జరిగిన కథ :
ఎవరికీ చెప్పకుండా అక్కలతో కలిసి అనుమకొండకు వచ్చిన జాయప.. చౌండ ఇంట్లోనే ఉంటున్నాడు. కొన్నిరోజుల తర్వాత బయటి ప్రపంచం చూడాలన్న కుతూహలంతో రాజప్రాసాదం బయటికి వచ్చాడు. రాజధాని వీధుల్లో ఒంటరిగా తిరుగుతూ.. సుబుద్ధిని కలుసుకున్నాడు. జాయప పెద్దల గుర్తింపులో లేడని గుర్తించి.. తన ఇంటికి తీసుకెళ్లాడు.ద్వీపరాజ్యంలో బంధువుల అబ్బాయిగా.. జాయపను తన కుటుంబానికి పరిచయం చేశాడు సుబుద్ధి.
సుబుద్ధిది చాలా పెద్ద కుటుంబం. వాళ్లు ఆరుగురు అన్నదమ్ములు. ఇద్దరు అక్కలు. అందరూ విడివిడిగా పక్కపక్క ఇండ్లలో కాపురం. ఆ వీధి అంతా వీళ్ల కుటుంబాలే! సుబుద్ధికి ఇద్దరు భార్యలు, నలుగురు సంతానం.
“ఈ అబ్బాయి జాయప. మన చెన్నప.. అదే! కామితమ్మ పెద్దమ్మకూతురు. తూర్పోళ్ల పిల్లాణ్ని మనువాడింది గుర్తుందా!? ఆళ్ల బావగారి అబ్బాయి. అక్కడ ద్వీపరాజ్యంలో పోతార్లంక గ్రామం. అబ్బో! పెద్ద ఓడల వ్యాపారి ఆయన. ఓరుగల్లులో సుట్టాలుంటే పంపాడు. ఉంటే ఇక్కడ ఉంటాడు. పోతే అక్కడికి పోతాడు. మన ఇంట్లో ఉన్నప్పుడు మనం బాగా చూసుకోవాలి..” అని భార్యలకు చెప్పి, లోపలికి వెళ్లిపోయాడు సుబుద్ధి.
అక్కడే ఉంటే వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇబ్బంది. అన్నదమ్ముల ఇండ్లు వేరువేరుగా ఉన్నా ఒకే వీధికావడం వల్ల పిల్లలంతా ఆ వీధి మొత్తం పరుగులుపెడుతూ.. ఆడుకుంటున్నారు. దాదాపు పాతికమంది. జాయపను చూడగానే అంతా తన చుట్టు మూగిపోయారు. జాయపకు ఉత్సాహం పెరిగింది. వీళ్లంతా కొంత వింతగా ఉన్నారు. చౌండ పిల్లలు తనలాంటి పిల్లలు. వీళ్లు తనకు పరిచయం లేనివారు. అశుభ్రంగా.. నలిగిన బట్టల్లో ఉన్నారు. మగపిల్లలు అందరూ గోచీలు పెట్టుకున్నారు. ఆడపిల్లలు నడుముకు ఏదో చుట్టుకున్నారు. పైన ఆచ్ఛాదన కొందరికే ఉంది. పసిపిల్లల నడుముకు సిగ్గుబిళ్లలు ఉన్నాయి. అందరూ చురుగ్గా హుషారుగా ఉన్నారు. పరుగులు పెడుతున్నారు. ఎగిరి దుంకుతున్నారు. నవ్వుతూ.. ఏడుస్తూ.. మళ్లీ నవ్వుతూ.. చీమిడి ముక్కులతో, వీధిమట్టిలో పొర్లాడుతూ.. మొక్కల్లా, చెట్లలా.. ప్రకృతిలో భాగంగా.. గాలి కెరటాల్లా.. ఆకాశంలో పిట్టల్లా! జాయప అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు.. ఎప్పుడూ మృదు గంభీరంగా ఉంటారు. కాటమ, పద్మాక్షి కూడా అంతే. కానీ, వీళ్లంతా వొరుసుకు రాసుకు పూసుకు తిరుగుతున్నారు. కొట్టుకుంటున్నారు. గిచ్చుకుంటున్నారు. మళ్లీ కలిసిపోయి ఆడుకుంటున్నారు.
‘వీళ్లు నాకు నచ్చారు!’ అనుకున్నాడు జాయప.
వాళ్లను కాసేపే చూశాడు. త్వరగానే వాళ్లతో కలిసిపోయాడు. తానూ ఆ వీధిలో.. మట్టిలో ఆడాడు. పడి దొర్లాడు. ఒంగుళ్లు దుంకుళ్లూ ఆడాడు. బొంగరాలు తిప్పాడు. ఎంతో ఎంతో గట్టిగా అరిచాడు. బిగ్గరగా నవ్వాడు. సుబుద్ధి కొడుకు మంచన.. తన ఈడు వాడు.. అతణ్ని ‘వరే!’ అని ఏకవచనంతో పిలిచాడు. వాడూ అలాగే పిలిస్తే తనకు ఎంతో బాగుంది.
సాయంకాలం వరకూ వాళ్లంతా ఆడుతూనే ఉన్నారు. మధ్యలో తల్లులు పిలిచి.. రాకపోతే తిట్టి.. కొట్టి.. అరుగుల మీదికి లాక్కుపోయి ఏవో తినడానికి పెట్టారు. ఆ పళ్లేరాలు.. ఆ వంటలు.. ఆహార పదార్థాలు కొంత పాతవే అయినా, కొత్త అనుభవాన్ని పొందాడు జాయప. పిల్లలంతా ఇష్టంగా తినలేదు. కష్టం గా.. ఆటలు ఆగిపోవడంతో చిరాగ్గా తిన్నారు. అమ్మలు తిట్టి నోట్లో కుక్కారు. చివరికి అందరూ మళ్లీ అరుగు దిగి, ఆగిన ఆటలను కొనసాగించారు.
సంధ్యవేళకు తనను ఎవరో చూస్తున్నట్లుగా అనిపించి వీధి వైపు చూశాడు జాయప. ఎదురుగా చంద్రి.. చౌండ నగరిలో పరిచారిక. పక్కన రాయస. నగరి దౌవారికుల్లో ఒకడు. తమను జాయప గుర్తించినట్లు భావించి నవ్వారు. జాయప వారి దగ్గరికి వెళ్లాడు.
“అరె! మీరేవిటి ఇక్కడ ఉన్నారు?” అన్నాడు జాయప ఆశ్చర్యపోతూ.. ఇద్దరూ నవ్వారు.
“మా ఇండ్లు కూడా పక్క వీధిలోనే. అటు వెళ్తుంటే చూసి గుర్తుపట్టాం. ఇవిగో మీ దుస్తులు. మైలాంబ అమ్మగారు ఇవ్వమన్నారు”.. గుడ్డసంచి అందిస్తూ అన్నారు. తీసుకున్నాడు జాయప.
“జాగ్రత్త యువరాజా! మీరు ఎప్పుడు రావాలంటే అప్పుడు నగరికి రమ్మన్నారు అమ్మ..” అని చెప్పి
వెళ్లిపోయారు.
తాను ఇక్కడ ఉన్నట్లు వాళ్లకు ఎలా తెలిసిందో.. అతని చిన్నిబుర్ర ఆలోచించలేదు. కేవలం తన దుస్తులు తనకు చేరాయి కాబట్టి, ఇక్కడ ఉండొచ్చు అని సంబురపడ్డాడు. కానీ, సుబుద్ధి అసలు సంగతి గ్రహించాడు.
‘అనుకున్నట్లే జరిగింది! జాయప బయటికి వచ్చిన దగ్గరినుంచి చౌండసేనానుల వారి వేగులు అనుసరిస్తున్నారు. ఇక్కడ ఇంటికి వచ్చేవరకూ వెనకే వచ్చారు. ఇప్పుడు బట్టలు పంపారు. వాళ్లు భార్యాభర్తలు కావచ్చు కాకపోవచ్చు. పక్కవీధిలో ఉండేవాళ్లు మాత్రం కాదు’..
జాయప విషయంలో చౌండ పరిస్థితి చిత్రమైనది. తన ఇంటికి వచ్చిన జాయపను పొమ్మనలేడు. ఉంచుకోనూ లేడు. కానీ, అతనికి ఏదైనా అపాయం జరిగితే.. అది పెద్ద విషయమై చౌండ తలకు చుట్టుకుంటుంది. అందుచేత జాయపను కాపాడాల్సిన బాధ్యత పూర్తిగా చౌండ మీదే ఉంది. అది చౌండకు తెలుసని సుబుద్ధి సూక్ష్మబుద్ధికి తోచింది. అప్పటికప్పుడే సుబుద్ధి, తమ్ముడు భైరయను వెంటబెట్టుకుని చౌండ సేనాని
నగరికి వెళ్లాడు. ఆయన కొలువు మందిరంలోకి రాగానే ఇద్దరూ ఆయన పాదాలపై పడ్డారు. నమస్కరించి తాము ఎవ్వరో చెప్పుకొని.. జాయప తమ ఇంట్లో ఉన్నట్లు చెప్పారు.. ఎలాంటి భావప్రకటనా లేని ముఖంతో.
“జాయప ఎవరో తెలుసా?” అన్నాడు.
“తెలుసు మహాప్రభు! ద్వీప యువరాజుగారు.. మన సైన్యం తిరుగు ప్రయాణంలో నా గజాన్ని అధిరోహించారు. మళ్లీ ఈరోజు అంగళ్ల వద్ద గుర్తుపట్టి, నాతో మా ఇంటికి వచ్చారు. అది తమరికి విన్నవిద్దామని వచ్చాం. తమరి సెలవు ఏవిటో..” తలవంచుకొని నసిగాడు సుబుద్ధి. ఆయన దీర్ఘంగా నిట్టూర్చి.. “జాగ్రత్త! జాయప మా ఇంటికి వస్తానన్న మరుక్షణం.. ఇక్కడికి తీసుకురావాలి సుమా!” అన్నాడు. “తమరి ఆజ్ఞ..” వంగి నమస్కరించి, వెనక్కి నడిచి, బయటికి వచ్చారిద్దరూ.
వాళ్లు వెళ్లగానే దౌవారికుడు రాయస లోపలికి వెళ్లాడు.
అరుగుపై కూర్చుని, మోకాలిపై కొంత కచ్చిక బూడిద రాసుకుని.. గోగునారతో తాడు పేనుతున్నాడు సుబుద్ధి.
“నమస్తే సుబుద్ధి గారు!”..
ఆ మాటలు వినగానే.. తలెత్తి చూసి ప్రతి నమస్కారం చేశాడు. ఎదురుగా ఉపాధ్యాయుడు శుక్ర శర్మ. గోధుమరంగు ధోవతిపై పట్టుకండువా వల్లెవాటుగా ధరించి.. నుదుటన బొట్టు, నున్నగా దువ్వికట్టిన అందమైన శిఖతో చిరునవ్వు చిందిస్తూ అచ్చమైన గురువులా ఉన్నాడాయన. అతణ్ని చూడగానే పిల్లలంతా తలో దిక్కుకూ పారిపోయారు. సుబుద్ధి లేచి అరుగుపై ఈత ఆకుల చాప పరిచాడు. కానీ, పిల్లల్ని గట్టిగా పిలవలేదు.
‘విద్య అనేది కేవలం బ్రాహ్మణ, కోమట్ల పిల్లలకే గానీ మనకెందుకు?’ అనే భావన సుబుద్ధిలాంటి చతుర్ధ కులాల వారికి ఉన్న అభిప్రాయం. ఈ కుటుంబాల ఆడవాళ్లదీ అదే అభిప్రాయమైనా.. ఇటీవల మారుతున్నది. చదువుకున్న పిల్లల ప్రవర్తనలో ఉండే సంస్కారం.. మగవారికంటే ఇప్పటి స్త్రీలే ముందుగా గ్రహిస్తున్నారు.
శుక్ర శర్మ రాకను గుర్తించిన సుబుద్ధి భార్య బాలాంబ.. పిల్లల్ని కేకేసింది. అప్పుడు చూశాడు శుక్ర శర్మ.. జాయప వంక. పిల్లలతో ఆడుతున్నా.. బాలాంబ పిలవగానే వచ్చినవాడు జాయప. తనను పరిశీలనగా చూస్తున్న జాయపను చూసి.. చిరునవ్వు నవ్వాడు శర్మ.
“ఈ అబ్బాయి..?” అన్నాడు ఎగాదిగా చూస్తూ.
“మా బంధువుల పిల్లవాడు” అన్నాడు సుబుద్ధి.
జాయప ఒంటరిగా ఉన్నప్పుడు రాకుమారుడిగా, అందరితో ఉన్నప్పుడు బంధువైన పిల్లవాడిగా అతనితో ప్రవర్తిస్తుంటాడు సుబుద్ధి.
“చదువుకుంటావా?” అన్నాడు శుక్ర శర్మ నవ్వుతూ.
ఆయన్నే పరీక్షగా చూస్తున్న జాయప.. తల అటూ ఇటూ.. ఎటూ అర్థం కానట్లు ఊపాడు. ఆయన భ్రుకుటి ముడివేసి మళ్లీ అడిగాడు. అప్పుడు జాయప..
“చదువుకుంటాను. తమరి అర్హతలేవిటో ?” అన్నాడు.
శుక్ర శర్మ దిగ్భ్రాంతిలో ఉండిపోయాడు. సుబుద్ధి ఎప్పుడూ ఈ ప్రశ్న అడగలేదు. ఆయన చెప్పలేదు. అప్పుడొచ్చిన పిల్లలు.. ఆయన్ను రక్షించారు. తల్లులు కొట్టి లాక్కురావడంతో.. ఏడుస్తూ గోలగోలగా వచ్చారు. దాంతో జాయప ప్రశ్న పక్కకు పోయింది. అందర్నీ కూర్చుండ బెట్టాక..
“పంతులూ.. పాఠం చెప్పు..” అన్నది సోమిదమ్మ.
శుక్ర శర్మ వెంటనే కండ్లు మూసుకుని దైవ ప్రార్థనలా లోలోన ధ్యానించుకుని..
“పిల్లలూ దైవ ప్రార్థన! ముందు వినాయక ప్రార్థన చేద్దాం. నేను చెప్పినట్లు అందరూ చెప్పండి..” అన్నాడు.
అందరూ బలవంతంగా కండ్లు మూసుకుని ఆయన చెప్పినట్లే చెప్పారు.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ॥
శుక్ర శర్మ ఓ కన్ను జాయపపై వేసి ఉంచాడు. ఆయన చెప్పింది చెప్పలేదు జాయప. ఆయన అలాగే చూస్తూ.. గురువు హోదాలో గంభీరంగా..
“నువ్వు చెప్పలేదేం?” అన్నాడు.
సుబుద్ధి మళ్లా కంగారుపడ్డాడు.
“పంతులూ! ఆ అబ్బాయిని వదిలెయ్యి” అన్నాడు.
కానీ, అప్పటికే ఆలస్యం జరిగిపోయింది.
“గురువుగారూ.. ఈ ప్రార్థనా గీతంలో వినాయకుడి పేరే లేదే?” అన్నాడు జాయప.
జాయప విషయంలో చౌండ పరిస్థితి చిత్రమైనది. తన ఇంటికి వచ్చిన జాయపను పొమ్మనలేడు. ఉంచుకోనూ లేడు. కానీ, అతనికి ఏదైనా అపాయం జరిగితే.. అది పెద్ద విషయమై చౌండ తలకు చుట్టుకుంటుంది.
ఈసారి గురువు శుక్ర శర్మ నిజంగానే తత్తరపడ్డాడు. జాయప నిజాయతీగా, తెలియంది అడగడం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నది.
శుక్ర శర్మ పెద్దగా చదువులేని పంతులు. తన తండ్రికూడా ‘ఇదే ప్రార్థనా గీతం!’ అని చెబుతాడే?! గతంలో జైనుల ప్రార్థనా గీతం ఏదో ఉండేదట. అదిప్పుడు చెబితే రాజులకు అంగీకారం కాదట. అందుకని ఇది కొడుకుతో బట్టీ పట్టించి.. కొడుక్కి గురువు వేషం వేసి, చదువుపట్ల పెద్దగా పట్టింపులేని శూద్ర కుటుంబాల పిల్లలకు విద్య బోధించడానికి ఏర్పాటుచేశాడు శుక్ర శర్మ తండ్రి.
జాయప సంగతి ఎక్కడ బయట పడుతుందోనని ఆందోళన చెందుతున్న సుబుద్ధి..
“జాయపా! ఇటురా నాయినా. నావద్ద కూర్చో..” అని దగ్గరికి పిలిచి, శర్మను రక్షించాడు.
సుబుద్ధిలా తాడు పేనడం తను కూడా చేస్తూ మెల్లగా అన్నాడు జాయప..
“మామయ గారూ! ‘ఘృతకోశాతకి’లోని ఘృతంలా ఉంది ఈయన చెప్పే చదువు..” అన్నాడు.
ఆ సంస్కృత పరిహాసం అర్థం కాక అయోమయంగా చూశాడు సుబుద్ధి.
“అంటే.. నేతి బీరకాయలో నెయ్యిలా ఉంది ఈయన చెప్పే చదువు!”.. వివరించి పకపకా నవ్వి,
“మీరూ చదువుకోవాలి మామయ గారూ!” అన్నాడు.
అన్నాక కూడా నవ్వుతూనే ఉన్నాడు. సుబుద్ధి కూడా చిరునవ్వు నవ్వాడు.
అప్పుడే సుబుద్ధి తమ్ముని భార్య చేటలో కొన్ని సజ్జలు, కొన్ని కూరగాయలు తెచ్చి..
“ఇవిగో పంతులు. ఏదీ నీ సంచి పట్టు” అన్నది. ఆయన ఆనందంగా పక్కనున్న గుడ్డసంచి తీశాడు. ఆమె వాటిని అందులో వేసింది. అలా రోజూ ఒకరు అతనికి జొన్నలు, కూరగాయలు ఇస్తారు. కాసేపు పిల్లలతో ఏవేవో వల్లె వేయించి వెళ్లిపోయాడు శుక్ర శర్మ. పిల్లలు గోలగోలగా లేచి జాయపను కూడా ఆటలకు
లాక్కుపోయారు. (సశేషం)
మత్తి భానుమూర్తి