Yuzvendra Chahal | టీమ్ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) దంపతులు విడిపోతున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి విడాకుల అంశానికి సంబంధించి కీలక విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అంశంలో రేపటిలోగా తుది తీర్పు వెలువడనున్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
సదరు కథనాల ప్రకారం.. చాహల్, ధనశ్రీ విడాకుల కోసం బాంబే హై కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు.. రేపటిలోగా తుది తీర్పు వెలువరించాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. అయితే, ఆరు నెలల కూలింగ్ ఆఫ్ వ్యవధిని మినహాయించాలన్న పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించగా.. ఆ నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఈ విడాకుల పిటిషన్‌పై మార్చి 20లోగా నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు ఆదేశించింది.
ఈనెల 22 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో చాహల్ పాల్గొనాల్సి ఉన్నందున రేపటిలోగా తీర్పు వెలువరించాలని ఫ్యామిలీ కోర్టుకు హైకోర్టు సూచించింది. ఇక ధనశ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించినట్లు తెలిసింది. ఆ మొత్తంలో ఇప్పటి వరకూ రూ.2.37కోట్లు చెల్లించినట్లు బార్ అండ్ బెంచ్‌ను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. కూలింగ్ పీరియడ్ పిటిషన్‌ను తోసిపుచ్చినందున భరణం కింద చెల్లించాల్సిన మిగతా మొత్తాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవడం లేదని పేర్కొంది.
దంత వైద్యురాలైన ధనశ్రీ 2020 డిసెంబర్ 22న పెండ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్‌గా, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు. అయితే, ఇటీవలే ధనశ్రీ తన పేరు నుంచి ‘చాహల్’ నేమ్‌ను తీసేయడంతో పాటు ఫొటోలను కూడా సోషల్ మీడియా నుంచి తొలగించింది. దీంతో ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ పుకార్లు వ్యాపించాయి. ఆ తర్వాత చాహల్ సైతం ‘న్యూ లైఫ్ లోడెడ్’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. దీంతో వీరు విడాకులు తీసుకోవడం ఖాయం అని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వీరు తమ సోషల్ మీడియా ఖాతాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యంపోసినట్లైంది.
ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరికీ విడాకులు మంజూరైనట్లు కూడా ఇటీవలే వార్తలు గుప్పుమన్నాయి. ధనశ్రీ-చాహల్ జంట ఇటీవలే కోర్టుకు హాజరైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. తొలుత ఈ ఇద్దరికి 45నిమిషాల పాటు కౌన్సిలింగ్ ఇచ్చిన జడ్జీ విడిపోవడానికి గల కారణాలు తెలుసుకున్నట్లు నివేదించింది. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుపడంతో జడ్జీ విడాకులకు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఇక ఇదే సమయంలో చాహల్, ధనశ్రీ తమ సోషల్‌మీడియా అకౌంట్లలో తమదైన శైలిలో పోస్టులు పెట్టడం కూడా ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లైంది. అయితే, విడాకులు కోరుతూ ఫిబ్రవరి 5న ఫ్యామిలీ కోర్టు ముందు వారు ఉమ్మడి పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది.
Also Read..
“Dhanashree Verma | విడాకుల రూమర్స్.. చాహల్‌తో ఉన్న ఫొటోలను రీస్టోర్ చేసిన ధనశ్రీ”
“Dhanashree Verma | మహిళలను నిందించడం ఫ్యాషనైపోయింది.. ధనశ్రీవర్మ పోస్ట్ వైరల్”