కొలంబో: టీ20 మెగాటోర్నీలో జింబాబ్వే తమ ప్రస్థానాన్ని ఘనంగా మొదలుపెట్టింది. సోమవారం జరిగిన గ్రూపు-బీ పోరులో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో(39 బంతులు మిగిలుండగానే) ఒమన్‌పై భారీ విజయాన్నందుకుంది. టాస్ గెలిచిన జింబాబ్వే.. ఒమన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్లెసింగ్ ముజర్బని (3/16), రిచర్డ్ నగ్వార (3/17), బ్రాడ్ ఇవాన్ (3/18) ధాటికి ఒమన్ 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ జింబాబ్వే బౌలర్లు ఆది నుంచే చెలరేగారు. దీంతో ఒమన్ 27 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.
వికెట్‌కీపర్, బ్యాటర్ వినాయక్ శుక్లా (28), సుఫియాన్ మహమ్మద్ (25) అంతోఇంతో జింబాబ్వే దాడిని ప్రతిఘటించారు. ఆ జట్టులో ఎనిమిది మంది బ్యాట ర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆ తర్వాత జింబాబ్వే 13.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదనను పూర్తిచేసింది. ఓపెనర్ బ్రియాన్ బెనెట్ (48*), బ్రెండన్ టేలర్ (31) రాణించారు. జింబాబ్వే విజయంలో కీలకంగా వ్యవహరించిన ముజర్బనికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.