గ్లాస్గో : భారత్ మరో మెగా క్రీడాటోర్నీకి వేదిక కాబోతున్నది. సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ ఆతిథ్య హక్కులను భారత్ సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా 2030 ఈ పోటీలు జరగనున్నాయి. గత నెలలోనే అహ్మదాబాద్ నగరం ప్రాథమికంగా ఎంపిక కాగా బుధవారం ఇక్కడ జరిగిన కామన్వెల్త్ స్పోర్ట్స్ జనరల్ అసెంబ్లీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అహ్మదాబాద్‌ను శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య వేదికగా ప్రకటిస్తూ అధికారికంగా ప్రకటించారు. జనరల్ అసెంబ్లీలో 74 మంది సభ్యులు భారత బిడ్డింగ్‌కు ఆమోదముద్ర వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2010(ఢిల్లీ) తర్వాత భారత్ మరోమారు ఈ టోర్నీకి వేదిక కాబోతున్నది. కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎవల్యూషన్ కమిటీ పరిశీలన అనంతరం ఎగ్జిక్యూటివ్ బోర్డు ఈ మేరకు ఆతిథ్య హక్కులు అహ్మదాబాద్‌కు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.
దీనిపై కామన్వెల్త్ స్పోర్ట్ అధ్యక్షుడు డాక్టర్ డొనాల్డ్ రూక్రె స్పందిస్తూ ‘భారత్‌లో భారీ సంఖ్యలో ఉన్న యువతకు, ఘనమైన చరిత్రకు, క్రీడల పట్ల వారికున్న అంకితభావానికి గుర్తుగా తదుపరి వందేండ్ల కామన్వెల్త్ గేమ్స్‌ను అహ్మదాబాద్‌లో జరిపేందుకు నిర్ణయం తీసుకున్నాం’ అని పేర్కొన్నారు. 2030లో కామన్వెల్త్గేమ్స్ ఆతిథ్య హక్కులు దక్కించుకోవడం ద్వారా 2036 ఒలింపిక్స్ క్రీడల రేసులో నిలిచేందుకు భారత్‌కు మంచి అవకాశం లభించిందని పలువురు క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. కామన్వెల్త్‌తో పాటు 2036లో ఒలింపిక్స్ నిర్వహణకు అహ్మదాబాద్ ముందు వరుసలో ఉండటం ఖాయంగా కనిపిస్తుందని అన్నారు. ఇదిలా ఉంటే వాస్తవానికి అహ్మదాబాద్‌తో పాటు నైజీరియాకు చెందిన అబుజా నగరం కూడా 2030 కామెన్వెల్త్ గేమ్స్ కోసం పోటీపడింది. అయితే కామన్వెల్త్ గేమ్స్ కమిటీ భారత్ వైపు మొగ్గుచూపుతూ అబుజాకు 2034 హక్కులు కేటాయించింది.
‘కామన్వెల్త్ స్పోర్ట్ భారత్‌పై చూపించిన నమ్మకానికి చాలా గర్వంగా ఉంది. 2030లో జరిగేవి వందేండ్ల కామన్వెల్త్ మూమెంట్ మాత్రమే కాదు దేశంలో మరో శతాబ్దానికి సరిపడ క్రీడా పునాది పడనుంది. కామన్వెల్త్ గేమ్స్ ద్వారా వివిధ దేశాల అథ్లెట్లు, వారి సంస్కృతి అంతా స్నేహపూర్వక వాతావరణంలో ఒక చోటుకు చేరనుంది.

అహ్మదాబాద్ వేదికగా 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో 15 నుంచి 17 క్రీడాంశాలకు చోటు దక్కే అవకాశముంది. దీనికి సంబంధించి వచ్చే నెల నుంచే మెగాటోర్నీలో ఏ క్రీడలను చేర్చాలన్న దానిపై ప్రక్రియ మొదలుకానున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్లో కేవలం 10 క్రీడలకు పరిమితం కాగా, ఇందులో షూటింగ్, ఆర్చరీ, హాకీ, బ్యాడ్మింటన్ లాంటి వాటిని కూడా పక్కకు తప్పించారు. అయితే ఆతిథ్య హోదాలో భారత్‌కు రెండు కొత్త క్రీడాంశాలను చేర్చే అవకాశం లభిస్తుంది. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్న గ్రామీణ క్రీడలైన కబడ్డీ, ఖోఖోకు కామన్వెల్త్లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు భారత్‌కు మెరుగైన పతక అవకాశాలు ఉన్న ఆర్చరీ, బ్యాడ్మింటన్, షూటింగ్, రెజ్లింగ్ జాబితాలో చేర్చనున్నారు. ఇవే కాకుండా 3X 3 బాస్కెట్‌బాల్, 3X3 వీల్‌చైర్ బాస్కెట్‌బాల్, బీచ్ వాలీబాల్, టీ20 క్రికెట్, సైక్లింగ్, డైవింగ్, హాకీ, జూడో, రిథమిక్ జిమ్నాస్టిక్స్, రగ్బీ సెవన్స్, స్కాష్, ట్రయథ్లాన్ ఉండునున్నాయి.
మెగాటోర్నీలకు వేదికగా : ఇటీవల కాలంలో అహ్మదాబాద్ ప్రతిష్టాత్మక క్రీడాటోర్నీలకు వేదికగా మారుతున్నది. ఈ మధ్య కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌తోపాటు ఏషియన్ అక్వాటిక్ చాంపియన్‌షిప్, ఏఎఫ్సీ అండర్-17 ఏషియన్ కప్ 2026 క్వాలిఫయర్స్ జరిగాయి. వీటికి కొనసాగింపుగా వచ్చే ఏడాది ఏషియన్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్, ఆసియా పారా ఆర్చరీ కప్, 2029లో వరల్డ్ పోలీస్, ఫైర్ గేమ్స్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది. ఇదిలా ఉంటే నగరంలోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌ను ప్రధాన క్రీడా కేంద్రంగా మలిచేందుకు నిర్వాహకులు ప్రణాళికలు చేస్తున్నారు. ప్రస్తుతం లక్ష్య సీటింగ్ సామర్థ్యంతో క్రికెట్ స్టేడియం ఉండగా, అక్వాటిక్ సెంటర్, ఫుట్‌బాల్ స్టేడియం నిర్మించారు. కామన్వెల్త్ గేమ్స్ కోసం మూడు వేల మంది అథ్లెట్లకు సరిపోయే విధంగా గేమ్స్ విలేజ్‌ను రూపొందించనున్నారు.