Champions Trophy | నమస్తే తెలంగాణ క్రీడా విభాగం: అది 1996 మార్చి 17. లాహోర్‌లో విల్స్ ప్రపంచకప్ (వన్డే) ఫైనల్. ఆస్ట్రేలియాను ఓడించిన అనంతరం శ్రీలంక సారథి అర్జున రణతుంగ వరల్డ్‌కప్ టైటిల్‌ను సగర్వంగా పైకెత్తుకున్నప్పుడు అక్కడున్న ఏ ఒక్క పాకిస్థానీ క్రికెట్ అభిమాని కూడా ఊహించి ఉండడు.. తమ దేశంలో మరో ఐసీసీ టోర్నీని ప్రత్యక్షంగా వీక్షించాలంటే ముప్పై ఏండ్లు ఆగాల్సి వస్తుందని! కానీ 2009లో ఇదే లాహోర్‌లో అదే శ్రీలంక క్రికెట్ జట్టుపై ఉగ్రమూకలు జరిపిన కాల్పుల ఘటనకు ఆ దేశం భారీ మూల్యమే చెల్లించుకుంది. ఒకానొక దశలో పాక్ క్రికెట్ భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. ఐసీసీ టోర్నమెంట్ సంగతి దేవుడెరుగు! కనీసం తమ దేశంలో పర్యటించేందుకు రావడానికే ఇతర జట్లు జంకే దుస్థితి. ఇతర దేశాల బోర్డులను బతిమాలి బామాలినా పాక్‌కు రాకపోయేసరికి చివరికి తటస్థ వేదికలలో తమ మ్యాచ్‌లను నిర్వహించుకోవాల్సిన దయనీయ పరిస్థితి.
ఒకవైపు పక్కనే ఉన్న భారత్‌తో పాటు శ్రీలంకలో ఐసీసీ టోర్నీలు, ఐపీఎల్‌తో క్రికెట్ కళకళలాడుతుంటే పాక్‌లో మాత్రం ఒక తరం అభిమానులకు ద్వైపాక్షిక సిరీస్‌లనూ చూసే అవకాశమే లేకుండా పోయింది. ఫలితంగా ఆదాయం లేక పీసీబీ సంక్షోభ స్థితికి వెళ్లింది. దేశవాళీల్లో మ్యాచ్‌ల నిర్వాహణకూ డబ్బుల్లేని దుస్థితి! కానీ మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత పాక్.. ఒక ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తోంది. ఎనిమిదేండ్ల విరామం అనంతరం చాంపియన్స్ ట్రోఫీ ఈనెల 19 నుంచి పాకిస్థాన్‌లో ప్రారంభం కానుంది. ఇది ఆ దేశ క్రికెట్ పునరుజ్జీవానికి కచ్చితంగా నవోదయమే! క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే ఆ దేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లకు ఈ టోర్నీ ఎంతగానో స్ఫూర్తినింపుతుందనడంలో సందేహమే లేదు.
నిత్యం కలహాలు, ఉగ్ర దాడులు, అశాంతి, రాజకీయ అనిశ్చితి, ఆకలితో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో క్రికెట్‌కు పూర్వవైభవం తేవాలని యత్నిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఈ టోర్నీ నిర్వహణ ఓ లిట్మస్ టెస్ట్ వంటిది. భద్రతా కారణాల రీత్యా భారత్.. పాక్‌లో ఆడేందుకు నిరాకరించడంతో ఆ దేశం భారీ ఆదాయాన్ని కోల్పోయింది. కాగా గతేడాది పాక్ మాజీ సారథి, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసి జైళ్లో పెట్టడంతో అక్కడ చెలరేగిన అల్లర్లు ఇంకా పూర్తి స్థాయిలో చల్లారలేదు.
ద్రవ్యోల్బణంతో అక్కడ జనం ఆకలితో అలమటిస్తూ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఆందోళనకారుల ముసుగులో ఉగ్రమూకలు వారి ద్వారా చాంపియన్స్ ట్రోఫీకి ఆటంకం కలిగించే ప్రమాదమూ లేకపోలేదు. అయితే లాహోర్, కరాచీ, రావల్పిండిలో నిర్వహించబోయే ఈ టోర్నీని సాఫీగా జరిపించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం సుమారు 15వేల మంది భద్రతా సిబ్బందిని నియమించింది. వంద రోజుల్లోనే స్టేడియాలలో పునర్నిర్మాణ పనులను పూర్తి చేసిన పీసీబీ.. టోర్నీని ఏ మేరకు విజయవంతంగా నిర్వహిస్తుందనేది ఆసక్తికరం!