Bhukya Yashwanth | మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యా తండా అతని స్వగ్రామం. పేద గిరిజన కుటుంబంలో జన్మించిన ఆ యువకుడు తన కలల సాకారానికై అడుగులు వేస్తున్నాడు. ఆకాశమే హద్దుగా అచంచలమైన ఆత్మవిశ్వాసంతో పర్వతాలను అవలీలగా అధిరోహిస్తున్నాడు. సాధించాలన్న కసికి పట్టుదల తోడైతే కొండలైనా పిండిచేయగలనన్న ధీమాతో ముందుకెళుతున్న ఆ గిరి పుత్రుడే భూక్యా యశ్వంత్. అడ్డంకులు ఎదురైనా అధిగమిస్తూ ఇప్పటికే ఐదు పర్వతాలు ఎక్కిన యశ్వంత్..మౌంట్ ఎవరెస్ట్‌ను ముద్దాడాలని చూస్తున్నాడు. ఆశయం పెద్దదైనా..ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నా అండగా నిలిస్తే అద్భుతాలు సృష్టిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో యశ్వంత్‌తో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
పర్వతారోహణపై ఆసక్తి ఎలా?
ఊహా తెలిసిన వయసు నుంచే పర్వతారోహణపై ఆసక్తి ఏర్పడింది. బాల్యం అంతా భూక్యా తండాలో గడిచిపోయింది. భార త సైనిక దళంలో ఎలాగైనా పనిచేయాలన్న ఆకాంక్ష చిన్నప్పటి నుంచే ఉండేది. నా ఆసక్తిని గమనించిన టీచర్లు..మౌంటేనీరింగ్ బాగుంటుందని సలహా ఇచ్చారు. అప్పటి నుంచి అటువైపు అడుగులు వేశాను. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో పర్వతారోహణలో అడుగుపెట్టాను. ఇక మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. 15 ఏండ్ల వయసులో భువనగిరిలోని రాక్ ైక్లెంబింగ్ స్కూల్లో చేరాను. ఆ తర్వాత ఇండియన్ హిమాలయన్ సెంటర్ ఫర్ అడ్వెంచర్ అండ్ ఎకోటూరిజంలో సుక్షితులైన నిపుణుల దగ్గర శిక్షణ తీసుకున్నాను. ఇది బాగా కలిసి వచ్చింది.
తొలి అడుగు ఎక్కడా?
నా పర్వతారోహణ ప్రయణంలో తొలి అడుగు దక్షిణాఫ్రికాలో అతిపెద్ద పర్వతంగా పేరొందిన మౌంట్ కిలిమంజారోపై వేశాను. 5895మీటర్ల ఎత్తైన కిలిమంజారోపై ప్రతికూల పరిస్థితుల మధ్య విజయవంతంగా అధిరోహించాను. ఆ తర్వాత రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ (5642మీటర్లు) ఎక్కాను. గడ్డ కట్టే చలిలో సాగిన ఈ ప్రయాణం తలుచుకుంటేనే ఒళ్లు జల్దరిస్తుంది. భాష పరంగా సమస్యలు ఎదుర్కొన్నా.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాను. ఈ రెండింటి తర్వాత మౌంట్ కొసిజ్స్కో(2228మీ, ఆస్ట్రేలియా), మౌంట్ యునమ్ (6100మీ, హిమాచల్ ప్రదేశ్), మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (5364మీ) అధిరోహించాను. లేహ్‌లోని 6వేల మీటర్ల పర్వతాన్ని ఎక్కాను.
భవిష్యత్ లక్ష్యాలేంటీ?
ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఏడు అతిపెద్ద పర్వతాలను అధిరోహించాలని భవిష్యత్ లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇప్పటికి మూడు పూర్తిచేశాను, ఇంకా నాలుగు పర్వతాలు ఎక్కేందుకు సన్నాహలు చేస్తున్నాను. మౌంటేనీరింగ్ అనేది ఖర్చుతో కూడుకున్న అంశం. దీనికి తోడు ఒక్కో దేశంలో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా పర్వతారోహణకు అవకాశం కల్పిస్తారు. అందుకు తగ్గట్లు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. తదుపరి మౌంట్ ఎవరెస్ట్‌పై దృష్టి పెట్టాను. మార్చి ఆఖరి వారం గానీ.. ఏప్రిల్ తొలి వారంలో గానీ ఎవరెస్ట్‌పైకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను.
ఎవరెస్ట్ పర్వతారోహణ ఎలా?
ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతంగా పేరొందిన ఎవరెస్ట్‌పైకి వెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాను. ఇది ఖర్చుతో కూడుకున్న అంశం. మొత్తం 40 లక్షలు అవసరమవుతాయి. ఇందుకోసం రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు, స్వచ్చంద సంస్థలు, కొంత మంది వ్యక్తుల నుంచి ఆర్థిక సాయం అడుగుతున్నాను. ఎవరెస్ట్ పైకి వెళ్లేందుకు కావాల్సిన సామగ్రి, దుస్తులు, ప్రత్యేకమైన బూట్లు, అనుమతి కోసం దరఖాస్తు, షెర్పాకు చెల్లించే మొత్తం. ఇలా ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం లభిస్తే.. రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తానన్న నమ్మకం నాకుంది.
కుటుంబ నేపథ్యం ఏంటీ?
మాది సామాన్య కుటుంబం. నాన్న రామ్మూర్తి విద్యుత్‌శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగి. అమ్మ గృహిణి, సోదరుడు ఉన్నత చదువులు చదువుతున్నాడు. భవిష్యత్‌లో ప్రపంచంలోని అన్ని పర్వతాలు అధిరోహించిన అతిపిన్న వయస్కుడిగా నిలువాలన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతున్నాను. ఎలాగైనా భారత ఆర్మీలో పనిచేసేందుకు అడుగులు వేస్తున్నాను.