అహ్మదాబాద్: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు పోరు మూడు రోజుల్లోనే ముగిసింది. విండీస్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మొదటి టెస్టులో టీమ్ఇండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. రవీంద్ర జడేజా(4/54), సిరాజ్(3/31) ధాటికి విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 45.1 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది.
ఓవర్‌నైట్ స్కోరు 448/5 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన టీమ్ఇండియా..శనివారం ఉదయం సెషన్లో విండీస్‌ను బ్యాటింగ్‌కు దింపింది. పిచ్‌పై తేమను అనుకూలంగా మలుచుకుంటూ ఓవైపు బుమ్రా, సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో విండీస్ బ్యాటర్లకు ఆదిలోనే చెక్ పెట్టారు. సిరాజ్ బౌలింగ్‌లో ఫుల్‌షాట్ ఆడబోయిన ఓపెనర్ తేజ్‌నారాయణ్ చంద్రపాల్(8) స్కేర్ లెగ్‌లో ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి సూపర్ క్యాచ్‌తో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. బౌలింగ్ మార్పుగా వచ్చిన జడేజా..మరో ఓపెనర్ క్యాంప్‌బెల్(14)ను రెండో వికెట్‌గా సాగనంపాడు.
ఆ తర్వాత బ్రాండన్ కింగ్(5), రోస్టన్ చేస్(1), షాయి హోప్(1) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. దీంతో లంచ్ విరామ సమయానికి విండీస్ 66/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. లోయర్ మిడిలార్డర్లో జస్టిన్ గ్రీవ్స్(25) ఒకింత పోరాడినా సహచరుల నుంచి సరైన సహకారం లేకపోయింది. సిరాజ్ ఒకే ఓవర్లో గ్రీవ్స్‌తో పాటు వారికన్(0)ను ఔట్ చేసి విండీస్ పతనంలో కీలకమయ్యాడు. ఒక ఎండ్‌లో జడేజా, సిరాజ్ తమ జోరు కొనసాగిస్తే మరో ఎండ్‌లో కుల్దీప్ యాదవ్, సుందర్ విండీస్ పని పట్టారు. జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఈనెల 10 నుంచి ఢిల్లీలో రెండో టెస్టు మొదలుకానుంది.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 162 ఆలౌట్, భారత్ తొలి ఇన్నింగ్స్: 448/5 డిక్లేర్డ్, వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 146 ఆలౌట్(అతనాజె 38, గ్రీవ్స్ 25, జడేజా 4/54, సిరాజ్ 3/31)