WTC Points Table | బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత జట్టు మూడవ స్థానంలోనే కొనసాగుతున్నది. అయితే, WTC ఫైనల్‌కు చేరుకోవాలన్న భారత్ ఆశలు సజీవంగా నిలిచాయి. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. గబ్బా టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారత్‌కు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా ఎనిమిది పరుగులు చేసింది. ఈ సమయంలో వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగించగా.. ఇద్దరు కెప్టెన్లు మ్యాచ్‌ను డ్రాగా ముగించాలని నిర్ణయించారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 260 పరుగుల వద్ద ముగిసింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 185 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆసిస్ డిక్లేర్ చేశారు. దాంతో 274 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతున్నది. డ్రా నేపథ్యంలో ఇరుజట్లు పాయింట్లు పంచుకోవడంతో.. టీమిండియా పాయింట్లు 57.29 నుంచి 55.88కి పడిపోయాయి. పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉన్నది. WTC 2023-25 సైకిల్లో ఫైనల్‌కు చేరుకోవాలంటే.. భారత్ తప్పనిసరిగా రాబోయే రెండు మ్యాచ్‌లలో తప్పనిసరిగా ఓటమి నుంచి గట్టెక్కాల్సిందే.
రెండు మ్యాచుల్లో ఒకటి డ్రా, ఒక విజయం నమోదు చేసినా భారత్‌కు ప్రపంచటెస్ట్ చాంపియన్‌షిప్‌పై ఆశలు సజీవంగానే ఉంటాయి. గబ్బా టెస్ట్ డ్రా అయిన తర్వాత, భారత్ గరిష్ఠంగా 138 పాయింట్లను పొందే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్, సిడ్నీ టెస్టులను గెలిస్తే పాయింట్లు 60.52కి చేరుతాయి. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా రెండు టెస్టుల్లో విజయం సాధిస్తే 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. దాంతో పాయింట్లు 60.52కి చేరుతాయి. ఆస్ట్రేలియా తర్వాత శ్రీలంకతో తలపడనున్నది. శ్రీలంకపై తన రెండు టెస్టులను గెలిచినా.. పాయింట్లు 57కి చేరుతాయి. దాంతో డిపెండింగ్ చాంపియన్ అయిన ఆసిస్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసును నుంచి నిష్క్రమిస్తుంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య సిరీస్ 2-2తో డ్రా అయితే.. భారత్ పీసీటీ 57.01 పాయింట్లు ఉంటాయి. దాంతో ఫైనల్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.