T20 World Cup | నార్త్‌సౌండ్ (అంటిగ్వా): స్వదేశంలో టీ20 ప్రపంచకప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలనుకున్న వెస్టిండీస్‌కు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. సెమీస్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌దాకా పోరాడి ఓడింది. అంటిగ్వా వేదికగా పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైనా బంతితో చేయగలిగినంత చేసినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్.. రోస్టన్ చేస్ (42 బంతుల్లో 52, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కైల్ మేయర్స్ (34 బంతుల్లో 35, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.
సఫారీ బౌలర్లలో షంసీ (3/27), రబాడా (1/11) కరేబియన్లను కట్టడి చేశారు. వర్షం వల్ల దక్షిణాఫ్రికా లక్ష్యం 17 ఓవర్లకు 123 పరుగులకు కుదించగా.. ఆ జట్టు 16.1 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి ఛేదనను పూర్తిచేసింది. ఛేదనలో ఆ జట్టు బ్యాటర్లు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినా స్టబ్స్ (27 బంతుల్లో 29, 4 ఫోర్లు), క్లాసెన్ (10 బంతుల్లో 22, 3 ఫోర్లు, 1 సిక్స్), మార్కో జాన్సెన్ (14 బంతుల్లో 21 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) సఫారీలను విజయతీరానికి చేర్చారు. బ్యాట్‌తో విండీస్‌ను ఆదుకున్న చేస్ బంతితోనూ (3/12) పోరాడాడు. రస్సెల్ (2/19), అల్జారీ జోసెఫ్ (2/25) రాణించినా వెస్టిండీస్‌కు పరాభవం తప్పలేదు. షంసీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు:
వెస్టిండీస్: 20 ఓవర్లలో 135/8 (చేస్ 52, మేయర్స్ 35, షంసీ 3/27, రబాడా 1/11).. దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 124/7 (స్టబ్స్ 29, క్లాసెన్ 22, చేస్ 3/12, రస్సెల్ 2/19)