Yashasvi Jaiswal : ఐపీఎల్ పదహారో సీజన్(IPL 2023,)లో దంచి కొట్టిన యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) ఇప్పుడు పట్టలేనంత సంతోషంతో ఉన్నాడు. వెస్టిండీస్ పర్యటనకు సెలెక్ట్ అవ్వడమే అందుకు కారణం. యశస్వీ టెస్టులకు ఎంపికయ్యాడని తెలియగానే అతడి తండ్రి భూపేంద్ర జైస్వాల్(Bhupendra Jaiswal) ఏడ్చేశాడట. ఈ విషయాన్ని యశస్వీ ఈరోజు చెప్పాడు. ‘నాకు టెస్టు జట్టులో చోటు దక్కిందని తెలిసిన వెంటనే నాన్న ఏడ్చేశాడు. ఆనందతో ఆయనకు కన్నీళ్లు ఆగలేదు. నేను మా అమ్మను ఇంకా కలవలేదు. త్వరలోనే వాళ్లిద్దరినీ కలుస్తా.
టెస్టు జట్టుకు సెలెక్ట్ కావడంతో చాలా సంతోషంగా ఉంది. విండీస్ టూర్లో నా సత్తా మేరకు ఆడడానికి ప్రయత్నిస్తా. అయితే.. ఒకింత కంగారుగా ఉంది. కానీ, క్రీజులోకి వెళ్లాక నా తరహా గేమ్ ఆడతా’ అని యశస్వీ చెప్పుకొచ్చాడు. పదహారో సీజన్లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు ఆడిన యశస్వీ 14 మ్యాచుల్లో 625 పరుగులు బాదాడు. అందులో 5 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.
టీ20ల్లో దుమ్మురేపుతున్న యశస్వీ పేదరికం కష్టాలు అనుభవించాడు. కుటుంబంతో కలిసి పానీ పూరీలు కూడా అమ్మాడు. ఎన్ని కష్టాలు వచ్చినా.. క్రికెటర్ అవ్వాలన్న తన కలను మాత్రం మరిచిపోలేదు. అండర్ -19 వరల్డ్ కప్(Under -19 World Cup)లో సంచలన ఆటతో వార్తల్లో నిలిచాడు. ఆపై దేశవాళీ టోర్నీలో పరుగుల వరద పారించాడు. ఈ ఏడాది ఇరానీ కప్(Irani Cup)లో తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టాడు. దాంతో, ఒకే మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించిన సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.
ఇరానీ కప్‌లో యశస్వీ సెంచరీ అభివాదం
ఐపీఎల్ 16 వసీజన్‌లో వేగవంతమైన ఫిఫ్టీ బాది యశస్వీ మరోసారి తన సత్తా చాటాడు. అంతేకాదు ముంబై ఇండియన్స్‌పై శతకంతో చెలరేగిన యశస్వీ సింహ గర్జన చేశాడు. దాంతో, అతడిని ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు. అయితే.. ఫైనల్లో ఆడే అవకాశం రాలేదు. విండీస్ పర్యటన రూపంలో యశస్వీకి మరో చాన్స్ వచ్చింది. టెస్టు సిరీస్‌లో తన మార్క్ ఆటతో ఆకట్టుకోవాలని ఈ యంగ్‌స్టర్ తహతహలాడుతున్నాడు. విండీస్ టూర్లో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, 5 టీ20లు ఆడుతుంది. మొదటి టెస్టు జూలై 12న మొదలవ్వనుంది.