ఏకపక్ష పోరాటాలకు స్వస్తి పలుకుతూ.. ప్రపంచంలోని 12 మేటి జట్ల మధ్య నేటి నుంచి మహా సంగ్రామం మొదలు కానుంది. ఐదేండ్ల తర్వాత జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో రసవత్తర దశకు నేడు తెరలేవనుంది. ‘యూనివర్సల్ బాస్’ అని తనకు తానే బిరుదు ఇచ్చుకున్న విండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ సార్ధక నామధేయుడు అనిపించుకుంటాడా!! ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా మారిన అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అదే జోరు కనబరుస్తాడా!! పొట్టి ఫార్మాట్లో ఒక్క సారి కూడా కప్పు కొట్టలేకపోయిన కంగారూలు ఈ సారైనా గెంతులేస్తారా!! వన్డే వరల్డ్‌కప్ విజేత ఇంగ్లండ్ రెండోసారి టీ20 విజేతగా నిలుస్తుందా!! న్యూజిలాండ్ కల నెరవేర్చుకుంటుందా!! మహేంద్రుడి కనుసన్నల్లో విరాట్ కోహ్లీ తొలి ఐసీసీ ట్రోఫీని ముద్దాడుతాడా.. తేలే సమయం ఆసన్నమైంది. మరింకెందుకు ఆలస్యం 33 మ్యాచ్‌ల పాటు సాగనున్న ధనాధన్ ధమాకాకు మీరు సిద్ధమైపోండి!
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం:ప్రపంచకప్ సమరంలో బోరింగ్ మ్యాచ్‌లకు తావివ్వకుండా.. ర్యాకింగ్స్లో తొలి ఎనిమిది స్థానాల్లో ఉన్న జట్లను నేరుగా వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేసిన ఐసీసీ.. మరో నాలుగు జట్ల కోసం గ్రూప్ మ్యాచ్‌లను నిర్వహించింది. వాటిలో ప్రతిభ కనబర్చిన జట్లు సూపర్-12కు అర్హత సాధించగా.. శనివారం నుంచి మెగాలీగ్‌లో కీలక ఘట్టానికి తెరలేవనుంది. మొత్తం 45 మ్యాచ్‌ల్లో ఇప్పటికే 12 మ్యాచ్‌లు ముగియగా.. మరో 33 మ్యాచ్‌ల్లో విశ్వ విజేత ఎవరనేది తేలిపోనుంది. సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న ఈ మెగాటోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తున్నా.. కరోనా కారణంగా యూఏఈ వేదికగా మ్యాచ్‌లు నిర్వహిస్తున్నది. మహమ్మారి కారణంగా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. శనివారం రెండు మ్యాచ్‌లు జరుగనుండగా.. గ్రూప్-1 తొలి పోరులో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడుతుంది. వన్డే ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన ఆసీస్.. టీ20ల్లో ఇప్పటి వరకు టైటిల్ పట్టలేకపోగా.. ఐసీసీ టోర్నీల్లో దురదృష్టాన్ని వెంట పెట్టుకొని తిరిగే దక్షిణాఫ్రికా ఈసారైనా ఆ ముద్ర చెరిపేసుకోవాలని చూస్తున్నది. మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ అమీతుమీ తేల్చుకోనుంది. స్పిన్నర్లకు స్వర్గధామంలా కనిపిస్తున్న పిచ్‌పై మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ సత్తాచాటుతారో లేక విండీస్ హిట్టర్లు దంచికొట్టి మెగాటోర్నీలో బోణీ కొడతారో చూడాలి!
దొందు దొందే..
వన్డే ఫార్మాట్లో ఐదుసార్లు ప్రపంచకప్ సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా.. టీ20ల్లో మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విజేతగా నిలువలేకపోయింది. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, భారత్, ఇంగ్లండ్ చేతుల్లో దైపాక్షిక సిరీస్‌లు ఓడిన ఆస్ట్రేలియా.. మెగాటోర్నీలో అండర్‌డాగ్‌గా అడుగు పెడుతున్నది. అయితే అంచనాలు లేకుండా బరిలోకి దిగుతుండటమే ఆసీస్‌కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తున్నది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫామ్ కోల్పోవడం, కెప్టెన్ ఆరోన్ ఫించ్ గాయపడటం కంగారూలకు ఇబ్బందికరంగా మారింది. మిడిలార్డర్లో స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిషెల్ మార్ష్, మార్కస్ స్టొయినిస్ వంటి మ్యాచ్ విన్నర్లు అందుబాటులో ఉండటం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం కాగా.. బౌలింగ్‌లో ప్యాట్ కమిన్స్, స్టార్క్, హజిల్‌వుడ్ కీలకం కానున్నారు. స్పిన్ పిచ్‌లపై ఆడమ్ జంపా, అగర్ ప్రత్యర్థిని తికమక పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు మహామహా స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పుడే సాధ్యం కాని ట్రోఫీని కొత్త కుర్రాళ్లతో కొల్లగొట్టాలని దక్షిణాఫ్రికా భావిస్తున్నది. మెగాటోర్నీకి ముందు వెస్టిండీస్, ఐర్లాండ్, శ్రీలంకపై సిరీస్‌లు నెగ్గిన సఫారీలు.. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ నెగ్గి ఫుల్ జోష్‌లో ఉన్నారు. కెప్టెన్ బవుమా, డికాక్, క్లాసెన్, మార్క్మ్,్ర మిల్లర్‌పై ఆ జట్టు బ్యాటింగ్ ఆధారపడి ఉండగా.. బౌలింగ్‌లో రబడ, నోర్జే, ఎంగ్డీ, షమ్సీ పైనే ఆశలు పెట్టుకుంది.
గ్రూప్ – 1
ఇంగ్లండ్
ఆస్ట్రేలియా
దక్షిణాఫ్రికా
వెస్టిండీస్
శ్రీలంక
బంగ్లాదేశ్
గ్రూప్ – 2
భారత్
పాకిస్థాన్
న్యూజిలాండ్
అఫ్గానిస్థాన్
నమీబియా
స్కాట్లాండ్