Harry Brook | లండన్: ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సారథిగా నియమితుడయ్యాడు. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది. కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో దారుణ వైఫల్యంతో పాటు గత కొంతకాలంగా వరుస ఓటములెదుర్కుని సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న జోస్ బట్లర్ స్థానాన్ని బ్రూక్ భర్తీ చేయనున్నాడు.
ఇంగ్లండ్ కెప్టెన్సీ కోసమే బ్రూక్.. ఈ ఏడాది ఐపీఎల్ కాంట్రాక్టునూ వదులుకున్నాడు. 2022లో జట్టుతో చేరిన బ్రూక్.. ఇప్పటిదాకా 26 వన్డేలు ఆడి 34 సగటుతో 816 పరుగులు చేశాడు. గతంలో అండర్-19 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్‌ను నడిపించిన అనుభవమున్న బ్రూక్.. నిరుడు సెప్టెంబర్‌లో బట్లర్ గైర్హాజరీలో ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఏడాది మే నుంచి ఇంగ్లండ్ క్రికెట్లో బ్రూక్ శకం మొదలు కానున్నది. మేలో ఇంగ్లండ్.. వెస్టిండీస్‌తో స్వదేశంలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.