ICC WTC Points Table | లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఓటమిపాలైంది. ఈ విజయంతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు. ఆతిథ్య జట్టు భారత్ ముందు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్పందనగా టీంమిండియా 170 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దాంతో బెన్ స్టోక్స్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-2 ఆధిక్యంలో దూసుకెళ్లింది.
మూడో టెస్ట్‌లో భారత్‌పై విజయంతో ఇంగ్లండ్ మూడవ స్థానాన్ని చేరుకుంది. భారత్ నాల్గవ స్థానానికి పడిపోయింది. మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఇంగ్లండ్ జట్టు ఖాతాలో 24 పాయింట్లు.. 66.67 పాయింట్ల శాతం ఉన్నది. భారత్ మూడు మ్యాచుల్లో ఒక విజయం మాత్రమే సాధించింది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 12 పాయింట్లు ఉండగా.. 33.33శాతం ఉన్నది. ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (2025-27) పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌లు ఆడిన రెండు మ్యాచ్‌లను గెలిచింది. 24 పాయింట్లు, 100 పాయింట్ల శాతం ఉంది. శ్రీలంక 16 పాయింట్లు.. 66.67 పాయింట్ల శాతంతో రెండోస్థానంలో ఉన్నది.
భారత్ రెండో ఇన్నింగ్స్ చెత్తగా మొదలైంది. టీమిండియా స్కోర్ 5 వద్ద ఉన్న సమయంలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జైస్వాల్ ఖాతా తెరువకుండానే అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు మంచి షాట్స్ ఆడారు. రెండోవికెట్కు 66 బంతుల్లో 36 పరుగులు జోడించారు. బ్రైడాన్ కార్స్ ఈ భాగస్వామ్యానికి తెరదించాడు. నాయర్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 33 బంతుల్లో ఒక ఫోర్ సహాయంతో 14 పరుగులు చేసిన నాయర్ పెవిలియన్‌కు చేరాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నైట్ వాచ్మెన్ ఆకాశ్ దీప్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
రెండవ రోజు ఆట 58/4 స్కోరుతో టీమిండియా ఆట మొదలైంది. తొలి సెషన్లో జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. లంచ్‌కు ముందు రిషబ్ పంత్ (9), కేఎల్ రాహుల్ (39) వికెట్లను కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ ఖాతా తెరువకుండానే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నితీష్ (13) కూడా పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. మూడవ టెస్ట్ ఫలితం మూడవ సెషన్లో వచ్చింది. వాస్తవానికి మ్యాచ్ ఫలితం రెండో సెషన్లోనే తేలుతుందని భావించినా అలా జరుగలేదు. రెండో సెషన్లో రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా భాగస్వామ్యంతో ఫలితం ఆలస్యమైంది. జడేజా 17 పరుగుల వద్ద క్రీజులో ఉన్న సమయంలో భారత్ గెలిచేందుకు 81 పరుగులు అవసరం.
బుమ్రా దాదాపు 1.30 గంటలు క్రీజులో ఉండి ఔటయ్యాడు. స్టోక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తొమ్మిదో వికెట్‌కు బుమ్రా జడేజాతో కలిసి 132 బంతులు ఎదుర్కొని 35 పరుగులు జోడించారు. ఆ తర్వాత సిరాజ్‌తో కలిసి జడేజా 80 బంతుల్లో 23 పరుగులు జోడించారు. సిరాజ్ వికెట్ పడగానే భారత ఆశలు ఆవిరయ్యాయి. ఇంగ్లండ్ స్పిన్నర్ సోషబ్ బషీర్ 5వ బంతిని ఆఫ్ బ్రేక్ వేయగా.. సిరాజ్ డిఫెండ్ చేశాడు. కానీ, పిచ్‌పై పడ్డ బంతి తిరిగి స్పిన్ అవడంతో స్టంప్స్‌ని తాకింది. అనుకోనివిధంగా అవుట్ అవ్వడంతో సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. జడేజా 181 బంతుల్లో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 150 బంతుల్లో తన టెస్ట్ కెరీర్లో 25వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ తరఫున రెండో ఇన్నింగ్స్ లో జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా, బ్రైడాన్ కార్సేకు రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్‌కు తలా ఒక వికెట్ దక్కింది.