Dhanashree Verma | అంతా ఊహించినట్లే జరిగింది. గత కొన్ని నెలలుగా టీమ్ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) దంపతులు విడిపోతున్నారన్న వార్తలు నిజమయ్యాయి. గురువారం ముంబై బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరైన చాహల్, ధనశ్రీకి జడ్జీ విడాకులు మంజూరు చేశారు. విడాకులపై చాహల్, ధనశ్రీ తమ సోషల్‌మీడియా అకౌంట్లలో తమదైన శైలిలో రాసుకొచ్చారు.
‘మనం పడే బాధలు, ఎదుర్కొనే పరీక్షలను కొంతకాలం తర్వాత ఆ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చగలడని తెలిసింది. మీరు ఈ రోజు ఏదైనా విషయం గురించి ఒత్తిడి, ఆందోళనకు గురైతే మీకు మరో అవకాశం ఉందన్న విషయాన్ని తెలుసుకోండి. బాధలను మర్చిపోయి దేవుడిని ప్రార్థించండి. ఆయనపై మీకున్న విశ్వాసమే అంతా మంచి జరిగేలా చేస్తుంది’ అంటూ ధనశ్రీ ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టింది. ‘ఒత్తిడి నుంచి ఆశీర్వాదం’ వరకూ అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
అంతకుముందు చాహల్ కూడా దేవుడికి కృతజ్ఞతలు అంటూ ఓ పోస్టు పెట్టారు. ఆ దేవుడు తనని లెక్కలేనన్ని సార్లు రక్షించాడని పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నానని గుర్తించేలోపే భగవంతుడు దాన్నుంచి బయటపడేశాడని గుర్తు చేసుకున్నారు. ఎల్లప్పుడూ తనకు రక్షణగా ఉన్న ఆ దేవుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే, ఇద్దరూ తమ పోస్ట్‌లో విడాకుల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.
కాగా, ధనశ్రీ-చాహల్ జంట నిన్న కోర్టుకు హాజరైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. తొలుత ఈ ఇద్దరికి 45నిమిషాల పాటు కౌన్సిలింగ్ ఇచ్చిన జడ్జీ విడిపోవడానికి గల కారణాలు తెలుసుకున్నారు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుపడంతో జడ్జీ విడాకులకు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఇక ధనశ్రీకి భరణంగా రూ.60 కోట్లు చెల్లించేందుకు చాహల్ సిద్దమయ్యాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
చాహల్.. దంత వైద్యురాలైన ధనశ్రీ 2020 డిసెంబర్ 22న పెండ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్‌గా, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు. అయితే, ఇటీవలే ధనశ్రీ తన పేరు నుంచి ‘చాహల్’ నేమ్‌ను తీసేయడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ పుకార్లు వ్యాపించాయి. ఆ తర్వాత చాహల్ సైతం ‘న్యూ లైఫ్ లోడెడ్’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. దీంతో వీరు విడాకులు తీసుకోవడం ఖాయం అని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వీరు తమ సోషల్ మీడియా ఖాతాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యంపోసినట్లైంది. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరికీ విడాకులు మంజూరయ్యాయి.
Also Read..
Salman Khan | హాలీవుడ్ చిత్రం.. ఆటో డ్రైవర్‌గా సల్మాన్ ఖాన్.. వైరలవుతున్న వీడియో
Maha Kumbh | ఐదు రోజుల్లో ముగియనున్న మహాకుంభమేళా.. భక్తుల సంఖ్య 65 కోట్లు దాటే అవకాశం