గడిచిన కొద్దిరోజులుగా భారత క్రికెట్లో మరే విషయం లేదన్నట్టుగా అభిమానులు, పండితులు, విశ్లేషకులు, విమర్శకులు, నిపుణులు.. వీళ్లు వాళ్లూ అని తేడా లేకుండా అందరి నోళ్లలోనూ నలుగుతున్న పేరు విరాట్ కోహ్లీ, అతడి ఫామ్. మునపటి ఫామ్‌ను అందుకోవడానికి తంటాలు పడుతున్న కోహ్లీకి విశ్రాంతినివ్వడం, అతడు ఆడకపోవడంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. దానికి కొనసాగింపా అన్న విధంగా విరాట్ ఆట కూడా అత్యంత చెత్తగా సాగుతోంది.
అయితే విరాట్ ఫామ్, జట్టులో అతడి అవసరంపై ఇదివరకే తన అభిప్రాయం కుండబద్దలు కొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మకు గురువారం రెండో వన్డే అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో అతడు అసహనానికి గురయ్యాడు.
సమావేశంలో ఓ పాత్రికేయుడు.. ‘ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫామ్ మీదే చర్చ నడుస్తుంది కదా..’ అని అనగానే రోహిత్ మాట్లాడుతూ.. ‘అసలు చర్చ ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. కోహ్లీ ఇన్నేండ్లుగా వందలాది మ్యాచులు ఆడాడు. భరోసా ఉంచాల్సిన అవసరం లేని బ్యాటర్ అతడు. నేను నా గత ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఇదే విషయం చెప్పాను.. మళ్లీ అదే చెబుతున్నాను..
ప్రతి క్రికెటర్ కెరీర్ లో ఇది (ఫామ్ లేమి) సహజం. ఇన్నాళ్లుగా క్రికెట్ ఆడుతున్న వాళ్లు తిరిగి ఫామ్ అందుకోవడానికి ఒకటి రెండు ఇన్నింగ్స్ చాలు. నేనైతే అదే అనుకుంటున్నా. దీని (కోహ్లీ ఫామ్) గురించి బయట చర్చ జరుగుతుందని నాకు కూడా తెలుసు. కానీ ఏ క్రికెటర్ కెరీర్ లో అయినా ఎత్తుపల్లాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. కొన్ని ఇన్నింగ్స్ ఆడనంత మాత్రానా ఆటగాడిలో క్వాలిటీ తగ్గదు కదా. ప్రతి మ్యాచ్ లో నిలకడగా రాణించే ఆటగాడు ఈ ప్రపంచంలోనే లేడు. ప్రతి ఒక్కరూ ఎత్తుపల్లాలు చూడాల్సిందే..’ అని రోహిత్ ఘాటుగా సమాధానమిచ్చాడు.
Rohit Sharma again backed Virat Kohli. Great gesture by Skipper. pic.twitter.com/C8HEYnajgj
— Rohit Sharma Fanclub India (@Imro_fanclub) July 15, 2022