WPL 2026 | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ షెడ్యూల్ విడుదలైంది. టోర్నీ జనవరి 9న మొదలుకానున్నది. తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నవీ ముంబయిలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) నవంబర్ 29న శనివారం ఈ విషయాన్ని ప్రకటించింది. గతంలో నవంబర్ 27న ఢిల్లీలో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం సందర్భంగా లీగ్ చైర్మన్ జయేష్ జార్జ్ టోర్నమెంట్ తేదీలు, వేదికలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి దశ జనవరి 9 నుంచి జనవరి 17 వరకు నవీ ముంబయిలో జరుగుతుంది. రెండో దశ జనవరి 19 నుంచి ఫిబ్రవరి 5 వరకు వడోదర (బరోడా)లో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ వడోదరలోనే జరుగుతుంది.

Wpl 2026
లీగ్ దశలో మొత్తం 20 మ్యాచులు జరుగుతాయి. ఎలిమినేటర్ ఫిబ్రవరి 3న జరుగుతుంది. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత ఫిబ్రవరి 5న ఫైనల్ జరుగుతుంది. షెడ్యూల్లో కేవలం రెండు మాత్రమే డబుల్ హెడర్స్ మ్యాచులు ఉన్నాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 కోసం మొత్తం 277 మంది ఆటగాళ్లు వేలానికి అందుబాటులో రాగా.. ఇందులో 67 మంది ఆటగాళ్లను మాత్రమే ఆయా జట్లు కొనుగోలు చేశాయి. ఇందులో 23 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఫ్రాంచైజీలు ప్లేయర్ల కోసం రూ.40.8 కోట్లు ఖర్చు చేశాయి. 2023 సీజన్లో ముంబయి ఇండియన్స్ టైటిల్ నెగగ్గా.. 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ను ఎగరేసుకొని పోయింది. ఈ సీజన్లో ఏ జట్టు ట్రోఫీని నెగ్గుతుందో చూడాల్సిందే. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. రెండు, మూడో స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ ఆడాల్సి ఉంటుంది.