జరిగిన కథ : ఒకనాడు రాజప్రాసాదంలో నియోగ విభాగాలను పరికిస్తూ ముందుకుపోతున్న జాయచోడుణ్ని.. ‘నమస్తే.. జాయచోడ సాహిణుల వారికి..’ అంటూ ఎవరో పలకరించారు. పూర్తిగా కొత్త ముఖం! ‘రాయప్రోలు సూరంబొట్లు మమ నామధేయం. మహామండలేశ్వరులకు సూతునిగా నియమించారు!’ అంటూ చెప్పాడు.
‘సూతుడా!?’.. ఎక్కడో ఈ సూత పదం చదివినట్లు.. ఆయన నవ్వి..
“ఆశ్చర్యపోకండి. సూతుడు అంటే ధర్మపన్నాలు చెప్పేవాడని అర్థం. అంటే మహారాజులవారి వెంట ఉంటూ సందిగ్ధ సమయాల్లో ఏ నిర్ణయం తీసుకోవాలని ధర్మశాస్ర్తాలు చెబుతున్నాయో పరిశీలించి.. వాటిలో సూక్ష్మార్థాలను వివరించి వారి ముందు పరచడమే మా నియోగం..”
ఇలాంటి ఏవేవో కొత్తకొత్త నియోగాలు బావగారు ఎప్పుడూ ఏర్పాటు చేస్తూనే ఉంటారు. అప్పుడే మరో నియోగమందిరం నుంచి ఇద్దరు నియోగులు జాయచోడుణ్ని చూసి గుర్తించి పరుగున వచ్చారు.
“జాయసేనానుల వారికి ప్రణామాలు..” ఒకరు అంటుండగా.. మరొకరు జాయచోడుని కాళ్లపై పడ్డాడు.
“నన్ను గుర్తుపట్టారా.. నేను శుక్ర..
చతుష్పథం వద్ద.. నేనే..”
గుర్తించాడు జాయచోడుడు. శుక్ర! చతుష్పథం వద్ద చర్చల్లో ప్రముఖ విశ్లేషకుడు.. ఆ రోజుల్లో!
అప్పుడు గ్రామీణ యువకుడు. సాధారణ పంచెకట్టు, కంచుకం.. ఇప్పుడు వయసు పైబడింది. ఆహార్యంలో రాచరిక నియోగ అధికార హోదా. చటుక్కున లేవనెత్తి హత్తుకున్నాడు.
“శుక్రా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..”
శుక్ర ఆనందబాష్పాలు కారుస్తున్నాడు.
“మీ ఎదుగుదల అంతా చూస్తూనే ఉన్నాను జాయచోడదేవా..”
అతని ముందు అప్పుడు చిన్న పిల్లవాడు తను.
నవ్వి..
“నీకు కూడా జాయచోడ దేవుణ్నేనా.. శుక్రా!! అప్పటిలాగే ‘జాయా!’ అని పిలువు చాలు..”
“మీకు ఈయన్ను పరిచయం చెయ్యాలి. ఈయన వరాహభట్టు. గుర్తుపడతావా జాయా.. అప్పట్లో పిల్లవాడు. నీ వయసే. చతుష్పథం వద్ద మన కబుర్లు, చర్చలు వినడానికి నిత్యమూ వచ్చేవాడట. ఇప్పుడు చక్రవర్తుల వారికి ఆర్థిక సలహాదారు. అక్కడ మన చర్చల వల్ల ఉత్తేజం పొంది ఉత్తరాన విక్రమశిల విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రం చదువుకుని వచ్చాడట. నన్ను వెదికి పట్టుకుని చక్రవర్తులవారికి చెప్పి ఇక్కడో నియోగం ఏర్పరచి నన్ను దానికి అధికారిని చేశాడు..”
అబ్బురంగా చూశాడు జాయచోడుడు. అప్పుడు మిత్రుల కబుర్లు, చర్చలకు దారినపోయే దానయ్యలు ఎందరో చెవి కోసుకునేవారు. అందులో ఈ కుర్రాడు ఒకడన్నమాట. చతుష్పథం గుర్తుచేస్తే ప్రాణం లేచి వస్తుంది.
“అప్పట్లో రాజనగరి వార్తలు ప్రజలకు చేర్చగా.. ప్రజలు ఏం అనుకుంటున్నారనేది రాజనగరికి చేరితే.. పరిపాలన బావుంటుందని చక్రవర్తులవారు సంఘీయుల నియోగం ఏర్పరచారు. ఈ వరాహుడు నన్ను వెదకి దానికి నియోగాధికారిగా నియమించాడు”.
“విదేశీ వార్తలు తెలిపేవారు జాంఘీయులు కాబట్టి సంఘంలోని వార్తలను వివరించేవారు సంఘీయులు. బాగు బాగు” అన్నాడు జాయచోడుడు.
ఇలాంటివే మరికొన్ని నియోగాలు కనిపిస్తున్నాయి. నీటిపారుదల నియోగం, ఖనిజాల నియోగం, వాతావరణ నియోగం. ఓయమ్మో.. మరి సాహిత్య, నాట్య నియోగాన్ని కూడా ఏర్పరచారా..
అదే అడిగాడు సరాసరి చక్రవర్తినే.
“మీ రాకకోసం ఎదురుచూస్తున్నాం. తమరినే ఆ నియోగానికి అధిపతిని చెయ్యడానికి..” అన్నాడు.
“అధికారం నావల్ల కాదు కదా బావగారూ..”
“అలా అనుకున్నంత కాలం ఆ బిడియం అలాగే ఉంటుంది. మన కళామండపంలో జరిగే సాహితీ నాట్య సమావేశాలకు ఎందరెందరో పండితులు, కళాకారులు, కవులు వస్తున్నారు. ఒక్కసారి అక్కడికి వెళ్లి పరిశీలించు..” అన్నాడాయన.
తనకు సహజంగా ఉండే కుతూహలంవల్ల మరునాడే అక్కడికి వెళ్లాడు. అయితే ఇటీవల జాయచోడుడు ముఖానికి విభూతిరేఖలు పెట్టుకోవడం మానేశాడు. మత యుద్ధ ప్రభావం కావచ్చు. హరిహర తాత్వికుడైన తిక్కనామాత్యులు ముఖాన ఏమీ ధరించరని విన్నాక కావచ్చు.
“అదేమిటి.. ముఖాన విభూతి ఏది జాయా!?”.. ముందు అక్కే అడిగింది.
ఏమి చెప్పాలో తెలియక నీళ్లు నమిలాడు. బయటికి కదిలాడు. ద్వారపాలకులు, ప్రతిహారి, పరిచారికలు, దౌవారికులు.. ఎదురొచ్చిన వారల్లా ముఖం చూసి లిప్తకాలం భృకుటి ముడివేసి లేదా రెప్పలు అల్లార్చి.. విచిత్ర అభినయ ప్రకటనతో.. కొద్ది స్మితంతో.. మరికొద్దిపాటి సంభ్రమంతో.. రాజప్రాసాదం దాటే సరికి దాదాపు యాభై ప్రశ్నార్థకాలు.
‘ముఖాన విభూతి ఏది’.. ‘లేకుండా వచ్చారు’.. ‘అరె మర్చిపోయినట్లున్నారు’.. ‘తీసేశారా ఏంటి’.. ‘అరె.. ముఖం పలకమారిన మామిడిపండులా ఉంది మహానుభావా!’.. ‘వీబూదిరేఖలుంటే స్పటిక శివలింగంలా వెలిగిపోతుంది’..
అవన్నీ దాటుకుని తట్టుకుంటూ ఈదుకుంటూ చివరికి కళామందిరానికి చేరాడు.
దాని పరిసరాలకు ఎప్పుడొచ్చినా ఉద్వేగాన్ని కలిగిస్తాయి. కానీ, ఈసారి కొద్దిగా దివాళా.. సూరప్పను అవమానించిన చోటు కూడా ఇదే!
కరతాళధ్వనులు ఇహలోకానికి తెచ్చాయి. కవి పండితులంతా ఆహ్వానం పలుకుతున్నారు. ఎప్పటిలాగానే చాలా సాధారణంగా వచ్చేశాడు. కానీ, అక్కడున్న ప్రఖ్యాతులంతా అంతలా ఆహ్వానిస్తారని ఊహించలేదు.
ఓ కవి మరో కవిని ప్రస్తుతించడు. ఓ పండితుడు మరో పండితుని రచనా ధోరణిని అంగీకరించడు. మహారాజులెవరైనా గ్రంథ రచయితలైతే ఆహా ఓహో అంటారు కానీ.. అవి కేవలం పెదవులు పలికే మాటలే. రాజప్రశస్తిలో పొగడటం సాహిత్య సంప్రదాయమే కానీ కవిపండిత సమాగమాల్లో అంగీకరించరు. కానీ, ప్రస్తుత కవిపండిత లోకమంతా జాయచోడుడు నిర్వహించిన ఆ కళాయుద్ధ ప్రయోగాన్ని సొంతం చేసుకున్నారు. తెలిస్తే తాము కూడా వెళ్లి పద్యమో గద్యమో పాటో నృత్తమో ప్రదర్శించి.. ఆ సైనికులను మెప్పించేవాళ్లం కదా అని కొందరు భావించారు.
కరుడుకట్టిన శైవకవులు, వైష్ణవపండితులు మాత్రం వాళ్ల మనస్సీమలలో అంగీకరించలేదు. పైకి మాత్రం అందరితో జాయచోడుణ్ని అభినందించారు. ఇది సాహిత్యలోకంలోనూ యుద్ధ చరిత్రలోనూ చారిత్రాత్మకంగా నిలుస్తుందంటూ ఆహ్వానించారు. పూలదండలలో ముంచెత్తారు. లోపలికి వెళ్లాక జాయచోడుడు అడిగాడు ఆశ్చర్యంగా..
“ఈరోజు నేను వస్తున్నానని మీకందరికీ ఎలా తెలుసు?”.
అందరూ ముక్తకంఠంతో..
“లలితాంబ..” అన్నారు.
అనడమే కాదు.. అంతా రెండువైపులా చీలి వేదికను చూపారు.
వేదికపై నర్తకి ఆహార్యంతో లలితాంబ.. వినయంగా వంగి నమస్కరించి ఓ స్వాగత నృత్తం అభినయించి ఆస్థాన నర్తకిగా జాయచోడుణ్ని ఘనంగా స్వాగతించింది.
అప్రతిభుడయ్యాడు.
అభినందనగా బొటనవేలు చూపాడు.
కళామందిర ప్రవేశం జాయచోడునికి కాస్త మనఃశాంతిని ఇచ్చింది. మళ్లీ కూసెనపూండి కళాక్షేత్రంలో ఉన్న భావన కలిగింది. అందరూ తననే చూస్తుండగా లలితాంబ వచ్చి తనను తాకుతూ.. భుజాలపై చెయ్యి వేయగా ఇహలోకంలోకి వచ్చాడు. అందరూ ఆసనాలలో కూర్చోగా సభానాయకుని కోసమున్న ఆసనంలో ఎవ్వరూ కూర్చోలేదు. అందరినీ చూస్తూ అడిగాడు..
“ఇదేమిటి? ఈ ఆసనం ఖాళీగా ఉంది.. సభా నాయకుడు ఎవరు? ఈరోజు వారు రాలేదా..”
“నువ్వే మామా.. సభానాయకుడివి..” అన్నది అల్లరిగా లలితాంబ.
అందరూ పగలబడి నవ్వుతూ కరతాళ ధ్వనులు చేశారు. ఊహాతీతమైన అంశం కావడంతో ఆయన చిద్విలాసంగా చూస్తుండగా అన్నది లలితాంబ..
“నువ్వు అనుమకొండకు తిరిగి రావడంతో మేమంతా ఈ నిర్ణయం తీసుకున్నాం..”
‘అవును’.. ‘అదే అదే’.. ‘అవునవును’.. ‘మీకోసమే ఆ ఉచితాసనం’.. అందరూ తలోమాట అన్నారు.
“శ్రీమాన్ ధీమాన్ వివేకీ వితరణనిపుణో గానవిద్యాప్రవీణః..
సర్వజ్ఞః కీర్తిశాలి సరసగుణయుతో హావభావావేష్వభిజ్ఞః
మాత్సర్యాదైర్విహీనః ప్రకృతి హితసదా చారశీలో దయాళుః
ధీరోదాత్తః కళావాన్ నృపనయచతురో సౌ..
సభానాయకస్స్యాత్
(సంపదకలవాడు, బుద్ధిమంతుడు, యుక్తాయుక్త వివేకం కలవాడు, దానశీలుడు, గానవిద్యాప్రవీణుడు, సర్వజ్ఞుడు, కీర్తిశాలి, సరసగుణశీలి, హావభావవిన్యాసశీలి, మాత్సర్యాదులు లేకుండా సందర్భోచిత ప్రవర్తనకలవాడు, ధీరోదాత్తుడు, విద్వాంసుడు, రాజనీతిజ్ఞుడు.. మాత్రమే సభానాయకుడు కావాలి)”..
నందికేశ్వరుడు అభినయదర్పణంలో పేర్కొన్న సభానాయకుని లక్షణాలు చెప్పాడో కవివరేణ్యుడు. అవన్నీ జాయచోడునిలో ఉన్నట్లు అందరూ ముక్తకంఠంతో అవునవునన్నారు.
“నేను గానవిద్యాప్రవీణుడను కాదు కదా..” నసిగాడు జాయచోడుడు.
“నేను నేర్పిస్తాను మామా..” అన్నది అల్లరిగా లలితాంబ.
అందరూ మళ్లీ నవ్వగా ఓ శృంగార కవి అన్నాడు..
“నువ్వు నేర్పాల్సింది వేరే ఉందిగా లలితాంబా..”
అందరూ మళ్లీ ఘొల్లుమనగా.. లలితాంబ అనేకానేక అభినయ, హస్త, కటి, గ్రీవ, పాద నాట్యవిన్యాస సిగ్గులతో జాయచోడుని భుజంపై ముఖం దాచుకుంది.
రాజనగరి కళామందిరం ఆనాటి నుంచి అత్యున్నత కళా నాట్యవిన్యాసాలతో చర్చలతో కవిపండిత సమ్మేళనాలతో దేదీప్యమానంగా శోభిల్లుతున్నది. కూసెనపూండి కళాక్షేత్ర నిర్మాతగా.. ద్వీపరాజ్యంలో కూసెనపూండి భాగవతమేళాలకు ఆయన ఇస్తున్న ప్రోత్సాహం ఇక్కడ ప్రతిస్పందిస్తున్నది.
గతంలో విష్ణుకుండినుల రాజధాని ఇంద్రపాలనగరంలో కూడా కొన్ని గ్రామాలు నాట్యానికి కేంద్రంగా ఉండేవి. జాయచోడుడు ఆ గ్రామాలను గుర్తించి అక్కడ కూడా కూసెనపూండి స్థాయి నాట్యక్షేత్రాన్ని నిర్మించాడు. ఆ నాట్యకారులు సాధారణంగా దక్షిణాది వైపుకాక దేవగిరి, హోయసల, లాట తదితర ఉత్తరదేశ రాజ్యాలకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తుంటారు. ఓడ్ర దేశంలో వీరి ప్రదర్శనలకు బ్రహ్మరథం పడుతుండటంతో ఇటీవల అటుపోవడం ఎక్కువైంది.
అనుమకొండ కళామందిరం సామ్రాజ్యస్థాయి కళావేదిక కావడంతో సంస్కృత, తెలుగు భాషా సాహిత్యాలలో పుంభావ సరస్వతులైన కవిపండితులు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. చర్చోపచర్చలు జరుగుతుంటాయి.
వారితో గొడవ మతం వద్దనే వస్తుంది. జాయచోడుడు అందరితో మతాతీతంగా ఆత్మీయంగా ఉంటాడు. వాళ్ల ప్రతిభకే అతని మొదటి ప్రాధాన్యత.
వెలనాడుప్రాంత రాజ్యలలో వైష్ణవం ప్రబలంగా ఉన్నా.. అనుమకొండ చుట్టుపక్కల రాజ్యాలలో శైవం ఇంకా బలీయంగానే ఉంది. కారణం వీరశైవమఠ గురువుల ప్రభావం. అందులో మహాకవులు, పండితులు కూడా ఉండటం. అలాంటి వారిలో చాలామంది కవిపండితులు సాధారణంగా ఈ కళామందిర చర్చలకు రారు. ఎప్పుడైనా వచ్చినా గణపతిదేవుణ్ని, జాయచోడుణ్ని కలిసిపోతారు. వారి ప్రతిభను గుర్తించి జాయచోడుడే వారి ఆశ్రమాలకు వెళ్లి వారితో సాహిత్యచర్చలు జరుపుతాడు. అలాంటి వారిలో పాలకుర్తి సోమనాథుడు ముఖ్యుడు. తీవ్ర శైవుడే అయినా.. ఆయన రచనల్లో సామాజిక అంశాలు జాయపునికి ఇష్టం. విచిత్రం ఏమిటంటే ఆ మహా శివకవులకు ఆరాధ్యుడు వెలనాడు మహాపండితుడు పండితారాధ్యుడు.
కళామందిరంలో జాయచోడునికి ఎక్కువ ఇబ్బంది లలితాంబతో.
ఆస్థాన నర్తకిగా ఆమెకో గౌరవహోదా, తగిన రాచరిక మర్యాదలు ఉన్నాయి. రాజుగారు ముత్యాలపల్లకి పంపాలి. పగటి దివిటీల వారు ముందు నడవాలి. బిరుదుమిత్రులు కూడా స్తోత్రగీతాలు పాడుతూ ముందుండాలి. రాజుగారి పేరుతోపాటు ఆమె పేరునూ కలిపి స్తోత్ర పాఠాలు చదవాలి. ఆమె అవన్నీ వదిలేసి అశ్వంపై వచ్చేస్తున్నది. జాయచోడుణ్ని ఆనుకుని కూర్చుంటుంది. రాసుకుంటూ పూసుకుంటూ తిరుగుతుంది. పిండి బంధాలపై, కరణులపై తనకు సందేహాలున్నట్లు అడుగుతుంది. మరో పండితుడు చెబితే నిరాసక్తంగా చూస్తుంది. జాయచోడుడు చెబుతుంటే కోటివెలుగుల కళ్లతో చూస్తుంది. ఆమె ప్రశ్నలన్నీ శృంగారపరమైనవే! ఎవ్వడూ ఆమె ప్రశ్న.. జాయచోడుని జవాబు.. వినడంలేదు. ఆ ఇద్దరిని చూడటమే వాళ్లకు కవితావస్తువు. ఎన్నెన్నో భావాలు.. వేరువేరు ఛందస్సులలో సంధులు, సమాసాల్లో ఇరికించడమే పని. ఆమె ప్రశ్నలు వింటే వయసుడిగిన కవివరేణ్యులకు గోచి ఊడిపోతున్నది.
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284