ముంబై : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుసగా రెండు పరాభవాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. బుధవారం ఇక్కడ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ.. యూపీ వారియర్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. గత మ్యాచ్‌ల మాదిరిగానే అన్ని విభాగాల్లో సమిష్టిగా విఫలమైన వారియర్స్ వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ.. సారథి మెగ్ లానింగ్ (38 బంతుల్లో 54, 9 ఫోర్లు, 1 సిక్స్), హర్లీన్ డియోల్ (36 బంతుల్లో 47, 7 ఫోర్లు) ఆదుకోవడంతో 20 ఓవర్లకు 154/8 రన్స్‌కు పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో షెఫాలీ వర్మ, మరిజన్నె కాప్ తలా రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఇక ఛేదనలో విధ్వంసకర ఓపెనర్లు లిజెల్లె లీ (44 బంతుల్లో 67, 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఎప్పట్లాగే దూకుడుగా ఆడగా బంతితో రాణించిన షెఫాలీ బ్యాట్ (32 బంతుల్లో 36, 6 ఫోర్లు) రాణించారు.
ఛేదనలో ఓపెనర్లు షెఫాలీ వర్మ, లిజెల్లె లీ (షెఫా-లీ) ధనాధన్ ఆటతో ఢిల్లీ విజయం నల్లేరుపై నడకలాగే సాగింది. ముఖ్యంగా లీ.. ఎప్పట్లాగే దొరికిన బంతిని దొరికినట్టుగా బౌండరీ లైన్ దాటించడంతో లక్ష్యం చిన్నదైపోయింది. ట్రియాన్ 6వ ఓవర్లో 4,4,6తో ఆమె రెచ్చిపోగా సోఫీ 8వ ఓవర్లో షెఫాలీ రెండు ఫోర్లు కొట్టింది. ట్రియాన్ 10వ ఓవర్లో 6తో 31 బంతుల్లో లీ ఈ టోర్నీలో వరుసగా రెండో అర్ధ శతకాన్ని నమోదుచేసింది. తొలి వికెట్‌కు 94 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని 12వ ఓవర్లో శోభన.. షెఫాలీని ఔట్ చేసి విడదీసింది. దీప్తి 14వ ఓవర్లో లీ ని వెనక్కి పంపగా వోల్వార్ట్, కెప్టెన్ జెమీమా (21) ఆ జట్టును గెలుపుదిశగా నడిపించారు. విజయానికి 6 పరుగుల దూరంలో జెమీమాను దీప్తి ఔట్ చేయడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ మొదలైంది. సోఫీ ఆఖరి ఓవర్లో కాప్, వోల్వార్ట్ తలా ఓ బౌండరీతో ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశారు.

యూపీ: 20 ఓవర్లలో 154/8 (లానింగ్ 54, హర్లీన్ 47, షెఫాలీ 2/16, కాప్ 2/24);
ఢిల్లీ: 20 ఓవర్లలో 158/3 (లీ 67, షెఫాలీ 36, దీప్తి 2/26)