బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. గత సీజన్లో రన్నరప్‌తో నిరాశచెందిన ఢిల్లీ ఈసారి దుమ్మురేపుతున్నది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో వారి సొంతగడ్డపై శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తద్వారా వరుసగా మూడోసీజన్లో ఢిల్లీ..ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.
మరోవైపు వరుసగా నాలుగో ఓటమి ఖాతాలో వేసుకున్న ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 15.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి 151 పరుగులు చేసింది. షెఫాలీవర్మ(43 బంతుల్లో 80 నాటౌట్, 8ఫోర్లు, 4 సిక్స్‌లు), జెస్ జొనాసెన్(38 బంతుల్లో 61 నాటౌట్, 9ఫోర్లు, సిక్స్) అజేయ అర్ధసెంచరీలతో విజృంభించారు.
బెంగళూరు బౌలర్లను చితకబాదుతూ లక్ష్యాన్ని అలవోకగా కరిగించారు. రేఖాసింగ్కు ఒక వికెట్ దక్కింది. తొలుత ఎలీస్ పెర్రీ(60 నాటౌట్) అర్ధసెంచరీతో ఆర్సీబీ 20 ఓవర్లలో 147/5 స్కోరు చేసింది. కెప్టెన్ మంధాన(8) మళ్లీ నిరాశపరిచింది. శిఖాపాండే, చరణి రెండేసి వికెట్లు తీశారు. షెఫాలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.