దుబాయ్: రెండేండ్ల క్రితం తమ సొంతగడ్డపై జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా.. 2024 ఎడిషన్‌ను విజయంతో ఆరంభించింది. శుక్రవారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా గ్రూప్-బీలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా పది వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన విండీస్.. సఫారీ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్టఫానీ టేలర్ (41 బంతుల్లో 44 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆదుకోవడంతో కరీబియన్ జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లలో నొన్కులులెకొ లబ (4/29) నాలుగు వికెట్లతో విండీస్‌ను కట్టడి చేయగా పేసర్ మరిజన్నె కాప్ (2/14) రాణించింది. ఛేదనను సౌతాఫ్రికా ఓపెనర్లు కెప్టెన్ లారా వోల్వార్డ్ (55 బంతుల్లో 59 నాటౌట్, 7 ఫోర్లు), తజ్మిన్ బ్రిట్స్ (52 బంతుల్లో 57 నాటౌట్, 6 ఫోర్లు) 17.5 ఓవర్లలో పూర్తిచేశారు. విండీస్ బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. లబకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.