంబరాలు జరుపుకొన్నారు. చక్రవర్తి గణపతిదేవుడు, అక్క నారాంబ పులకించిపోయి లేఖల మీద లేఖలు..
“మహాకవి తిక్కనా మాత్యులవారికి నీ అద్భుత ప్రయోగం చెబుతాను మిత్రమా! ఆయన తప్పక సంతోషిస్తారు..” అన్నాడు జాపిలిసిద్ధి.. బయలుదేరే వేళ. చివరిరోజు వెలనాడు స్కంధావారంలో జాయపుని గొల్లెనలో మూడురాజ్యాల ప్రముఖులు.. చక్రనారాయణుడు, సోమాండి నాయడు, కదిరీపతి, జాపిలిసిద్ధి, పృథ్వీశ్వరుడు స్నేహితుల్లా కబుర్లు చెప్పుకొంటూ భోజనాలు చేశారు.
“కళాప్రదర్శనలు అద్భుతం. అలరించడం కాదు మనసులు మార్చాయి. వెలనాడు కవిపండితులకు నా వందనం. అది సరే. ఈ భోజనాలేమిటి.. పెళ్లి వంటలను మించిపోయేలా చేయించావూ..??” జాపిలి సందేహం.
“ఆత్మకింపగు భోజనం ఉంటేనే కవిత్వం రుచి తెలుస్తుంది. ప్రేక్షకుడికి మంచి భోజనం, రమణీ ప్రియదూతికతో కర్పూరవిడేము అందించాలోయ్. అప్పుడే కళకు ఫలసిద్ధి కలుగుతుంది జాపిలి సిద్ధీ..” అన్నాడు గడుసుగా జాయపుడు. అందరూ విరగబడి నవ్వారు. ఈ విజయంలో అందరూ విజేతలేనని, తన మాటను మన్నించినందుకు ఒక్కొక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెబుతూ సాగనంపాడు.
రెండురాజ్యాలలో పెచ్చరిల్లిన మతతత్వ ధోరణులను.. అనితరసాధ్యమైన కళాయుద్ధ ప్రక్రియ ద్వారా విజయవంతంగా ఓడించిన తన సాహితీ సైనికులైన కవి, పండిత, గాన, నాట్య, వాద్యకారులను రాజోచితంగా సత్కరించి అగ్రహార, వస్తు వైడూర్యాలతో సంభావనలనిచ్చి వీడ్కోలు పలికాడు జాయచోడుడు.
విభిన్న కళాకారులను కళాక్షేత్రంద్వారా ఏకంచేసి.. అనేకానేక కళలలో కొత్త సంప్రదాయాలను ఏర్పరచి.. మతయుద్ధాన్ని గెలిచిన ఏకైక పరిపాలకుడు మన వెలనాడు మండలేశ్వరుడు జాయచోడుడే మన జగన్నాథుడు.. అని తెలిశాక యావత్తు వెలనాడు పులకించింది. అందరూ నిష్క్రమించిన అనంతరం కాస్త విశ్రాంతిగా శయనతల్పంపై వాలాడు జాయపుడు.
అప్పుడే ఎవరో వగరుస్తూ అరుస్తూ పరుగుపరుగున వచ్చి గొల్లెన వద్ద పడిపోయారు. ఆ కలకలం వినిపించగానే లేచి బయటికి వచ్చాడు జాయపుడు. చూస్తే.. పరాశరుడు!
“అరె.. పరాశరా.. ఏమిటి ఏమైంది?”.
“మహాప్రభో.. మువ్వ.. మువ్వను వాడు మళ్లీ.. నన్ను చావగొట్టి మువ్వను బలవంతంగా ఎత్తుకుపోయాడు. ఈసారి వాడు ఆమెను చంపేస్తాడు మహారాజా.. వదలడు. మువ్వను రక్షించాలి మహారాజా!”.
వగరుస్తున్నాడు. ఏడుస్తున్నాడు. వణికిపోతున్నాడు పరాశరుడు. పూరి జగన్నాథాలయం వద్ద నాట్య ప్రదర్శనకు కంకుభట్టు బృందంతో మువ్వను తీసుకుని వెళ్లిన పరాశరుడు ఇప్పుడే కనిపించాడు. పరాశరుని మాటలు అర్థంకాక లిప్తలకాలం కొయ్యబారిపోయాడు. తర్వాత ఉద్రేకంతో మండిపోయాడు జాయచోడుడు.
(సశేషం)
– మత్తి భానుమూర్తి
99893 71284