WTC Final | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025-2027 సైకిల్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్‌ను భారత్‌లోనే పరిశీలిస్తున్నది. డబ్ల్యూటీసీ తొలి ఎడిషన్ ఫైనల్ 2021లో సౌతాంప్టన్‌లో, రెండో ఎడిషన్ ఫైనల్ 2023లో ఓవల్‌లో జరిగింది. 2025 ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ ఈ ఏడాది వచ్చే నెల లార్డ్స్‌లో జరుగనున్నది. గత నెలలో జింబాబ్వేలో జరిగిన ఐసీసీ చీఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ దుమాల్ బీసీసీఐ తరఫున పాల్గొన్నారు. భారతదేశం రాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటే.. అభిమానులకు గొప్ప అవకాశం అవుతుందని, కానీ భారత్ ఫైనల్ ఆడకపోయినా చాలా మంది ఇతర రెండు అగ్ర జట్ల మధ్య జరిగే మ్యాచ్‌పై ఆసక్తి చూపుతారని భావిస్తున్నారు. భారత్ ఇప్పటి వరకు రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది.
2021లో న్యూజిలాండ్ చేతిలో, 2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. భారత జట్టు ఈ ఎడిషన్‌లో 2025 సైకిల్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇదిలా ఉండగా.. స్వదేశంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఓటమి తర్వాత ప్రపంచ చాంపియన్ షిప్ ఫైనల్ రేసు నుంచి టీమిండియా నిష్క్రమించింది. ఇదిలా ఉండగా.. ఇటీవల భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్‌ల నుంచి రిటైర్ అయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా కొత్త కెప్టెన్.. టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సీజన్లోకి ప్రవేశించనుంది. యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ ప్రస్తుతం కెప్టెన్సీ రేసులో ముందున్నాడు. భారత జట్టు ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్‌ను మొదలుపెడుతుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ జూన్ 20 నుంచి లీడ్స్‌లో జరుగుతుంది. భారత్ చివరిసారిగా 2021-22లో ఇంగ్లాండ్‌లో పర్యటించింది. ఆ సమయంలో జట్టు విరాట్ కోహ్లీ నాయకత్వంలో టెస్టులు ఆడింది. ఈ సిరీస్‌లో ఐదో టెస్టుకు బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక ఈ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.