జరిగిన కథ : రాచనగరులో మరో నాట్యప్రదర్శన ఏర్పాటుచేశారు గుండయామాత్యుడు, నీలాంబ. ‘ఈసారి ఎలాగైనా అక్కలను చూడాలి’ అనుకొని, చౌండసేనాని ఇంట ప్రత్యక్షమయ్యాడు జాయప. అక్కల గురించి చౌండను ధైర్యంగా అడిగాడు. అప్పుడే అక్కలు ఇప్పట్లో బయటికి రావడం అసాధ్యమని తెలుసుకున్నాడు. మైలాంబ సూచనతో నారాంబ, పేరాంబను నాట్య ప్రదర్శన వద్దకు రప్పించడానికి ఒప్పుకొన్నాడు చౌండ. కానీ, వారిని పలుకరించకూడదనీ, వాళ్లెవ్వరో తెలియనట్లే ప్రవర్తించాలని చెప్పాడు.
ప్రదర్శన కోసం పల్లకి రాచనగరు చేరినప్పటి నుంచి జాయప స్పృహలో లేడు. చూపులు చంచలాలై.. అంతఃపుర మహాద్వారం చుట్టూ తుమ్మెదల్లా ఎగురుతూ.. పల్లటీలు కొడుతూ అక్కడక్కడే తిరుగాడుతున్నాయి. ఊహాతీతంగా ఎవరో అతని పక్కకువచ్చి చెవిలో.. తగ్గు గొంతుతో ఆజ్ఞలు, సంకేతాలు ఇస్తూనే ఉన్నారు.
“అటూ ఇటూ చూడవద్దు జాయపా! సరాసరి మీ నాట్య కార్యకలాపంలో నిమగ్నులై ఉండండి. వేగులకు అనుమానం వస్తే.. అక్కలు బయటికి రారు”.. చెవిలో చెప్పింది ఎవరో తెలియక ఉలిక్కిపడ్డాడు. ఎవరని అటూ ఇటూ చూశాడు. ఎవ్వరో తెలియదు.
చాలామంది వస్తూ పోతున్నారు. నిజమే కావచ్చు. కానీ, అక్కలు.. తన అక్కలు.. దాదాపు ఆరేళ్లు అయ్యింది చూసి. ఇవ్వాళ చూడబోతున్నాడు. వాళ్లముందు నర్తించబోతున్నాడు. వాళ్లు తన నాట్యం చూడబోతున్నారు. గురుకులంలో మహామహా నాట్య గురువుల వద్ద నేర్చుకుని, నీలాంబ వంటి మహానర్తకి సారథ్యంలో ఇక్కడే దాదాపు పన్నెండు ప్రదర్శనలు ఇచ్చి చక్రవర్తిని సమ్మోహ పరచిన ఈ జాయప.. ఆ అక్కల ముద్దుల తమ్ముడు, అక్కల కోసం, అక్కల వెంట.. అమ్మకు నాన్నకు చెప్పకుండా వచ్చి, వీధుల్లో తిరుగుతూ.. చేరదీసినవారు పెట్టింది తింటూ.. బతుకుతున్న ఈ తమ్ముడు.. ఇవ్వాళ – ఇప్పుడు – మరి కాసేపట్లో.. తన అక్కలను చూడబోతున్నాడు.
రాజాస్థానంలో మరికొన్ని ఘడియల్లో నాట్య ప్రదర్శన ప్రారంభం కాబోతున్నది. అప్పుడే కొండిపర్తి మండలేశ్వరుడు శ్రీ చౌండసేనాని సతీసమేతంగా నాట్యప్రాంగణం లోపలికి విచ్చేశారు. చౌండ, మైలాంబిక.. జాయపతో చూపులు కలిపారు. అతనిలో తేజరిల్లుతున్న ఉద్వేగం వారికి మాత్రమే తెలుసు. వారసుడు జన్మించిన తర్వాత తొలి నాట్య కార్యక్రమం కావడంతో రాజ్య ప్రముఖుల్లో చాలామంది సకుటుంబ సమేతంగా విచ్చేశారు. ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది.
ప్రదర్శనకు అంతా సిద్ధమైంది. చక్రవర్తులవారు వంగమాగధుల జయజయధ్వానాల మధ్య విచ్చేశారు. మరి రెండు ఘడియల అనంతరం అంతఃపుర ద్వారాలు తెరుచుకున్నాయి. పచ్చిబాలింత.. పట్ట మహిషి సోమలదేవి పొత్తిళ్లలో కాకతీయ సామ్రాజ్య భావి యువరాజు రుద్రమదేవుని ఎత్తుకుని విచ్చేసింది. కూతురు గణపాంబ.. వారి పక్కన నడుస్తూ వచ్చింది. అందరికీ అభివాదం చేసి ప్రత్యభివాదాలు అందుకున్నాక.. చక్రవర్తి కూతురిని ఒడిలో కూర్చోబెట్టుకుని చేయి ఊపాక.. గుండయామాత్యుని అనుజ్ఞతో యవనిక లోపల రంగపూజ ప్రారంభమయ్యింది.
జాయప ఖిన్నుడయ్యాడు. అక్కల జాడ లేదు. ఎలా.. ఏమైనట్లు??
రంగపూజ ప్రార్థన అందరూ పాడుతున్నారు గానీ, జాయప చూపు యవనిక చాటుగా అంతఃపుర ద్వారంపైనే ఉంది. రంగపూజనం కూడా పూర్తయ్యింది. యవనిక తొలగింది. ఆదితాళంతో వాద్యకారుల సంగీత మధురిమ ప్రవహించడం ప్రారంభమైంది. నట్టువాంగం ఖంగు
మంటున్నది. అప్పుడు అంతఃపుర ద్వారాలు మళ్లీ తెరుచుకున్నాయి. స్వర్గలోక అప్సరసల తలదన్నే అందగత్తెలైన ఇద్దరు యువతులు బెరుకుగా చూస్తూ రావడం.. యవనిక లోపలనున్న జాయప కంటపడింది. అక్కలు.. నారాంబ – పేరాంబ. పరిచారికలు, అంతఃపుర కంచుకిలు, రక్షకభటులు పరివేష్టించిన రక్షణవలయం మధ్య వచ్చి, నిర్దేశించిన చోట కూర్చున్నారు. అక్కలను రెప్పవెయ్యకుండా చూస్తున్నాడు జాయప.
ఆరేళ్ల తర్వాత. సహజ అందగత్తెలైన ఇద్దరూ యవ్వనోల్బణంతో కళ్లు చెదిరే రూపలావణ్యాలతో మెరిసిపోతున్నారు. అందరి కళ్లూ ఆ ఇద్దరి మీదే. ఆ ఇద్దరి కళ్లూ తమ్ముడి కోసం వెతుకుతున్నాయి.. ఆర్తిగా! పరీక్షగా చూస్తే కడవల్లాంటి కళ్లనుంచి కన్నీరు ఉబికిరాకుండా ఆ యువతులు చేస్తున్న ప్రయత్నం గుర్తిస్తే.. వారిపట్ల జాలితో మనసు ద్రవించిపోతుంది.
ప్రదర్శన ప్రారంభమయ్యింది. కాళీయమర్దనం. కృష్ణుడిగా జాయప ప్రవేశించాడు. అక్కల ముందు.. అక్కలు చూస్తున్నారు అనే ఉత్సాహంతో.. అక్కలనే చూస్తూ.. అక్కల కోసమే అన్నట్లు విజృంభించి, పరవశించి పాత్రలో జీవించాడు. యవనిక వాలగా.. వాద్యాలశబ్దాలను మించి కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. చూపులు అక్కలమీదే! రెప్పవేస్తే అక్కలను చూడటం రెప్పపాటు తగ్గుతుంది. రెప్ప వెయ్యడం లేదు. ఇప్పడు కాకపోతే మళ్లీ ఎప్పుడో.. ఏమో.. కన్నీరు కారుతున్న చెంపలు జలదరింపుతో కదలాడుతుండగా, చప్పట్లు కొడుతున్న అక్కలు. పులకింతతో నిలువెల్లా వణికిపోతూ వలవలా ఏడుస్తూ అక్కలనే చూస్తున్నాడు జాయప.
అతణ్ని అందరూ విభ్రమగా చూస్తుండగా.. తెప్పరిల్లిన నీలాంబ సంజ్ఞ చేసింది. కళ్లు తుడుచుకుని చక్రవర్తుల వద్దకు వెళ్లాడు. ఆయన అభినందనలు అందుకుని తలతిప్పిన జాయపకు.. అక్కలు కనిపించలేదు. గణపతిదేవుడు, సోమలదేవి.. ఎందరో మండలేశ్వరులు, మంత్రులు, వారివారి పట్టమహిషులు, ఎందరో సాహితీ పుంగవులు, నాట్యకారులు, చిత్రకారులు, స్థపతులు.. ఎన్నెన్నో ప్రశంసలు.. పొగడ్తలు.. వినిపించడం లేదు జాయపకు. కరతాళధ్వనులు చేస్తున్న అక్కల కరకంకణాలపై పడుతున్న కన్నీటి జడుల శబ్దాలే వినిపిస్తున్నాయి. వాటిల్లోంచి వినిపించిన సంభాషణలు.. ఎక్కడ ఉంటున్నావు? ఎవరు నీకు అన్నం పెడుతున్నారు? అంటూ అడిగిన కుశల ప్రశ్నలు.. వెలిబుచ్చిన వాళ్ల పరిస్థితులు..
కలబోసుకున్న మమతానురాగాలు.. అనుబంధాల పరవశాలు.. వెక్కిళ్ల మధ్య ఓదార్పులు!
చాలు.. ఈ తృప్తి చాలు! మరునాడు చౌండసేనాని భవంతికి వెళ్లి కృతజ్ఞతలు తెలియజేశాడు. వాళ్లూ సంతోషించారు. మీదు మిక్కిలి..
“అబ్బ.. ఎంత అందగత్తెలు మీ అక్కలు! చక్రవర్తి కూడా చూపు తిప్పుకోలేదు తెలుసా!? నిజంగా చాలా
కాలానికి అంత అందమైన ఆడపిల్లలను చూశాను!” నిజాయితీగా అన్నది మైలాంబ.
జాయప కూడా అక్కల గురించి ఎన్నో ఏళ్ల తర్వాత ఎన్నో కబుర్లు పంచుకుంటూ పులకించిపోయాడు. కానీ, చౌండ మాత్రం దీర్ఘాలోచనలో ఉండిపోయాడు. ప్రదర్శన పూర్తయిన తర్వాత లోపలోకి వెళ్తూ.. చక్రవర్తి అన్నమాట ఆయన చెవుల్లో మారుమోగుతున్నది.
“వాళ్లిద్దరూ.. పినచోడుడి కుమార్తెలు కదూ!?”..
అంత అద్భుతమైన అందగత్తెలను చూడకుండా ఉండటం మానవమాత్రుడికి సాధ్యం కాదు. ముప్పై ఏళ్ల యువ చక్రవర్తి గణపతిదేవుడు కూడా వాళ్లను ఎన్నోమార్లు తలతిప్పి చూడటం చౌండ కంటపడింది. అతి అందగత్తె అయిన సోమలదేవి సహజంగా ఈర్ష్యపడింది. వాళ్లను చూసి ఆమె ముఖం చిన్నబోయింది. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని చౌండ భయాందోళన. అందం నాశనం చేసిన రాజవంశాలు ఎన్నో!!
ఐదవ అధ్యాయం : పదిహేడేళ్ల యోధుడు!
“రా.. రా.. జాయపా!” అన్నాడు స్థపతి రామప.
ఆతుకూరు రుద్రేశ్వరాలయ ప్రాంగణం. ఉదయపు రెండో ఝాము వేళ. ఉలుల శబ్దాలు రుద్రేశ్వరుడిని అభిషేకిస్తున్న వేదమంత్రాల్లా.. ఆకాశాన్ని తాకుతున్నాయి.
శ.సం. 1085 స్వభాను సంవత్సరంలో ప్రారంభమైన ఈ దేవాలయం ఇప్పటికి పూర్తి ఆకృతి సంతరించుకుంది. గర్భాలయం, అర్ధమండపం, రంగమండపం, నంది మండపాలకు రూపం వచ్చింది. అధిష్ఠానం కింద ఉపపీఠం.. ప్రదక్షిణ కోసమన్నట్లు విశాలంగా ఉంది. ఆధారశిల, ఉపానం, పద్మం, పట్టిక, కుముదం, అధోపద్మం.. లాంటి ఉపపీఠం వరుసలపై అలంకారశిల్పం నిర్మితం కావాల్సి ఉంది. అధిష్ఠానానికి ఉపానం, కుముదం, కపోతం.. దానిపై గజధారను శిలావద్దకులు తదేకంగా చెక్కుతున్నారు. ఓ ఏనుగు రూపురేఖా విలాసాలు, అలంకరణలు మరో ఏనుగుకు సరిపోలవు.
వరుసగా ఒకదాని వెంట ఒకటిగా ఏనుగులు ప్రదక్షిణ పథాన్ని భక్తులకు వివరిస్తున్నట్లు సూచితం. ఒక గోడమీద ఓ గజధార గుడిలోకి వెళ్లే విధానం సూచిస్తే.. గుడినుంచి బయటికి వచ్చే దారి మరో గోడమీద మరో గజధార చెబుతున్నది. స్థంభాలకు మిట్టికులు చిత్రిక పడుతున్నారు.
“ఈయన భాండయ సేనాని. మండలేశ్వరులు రేచర్ల రుద్రేశ్వరుల సేనానులు. వీరే దేవాలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న కమ్మిక అధీకృతులవారు..” పరిచయంగా చెప్పాడు రామప. కటి భాగాన వేలాడుతున్న కరవాలంతో, సైనిక దుస్తుల్లో గంభీరంగా ఉన్న ఆ భాండయసేనాని నవ్వి..
“శిల్పాల సజీవ ప్రతీక ఈ అబ్బాయే కదూ..” అన్నాడు జాయపను గుర్తుపట్టినట్లుగా.
జాయప సిగ్గుగా నవ్వగా, రామప గర్వంగా మందహాసం చేశాడు. జాయపను కనుగొన్నానన్న ఆనందం ఆయనది. ప్రధాన దేవాలయానికి కుడివైపున కామేశ్వరాలయం, కల్యాణ మండపం, ఎడమ వైపున కాటేశ్వరాలయం కూడా రూపు తెచ్చుకున్నాయి. ఆవలగా శిల్పుల సమూహ గృహప్రాంగణం నుంచి పైకి లేస్తున్న వంటింటి పొగలు. ఈవలగా ఆడుకుంటున్న పిల్లలు. కుండలు చంకనబెట్టి వస్తూపోతూ ఉన్న పంచాణంవారి మహిళలు. కులీనులను తలపిస్తూ ఇతర వృత్తికులాల మహిళలకంటే కొంత ఉన్నతంగా, ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ముగ్గురూ ప్రదక్షిణ పథంలో నడుస్తూ దేవళాన్ని చూస్తూ మాట్లాడుకుంటున్నారు.
“మరేమైనా పైకం కావాలా.. చెప్పండి ఏర్పాటు చేస్తాను” అన్నాడు భాండయ.
“ప్రస్తుతానికి మీరు అందించినదే సరిపోతున్నది. అవసరమైతే అడుగుతాను”.
“సజీవ నాట్యకారులను ముందుంచుకుని శిల్పాలు చెక్కడం.. బహుశా ఏ దేవాలయ నిర్మాణంలోనూ జరగలేదు. అది మనమే ప్రారంభించడం గొప్పసంగతి. దీని నిర్మాణాంశం పూర్తిగా చక్రవర్తుల దృష్టిలో ఉంది. పెదతండ్రి శంఖుస్థాపన చేసిన ఈదేవళం తన పాలనాకాలంలో పూర్తి కావడం గణపతి ప్రభువులకు ఆనందమే కదా. వారు ఎప్పుడైనా స్వయంగా విచ్చేసినా ఆశ్చర్యం లేదు” అన్నాడు భాండయ.
“అది మా అదృష్టం కదా భాండయ..” అన్నాడు వినయంగా రామప. ముగ్గురూ గుర్రాలున్న చోటికి వచ్చారు. అక్కడొక ఆజానుబాహువు నిలబడి ఉన్నాడు. ‘ఎవరు?’ అన్నట్లు చూశాడు భాండయ సేనాని.
“అన్న కంటకదొర.. గిరిజన సైన్య శిక్షకుడు..” అన్నాడు జాయప.
భాండయకు వీడ్కోలు పలికాక కంటకదొర కూడా జాయపతో దేవాలయాన్ని తిలకించి పులకించాడు.
దేవాలయం రూపురేఖలు స్పష్టమయ్యాక మరెన్నో పురాణ, చారిత్రక అంశాలు, అందచందాలు, సామాజిక ప్రత్యేకతలు అద్ది దేవాలయాన్ని పది కాలాలపాటు చర్చాంశం చెయ్యాలని రామప తాపత్రయం.
ఆగామి దినాలలో ప్రజలు చర్చించుకునేది ఈ ప్రత్యేకతలనే కదా!
ఏడాది తర్వాత ఆతుకూరు వచ్చాడు జాయప. ఇంతకు రెండురోజుల ముందు దగ్గరలోని జోగులూరు గ్రామంలో కొండయ బృందంతో దక్షయజ్ఞం నాటకం ప్రదర్శించారు.
“ఏవో అనుకున్నా. నాట్టెం చదూకున్నాక నువ్వు బాగా తొక్కావ్..” అభినందించింది కాకతి.
ఈసారి జాయపతో కొంచెం చనువుగా మాట్లాడింది.
“అసలు మా ఊరు రావడం లేదేంటి?” అన్నది.
“మా అయ్య ‘పెళ్లి చేసేస్తా!’ అంటన్నాడు..” అని కనురెప్పలు వాల్చింది.
“నేనయితే అమ్మోరి గుడికి గుడిసానిగా పోదామనుకుంటన్నా!” అన్నది.. చేతిలో పండిన ఎర్రెర్రని గోరింటాకును చూసుకుంటూ. ఏం బదులివ్వాలో తెలియలేదు జాయపకు.
కలిసినప్పుడల్లా కాకతి.. ఒక్కొక్క పువ్వేసి అన్నట్లు.. అందాల అలంకృత బతుకమ్మలా.. ఒక్కోసారి ద్వీపసీమ నంగేగడ్డరేవులో కృష్ణమ్మలా కనువిందు చేస్తూ.. తనను ఆ రసస్రవంతిలో మునకలు వేసే తుమ్మెదను చేస్తున్నట్లు భావించాడు. ఆమె మనసులోని భావనలు తనకు చెప్పుకోవడం చెప్పలేని ఆనందం కలిగించింది.
“ఇవన్నీ నాకు ఎందుకు చెబుతున్నావ్ కాకతి?” అన్నాడు చటుక్కున.
ఈసారి ఆమె వేగంగా జవాబివ్వలేదు. అసలు తలెత్తలేదు. కానీ, ఆమె బుగ్గల్లో పొంగిన వేడి ఆవిరులు
అతనికి స్పష్టంగా కనిపించాయి. కనురెప్పలు కదిలి ఆగడం.. పెదవులు కంపించి నిలవడం.. తెలిశాయి.
“నువ్వు గురుకులంలో చేరి నాట్యం నేర్చుకో కాకతి..” అన్నాడు జాయప.
“ఎందుకు?”.
“నాకు దగ్గరగా ఉంటావ్!!”.
తర్వాత ఆమె ఉద్వేగంతో నిలువెల్లా కంపించి చటుక్కున మాయమైంది. కారణం అక్కడికి స్థపతి రామప వచ్చాడు.
“తమరి ప్రదర్శన తెలుసుకుని వచ్చాను. నీ దర్శనభాగ్యం దొరకడం లేదు జాయపా..” అన్నాడు.
“క్షమించు గురుదేవా! అనుమకొండ శిల్పశాల వద్దే నేను, కొందరు నాట్యకారిణులు, వాద్యకారులు సజీవ ప్రతీకలుగా నిలబడగా, శిల్పులు శిల్పీకరిస్తున్నారు. ఆతుకూరు రావడం కుదరలేదు. రేపు తప్పకుండా వస్తాను”. మరునాడు కంటకదొరను తోడ్కొని ఇక్కడికి వచ్చాడు జాయప. నిర్ణయించిన నాట్యదృశ్యాలు కొన్ని చెక్కడం అయ్యింది. మిగిలిన భాగాలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించాక తిరుగు ప్రయాణమయ్యారు జాయప, కంటక. జాయప జీవితంలో అప్పుడు మరో ముఖ్య సంఘటన జరిగింది.
(సశేషం)
– మత్తి భానుమూర్తి 99893 71284