గువాహటి: ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే రెసిడెన్షియల్ స్కూల్లో 21 మంది విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన హాస్టల్ వార్డెన్‌కు ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించింది. (death penalty) మాజీ ప్రధానోపాధ్యాయుడు, ఒక టీచర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో ఇద్దరిని నిర్దోషులుగా పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని పోక్సో ప్రత్యేక కోర్టు ఈ మేరకు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో తన 12 ఏళ్ల కవల కుమార్తెలను వార్డెన్ యుమ్కెన్ బాగ్రా లైంగికంగా వేధించడంతోపాటు అత్యాచారానికి యత్నించినట్లు 2022లో ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు.
కాగా, 2014 నుంచి 2022 వరకు ఆ స్కూల్లో హాస్టల్ వార్డెన్‌గా పనిచేసిన సమయంలో బాగ్రా 6 నుంచి 14 ఏళ్ల వయస్సున్న ఆరుగురు అబ్బాయిలతో సహా కనీసం 21 మంది విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సిట్ విచారణలో తేలింది. విద్యార్థులకు డ్రగ్స్ ఇచ్చి లైంగిక దాడులకు పాల్పడ్డాడని, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని వారిని బెదిరించాడని గత ఏడాది దాఖలు చేసిన చార్జిషీట్లో సిట్ ఆరోపించింది. బాగ్రా బాధితుల్లో ఆరుగురు ఆత్మహత్యకు ప్రయత్నించారని అందులో పేర్కొంది.
మరోవైపు పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జవేప్లు చై ముగ్గురిని దోషులుగా నిర్ధారించారు. గురువారం వారికి శిక్షలు ఖరారు చేశారు. విద్యార్థులపై లైంగిక దాడులకు పాల్పడిన వార్డెన్ యుమ్కెన్ బాగ్రాకు మరణశిక్ష విధించారు. నేరాన్ని ప్రోత్సహించినందుకు, రిపోర్ట్ చేయడంలో విఫలమైనందుకు మాజీ ప్రధానోపాధ్యాయుడు సింగ్తుంగ్ యోర్పెన్, హిందీ ఉపాధ్యాయురాలు మార్బోమ్ న్గోమ్దిర్కు 20 ఏళ్లు జైలు శిక్ష విధించారు. మరో ఇద్దరు నిందితులైన మరో టీచర్ తాజుంగ్ యోర్పెన్, హాస్టల్ వార్డెన్‌కు పరిచయం ఉన్న డేనియల్ పెర్టిన్లను నిర్దోషులుగా విడుదల చేశారు.