Jaya Senapathi | జరిగిన కథ : కొత్త నాట్య సంప్రదాయాలను సృష్టించడం.. దేశీ సాహిత్యాన్ని సేకరించడంలో మునిగిపోయాడు జాయపుడు. ఇలా ఉండగా.. ఒకనాడు వేగులు వచ్చి జాయపునికి ఓ లేఖ అందించారు. యుద్ధ మంత్రాంగ మందిరానికి రావాల్సిందిగా పృథ్వీశ్వరుడు పంపిన ఆ లేఖను చూసి ఆశ్చర్యపోయాడు. ధనదుపురం చేరి.. మంత్రాంగ మందిరంలో ప్రవేశించాడు. మండలేశ్వరుడి సింహాసనం ఖాళీగా ఉంది. పక్కనున్న మరో ఉన్నతాసనంపై పృథ్వీశ్వరుడు కూర్చుని ఉండగా.. ఆ పక్క ఆసనాలపై సంధివిగ్రహి, మహామంత్రి, సర్వసైన్యాధ్యక్షుడు మరికొందరు ఆసీనులై ఉన్నారు. కాస్త అవతలగా పల్యంకాలపై పూర్తి శైవమత ఆహార్యంతో కనిపిస్తున్నవారు కూర్చుని ఉన్నారు. మందిరమంతా కాస్త గంభీరంగా ఉంది.
జాయపుని ప్రవేశంతో అంతా గౌరవంగా లేచి నిలబడ్డారు.. పృథ్వీశ్వరునితో సహా. చాలాకాలంగా రాచ సంప్రదాయాలకు ఆమడదూరంలో తిరుగాడుతున్న జాయపుడు కొంచెం కంగారుపడి.. “మీరు కూర్చోండి అన్నా..” అన్నాడు అప్రయత్నంగా. జాయపుని సంగతి తెలిసిన పృథ్వీశ్వరుని ముఖాన్ని చూసి.. సంగతి గ్రహించిన జాయపుడు నాలుక కొరుక్కున్నాడు.‘ఔను.. నేను కదూ మండలేశ్వరుడ్ని..’వేగంగా వెళ్లి మండలేశ్వరుని ఆసనంలో కూర్చున్నాడు. కాస్త కుదుటపడ్డాడు. మందిరాన్నంతా కలియజూశాడు.
“మహామంత్రీ.. ఏమిటి విషయం?!”.
మహామంత్రి దేవోజు లేచి వినమ్రంగా నమస్కరించి నిలబడ్డాడు.. కానీ, పృథ్వీశ్వరుని వంక చూశాడు. కాస్త వరసలో పడ్డాడు జాయపుడు. “మీరు వివరించండి అన్నా!”.
పృథ్వీశ్వరుడు లేచి వినయంగా నమస్కరించి చెప్పాడు. “కాకతీయ సామ్రాజ్యంలో ఈమధ్య మతఘర్షణలు ఎక్కువయ్యాయి మండలేశ్వరా! అవి మతాల మఠాల మధ్య గొడవలుగా భావించి పట్టించుకోలేదు. మహామండలేశ్వరులు కూడా అవి రాజ్యపాలనాంశాలు కావన్న భావనతో ఉన్నారు కానీ, అవి పెరిగిపెరిగి ఇప్పుడు రాజ్యపాలకులు కూడా ఈ మత ప్రభావాలకు లోనై.. పక్క రాజ్య మహారాజులను కూడా ఈసడిస్తూ వీధి గొడవలకు దిగడం.. ఎంత దిగజారుడు తనమంటే..”
ఘడియఘడియకు అన్న గొంతులో పెరుగుతున్న అసహనపు ఉద్రిక్తత జాయపుడు గమనిస్తున్నాడు.
“మన పక్కనున్న అద్దంకి రాజ్యానికి, పాకనాడు రాజ్యానికి మధ్య ఈ మతగొడవల వల్ల పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ఇప్పుడు ఇద్దరూ యుద్ధానికిసిద్ధమయ్యారు!”.
“యుద్ధానికా.. శివ శివా! ఇది మహామండలేశ్వరులకు తెలుసా..?”.
“వాళ్లు తెలియజేయలేదు. వేగులవాళ్లు ఆయన చెవిన వేశారు. ఆయన ఆ గొడవ ఏమిటో చూడమని మనకు ఆదేశించారు. నేను వెంటనే సమస్య ఏమిటో తెలుసుకున్నాను. రెండురాజ్యాల మధ్యనున్న తటస్థ గ్రామం చిగురుపాడులో ఓ దేవాలయం నిర్మించారు. నిజానికి అది పాడుపడిన బౌద్ధాలయం. అందులో శైవులు రుద్రుని విగ్రహం ప్రతిష్ఠించి పూజాదికాలు మొదలెట్టారు. వారంరోజుల తర్వాత ఓ వైష్ణవబృందం వచ్చి రుద్రుని విగ్రహం తొలగించి కృష్ణుని విగ్రహం పెట్టి పూజాదికాలు చేస్తున్నారు.
ఇది చిలికిచిలికి మహారాజుల వద్దకు వెళ్లింది. అద్దంకి మహారాజు చక్రనారాయణుడు వైష్ణవాభిమానట. దురదృష్టం ఏమిటంటే.. పాకనాడు మహారాజు సోమాండి నాయడు శైవుడు. ఇప్పుడది పెరిగి యుద్ధం ద్వారా తేల్చుకుందామని సవాలు చేసుకునే వరకు వెళ్లింది. అప్పటినుంచి శైవులు, వైష్ణవులు మరింత రెచ్చిపోయి ఒకరి గృహాలను మరొకరు తగలబెడుతున్నారు. గ్రామంలో హింసాకాండ పరిమితి తప్పింది. మహాజనులు, సమయాల శెట్టి, పండితుడు, రైతు, మాదిగ, చాకలి, కంసాలి, అగసాలి.. ఎవరైనా ఏదో ఓ మతం.. అయితే శైవం.. కాదంటే వైష్ణవం. విబూది అడ్డగీతను వైష్ణవుడు నోటితో నాకేస్తాడు. శైవుడు సున్నంనీళ్లు కుండలతో పట్టుకుని తిరుగుతాడు.
చక్రాంకితాలున్న వైష్ణవుడు కనిపిస్తే.. వాడిపై సున్నం నీళ్లు కుమ్మరిస్తాడు. ఒకరినొకరు చంపుకొనే దశలో మహారాజులు, మంత్రులు, సైన్యాధ్యక్షులు వారివారి రాజ్యాల మతస్తుల కోసం వీధులకెక్కారు. అద్దంకి సైనికులు వైష్ణవులను, పాకనాడు సైన్యం శైవులను వెనకేసుకొస్తున్నారు. అది మరింత ముదిరి ఇద్దరు రాజులు ప్రత్యక్షయుద్ధానికి సిద్ధమయ్యారు. ‘నువ్వో నేనో తేల్చుకుందాం!’ అని రాజులు అంటుంటే.. ‘శైవమో వైష్ణవమో తేల్చుకుందాం!’ అని ప్రజలు అంటున్నారు.
అది ముదిరిముదిరి ఇతర రాజ్యాల ప్రజలనుకూడా చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అరుగో.. అక్కడ కూర్చున్నవాళ్లు పాకనాడు, అద్దంకి రాజ్యాలలో వివిధవృత్తుల్లో జీవిస్తున్న మన వెలనాడువాసులు. వీళ్ల బట్టలు చించి.. ఇల్లు కూల్చి ఇంట్లో సామగ్రి ధ్వంసంచేసి స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించి వెంటపడి తరిమితరిమి కొట్టారు. వీళ్లు భయవిహ్వలతతో ఇక్కడికి వచ్చిపడ్డారు. నిత్యమూ ఎంతోమంది వీరిలాగే కట్టుగుడ్డలతో వచ్చి నాకు మొరపెట్టుకుంటున్నారు. ఇదీ పరిస్థితి మండలేశ్వరా..” ఆపాడు పృథ్వీశ్వరుడు.
ఆసనంలో తొలుత కాస్త బిడియంగా కూర్చున్న మండలేశ్వరుడు జాయచోడుడు ఇప్పుడు నిటారుగా కూర్చున్నాడు. ఒక్కసారి ముఖకవళికలు మారిపోయాయి. చేతులు అస్థిరంగా కదలుతున్నాయి. ఉఛ్వాస నిశ్వాసలతో ఎదురొమ్ము సముద్ర కెరటంలా పైకి ఉబికి నెమ్మదించింది. మార్దవంగా ఉన్న శరీరమంతా సానబెట్టిన ఖడ్గంలా దృఢపడింది. అప్పటివరకూ మనసంతా ఆక్రమించి ఉన్న కళాక్షేత్రం, కూసెనపూండి, మువ్వ, పరాశరుడు, కంకుభట్టు, డప్పు సూరప, భాగోతుల సిద్ధయ.. లిప్తలలో మాయమైపోయారు. ముఖమంతా వీరత్వం పొటమరించింది. కండరాలు బిగుసుకున్నాయి. వింటున్నప్పుడు ఉద్వేగంతో కదలుతున్న చేతులను ఆసనం రెక్కలపై ఉంచి అన్నాడు యుద్ధ గంభీరతతో..
“తక్షణ కర్తవ్యం ఏమిటో.. మీరు చెబుతారా సోదరా.. నన్ను చెప్పమన్నారా?”.
పృథ్వీశ్వరునితోపాటు అక్కడున్న అందరూ తుళ్లిపడ్డారు. యుద్ధ ఉద్వేగం క్షుణ్నంగా తెలిసిన వెలనాటి వీరులంతా మరింత ఉద్వేగానందంతో రగిలిపోయారు. జాయపుని మాట వారి చెవులలో యుద్ధ శంఖారావంలా ఖంగున మోగింది. చేతులు కత్తి ఒరపైకి వెళ్లాయి.
“ఏమిటిది.. ఇది మహామండలేశ్వరులు శ్రీశ్రీశ్రీ గణపతిదేవుల పాలనలోనున్న కాకతీయ సామ్రాజ్యమని మర్చిపోయారా.. పొరుగునున్నది వెలనాడు రాజ్యమని.. దాని పాలకులు అయ్యవంశ సంజాతులని తెలియదా!? లేక ఏమి చేస్తారులే అనే నిర్భీతా!? మరి మీరు ఏమి చేస్తున్నారు.. మతోన్మాదంతో కళ్లు మూసుకుపోయిన ఆ వెధవలకు ఏమి హెచ్చరిక చేశారు?”.
ప్రతిపదం ఉప్పెనలా సుళ్లుతిరుగుతూ పెరిగి భవనపు ఊర్ధ్వభాగాన్ని తాకుతున్నది. మొదటిసారి జాయపుని యుద్ధోన్మాద సింహనాదాలు వింటున్న పృథ్వీశ్వరునికి మాటరాక నాలుక పిడచ కట్టుకుపోతున్నది. జవాబులు తడబడుతున్నాయి.
“సంధి విగ్రహిని.. అదే.. సంధి విగ్రహి మాంకనభట్లును పంపాను తమ్ముడూ. అదే.. మండలీశ్వరా! కానీ, వాళ్లు గౌరవించలేదు. ‘ఇది మా రెండురాజ్యాల మధ్య సరిహద్దుల గొడవ. వెలనాడుకు ఏమి సంబంధం.. పొ.. పో!’ అన్నారట. ఆయనకు పూర్ణకుంభ స్వాగతం సంగతి వదిలేయి.. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదట ప్రభూ!”.
“నిజమే ప్రభూ! నేను తిండితిప్పలు లేక కాళ్లీడ్చుకుంటూ ధనదుప్రోలు వచ్చిపడ్డాను” అన్నాడు సదరు మాంకనభట్లు.
చిరాగ్గా ఆసనం నుంచి లేచి.. లేచిన అధికారులను కూర్చోమన్నట్లు చేతితో సైగ చేసి అటూ ఇటూ తిరుగుతూ.. ఆలోచిస్తూ మాట్లాడుతున్నాడు.
“కాకతీయ తంత్రిపాలుడు ముచ్చనాయకులకు పరిస్థితి వివరించారా?”.
“ఆ ఆ! పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు రాజధానిలోని తంత్రిపాల నియోగ అధికారులకు విన్నవిస్తూనే ఉన్నాం ప్రభూ!”.
“మహామండలీశ్వరులు ఈ ఉద్రిక్తతలపై ఏమి ఆదేశించారు?”.
“మన అభిప్రాయమే తమ అభిప్రాయం అన్నారు. ‘తెలుగురాజ్యాల మధ్య ఇలాంటి రకరకాల గొడవలతో నేను సతమతం అవుతున్నాను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు!’ అంటూ వార్త పంపారు ప్రభూ!”.
“అయితే మనం ఇద్దరికీ గట్టి సమాధానం చెబుదాం. యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించండి. మనం యుద్ధానికి సిద్ధమవుతున్నామని వారికి తెలిసేలా వేగులతో ప్రచారం చేయించండి!”.
అందరూ లేచి కత్తులు తీసి పైకెత్తి..
“హరహర మహాదేవ..” అంటూ నినదించారు.
సమావేశం పూర్తయ్యాక తిరిగి దేవాలయ ప్రాంగణానికి రాకుండా గజశాలకు వెళ్లాడు. గజశిక్షణ జరుగుతున్నది. ప్రతి ఏనుగును తీక్షణంగా చూస్తూ యుద్ధతంత్రంలో ఏవి ముందుండాలి.. ఏవి వెనుక వరసలో ఉండాలి.. అని పరిశీలించి శిక్షకులకు, మావటివాళ్లకు సూచనలు చేసి తిరిగి దేవాలయ ప్రాంగణానికి వచ్చాడు.
అప్పటికి యుద్ధావేశం కాస్త తగ్గుముఖం పట్టింది. వెలనాడు వచ్చిన కొత్తలో ఈ శైవ వైష్ణవ మతాలను.. సామాన్యులపైనా, కులీనులపైనా, పండితులపైనా వీటి ప్రభావాన్ని, మఠాల ప్రచారాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఈ మతాచారాలు కళలను ఎలా.. ఎప్పటినుంచి ప్రభావితం చేస్తున్నాయి? వర్తమాన లిఖిత, ప్రదర్శన సాహిత్యం.. అటు శిష్టసాహిత్యం ఇటు జానపదసాహిత్యం మత ప్రభావిత కళాకారులు, పండితులు ఎవరు.. వారి సాహిత్యం ఏమిటి? అని ఆసక్తి చూపాడు. మతావేశాల ధోరణి నచ్చలేదు కానీ, ఇలా రాజ్యాలమధ్య యుద్ధాలకు దారితీసే పరిస్థితులు వస్తాయని అనుకోలేదు. అదిప్పుడు చిలికిచిలికి గాలివానై తను కూడా యుద్ధ శంఖారావం చేసేవరకు వెళ్లింది.
సేనానులు, దళపతులు తమ దళానికి కావాల్సిన గుర్రాలు, ఏనుగులు, రథాలు, కత్తులు, డాళ్లు లాంటి రక్షణ పరికరాలు సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టారు. ఓరోజు రాత్రి భోజనానికి సిద్ధమవుతుండగా మళ్లీ గజ్జెల ఘలంఘలలు. పిల్లదండు. తలగడదీవి నుంచి అంతా ధనదుప్రోలు వచ్చిపడ్డారు. అమ్మానాన్నలతో సహా.
“ఇదేమిటి.. మీరంతా ఇక్కడ?” పరుగున వచ్చేసి.. భోజనం చేస్తున్నా మీదెక్కి చిందులు వేస్తున్న పిల్లలతో అన్నాడు జాయపుడు.
“తమరెక్కడుంటే మేమూ అక్కడే!”
అల్లరల్లరి.. గోలగోల. వెనగ్గా తమ్ముళ్లు, మరదళ్లు, చెల్లెళ్లు, బావలు, అన్నా వదిన.. భోజన మందిరమంతా కళకళలాడుతున్నది.
“యుద్ధం గురించి అక్క.. అక్క ఏమైనా..” అడిగాడు అన్నను.. వదిన చామంతి కలగజేసుకుంది.
“వదినగారు దినమూ లేఖ పంపిస్తారు జాయా. రోజూ పంపే లేఖల్లో పిల్లల గురించి, వంటల గురించి, ఆడపిల్లల తలలో పేలు పడతాయి జాగ్రత్త లాంటి చిన్నచిన్న అంశాలు కూడా రాస్తారు. కానీ, వారంనుంచి లేఖల్లో అంతా నీ గురించే. జాయ యుద్ధానికి సిద్ధమయ్యాడంటే సగం యుద్ధం గెలిచినట్లే! మొత్తానికి వాడిని యుద్ధానికి సిద్ధంచేశావని మీ అన్నగారిని ఒకటే పొగడ్త. ఈ శైవవైష్ణవ గొడవలు మనమంచికే వచ్చాయిలే అంటూ..” నారాంబక్క మాటలు తెలిసిన జాయపుడు మధురంగా నవ్వుకున్నాడు.
“అయ్యయ్యో! ఆపు ఆపు. మీ వదినగారు రాయడం.. నువ్వు ఈయనగారికి పూసగుచ్చినట్లు వివరించడం..” అడ్డుపడ్డాడు పృథ్వీశ్వరుడు.
పిల్లల అరుపుల మధ్య అన్నాడు అన్నతో..
“అన్నా.. ఇది అక్కరాసిన లేఖా లేక నువ్వే సృష్టించి అక్కపేరున..”
“అబ్బెబ్బే.. నేను రాయడమా!? చ చ్చ.. నాకేమీ తెలియదు జాయా. అక్క లేఖ రాగానే వెంటనే చదవకుండానే మీ వదిన చేతిలో పెట్టేస్తా. నాకేమీ తెలియదు. నాకు తెలియదు..” కంగారు కంగారుగా పృథ్వీ అనడంతో అక్కడున్న బంధుగణమంతా పెద్దపెట్టున నవ్వులు గుమ్మరించగా ఆ భోజన పరిమళాలకు కొత్త పరిమళం కలగలసింది.
వెలనాడు మండలీశ్వరుడు, మహావీరుడు, కాకతీయ సామ్రాజ్య గజసాహిణి జాయచోడుడు స్వయంగా యుద్ధ శంఖం పూరించాడని తెలుగు రాజ్యాలన్నిటా తెలిసిపోయింది. అద్దంకి మహారాజు చక్రనారాయణుడు, పాకనాడు మహారాజు సోమాండినాయడు కూడా కొంత చురుకయ్యారు. కానీ, మత విద్వేషంతో కళ్లు మూసుకుపోయిన ఆ మహారాజులు, ఆ రాజ్యాల ప్రజలు.. ఏమవుతుందో చూద్దామన్నట్లు యుద్ధప్రయత్నాలను విరమించలేదు. పైపెచ్చు ఉభయులకు మఠాల సహకారం పుష్కలంగా ఉంది. వాళ్లు మరింత ద్వేషాన్ని ఎగదోస్తున్నారు.
“ఆ రుద్రుడే మనల్ని రక్షిస్తాడు!”.
“విష్ణువు మహాదేవుడు. రాక్షసులకు విషం.. మనకు అమృతం పంచుతాడు!”.
ఇలా ఎవరి ధోరణిలో వాళ్లు మాట్లాడుతున్నారు.
అయితే అందరినీ తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే!
(సశేషం)
– మత్తి భానుమూర్తి
99893 71284