Yuvraj Sigh : ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. అదీ టీ20 వరల్డ్ కప్‌లో. ఆ ఘనుడు ఎవరో ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది. అవును.. భారత లెజెండరీ ఆల్రౌండర్లలో ఒకడైన యువరాజ్ సింగ్(Yuvraj Sigh). సుదీర్ఘ కెరీర్లో మ్యాచ్ విన్నర్‌గా పేరొందని యూవీ తాజాగా తన క్రికెట్ జర్నీలోని ఓ సంఘటనను అందరితో పంచుకున్నాడు. ఓసారి తాను ప్రేయసి బూట్లు వేసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. ఆస్ట్రేలియా పర్యటన సమయంలో జరిగిన ఈ ఫన్నీ సంఘటన గురించి యూవరాజ్ ఏం అన్నాడంటే..?
‘అప్పుడు నేను ఓ బాలీవుడ్ నటితో డేటింగ్ చేస్తున్నా. ఆమె అప్పుడు టాప్ హీరోయిన్. ఆమెకు అడిలైడ్‌లో షూటింగ్ ఉంది. అందుకని ‘నేను ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నా. ఇక మనం కలువకూడదు’ అని గట్టిగా చెప్పాను. కానీ, తను వినలేదు. నన్ను ఫాలో అవుతూ కానెబెర్రా వరకూ వచ్చేసింది. మరోవైపు నేను తొలి రెండు టెస్టుల్లో పెద్దగా రాణించలేదు. కాబట్టి.. ఆమెను చూడగానే ‘ఇక్కడ నువ్వేం చేస్తున్నావు?’అని కోపంగానే అడిగాను.
అందుకు తను ‘నీతో కొంచెం సమయం గడపాలని ఉంది’ అని చెప్పింది. అలా.. ఆ రోజు రాత్రి ఇద్దరం ఓ హోటల్ రూమ్‌లో ఉన్నాం. మాటల మధ్యలో.. ‘నువ్వు నీ కెరీర్‌పై శ్రద్ధ పెట్టు. నేను నా కెరీర్ మీద దృష్టి పెడుతా’ అని చెప్పాను. ఆ మరునాడు మేము అడిలైడ్‌కు బయల్దేరాలి.
అందుకని ఆమె నా సూట్‌కేస్ సర్దేసింది. అయితే.. ఉదయం లేచి చూసే సరికి నా షూ లేవు. ఇదే విషయం ఆమెకు ఫోన్ చేసి అడిగితే.. ‘వాటిని నేను ప్యాక్ చేశాను’ అని చెప్పింది. ‘మరి నేను ఏం వేసుకొని టీమ్ బస్ దాకా వెళ్లాలి?’ అని అడిగాను. అందుకు.. ‘నా గులాబీ రంగు షూ ఉన్నాయిగా. అవి వేసుకో’ అని నవ్వుతూ అంది. ‘ఓరి దేవుడా’ అని మనసులో అనుకున్నా. వేరే దారిలేక ఆమె షూ వేసుకున్నా. అయితే.. జట్టు సభ్యులు ఎవరూ చూడకుండా బ్యాగు కాళ్లకు అడ్డంగా పెట్టుకుని బస్ వరకూ వెళ్లాను. కానీ.. వాళ్లు పసిగట్టారు. చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. ఇక విమానాశ్రయం వరకూ నేను ఆ గులాబీ రంగు షూతోనే వెళ్లాను. అక్కడికి వెళ్లాక సిబ్బంది నాకు కొత్త షూ ఇచ్చారు అని యువరాజ్ ఆ రోజు జరిగిన పెద్ద హంగామాను వివరించాడు.
టీ20 వరల్డ్ కప్(2007)లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో హీరో అయిన యువరాజ్ ఆ తర్వాత కూడా టీమిండియాకు కీలకం అయ్యాడు. స్టార్ ఆటగాడిగా వెలుగొందిన యూవీ ఒకానొక సమయంలో దీపికా పదుకొనె(Deepika Padukone), కిమ్ శర్మ(Kim Sharma), నేహా దూపియా, రియా సేన్, ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టు సహ యజమాని ప్రీతీ జింతా.. ఇలా పలువురితో గుట్టుగా ప్రేమ వ్యవహారం నడిపాడు. అయితే.. 2007 ఆస్ట్రేలియా పర్యటనలో అతడితో గడిపిన ఆ హీరోయిన్ ఎవనేది మాత్రం అతడు చెప్పలేదు.
చివరకు యూవీ బ్రిటన్ మోడల్ అయిన హేజల్ కీచ్(Hazel Keech)ను 2015 నవంబర్ 12వ తేదీన పెండ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఓ ఓరియన్ అనే బాబు, ఆరా అనే పాప ఉన్నారు. మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) సారథ్యంలోని భారత జట్టు 2007-08లో ఆస్ట్రేలియా పర్యటకు వెళ్లింది. అయితే.. వరల్డ్ కప్ హీరో అయిన యువరాజ్ ఆ సిరీస్ తొలి రెండు టెస్టుల్లో 17 పరుగులతో నిరాశపరిచాడు. దాంతో, అతడిని పెట్టేశారు. చివరకు ఆ సిరీస్‌లో టీమిండియా 1-2తో ఓడిపోయింది.
కుటుంబంతో..
స్వదేశంలో జరిగిన 2011 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యూవీ.. అదే ఏడాది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడ్డాడు. లండన్‌లో కీమో థెరపీతో కోలుకున్న అతడు.. మళ్లీ మైదానంలో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. యూవీ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.