భారత్, ఇంగ్లండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి చారిత్రక లార్డ్స్ మైదానం వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టుకు తెరలేవనుంది. బర్మింగ్‌హామ్‌లో చిరస్మరణీయ విజయంతో భారత్ మంచి జోరుమీదుంటే.. సొంతగడ్డపై సత్తాచాటలేకపోతున్న ఇంగ్లండ్ ఒకింత ఒత్తిడిలో ఉన్నది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా కొనసాగుతున్న నేపథ్యంలో ముందంజ వేసేందుకు రెండు జట్లు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నాయి. తుది జట్టులోకి స్టార్ పేసర్ బుమ్రా రాక ఖరారు కాగా, భారత్ మరింత జోరుతో ఇంగ్లండ్ భరతం పట్టేందుకు సిద్ధమవుతున్నది. దాదాపు నాలుగేండ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన జోఫ్రా ఆర్చర్ ఏ మేరకు ప్రభావం చూపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
లండన్: భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టుకు గురువారం తెరలేవనుంది. క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ స్టేడియం వేదికగా రెండు జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమమైన నేపథ్యంలో ఈ పోరు ఇరు జట్లకు కీలకం కానుంది. పసలేని నిర్జీవమైన పిచ్‌లపై అనుభవం లేని బౌలర్లతో నెట్టుకోస్తున్న ఇంగ్లిష్ జట్టు లార్డ్స్‌లోనూ ఫ్లాట్ వికెట్‌ను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇదే నిజమైతే టీమ్ఇండియా బ్యాటర్లు మరోమారు పరుగుల వరద పారించడం ఖాయం. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇప్పటికే మూడు సెంచరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. రెండో టెస్టులో భారీ డబుల్ సెంచరీకి తోడు మరో సెంచరీతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. గిల్‌కు తోడు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, రాహుల్, జడేజా, జైస్వాల్ మంచి టచ్‌లో ఉండటం టీమ్ఇండియాకు సానుకూలాంశం. మరోవైపు ఇంగ్లండ్‌ను అనుభవం లేని బౌలర్ల లోటు వేధిస్తున్నది. అండర్సన్, బ్రాడ్ నిష్ర్కమణ తర్వాత ఆ స్థాయి బౌలర్లు ఇంగ్లండ్‌కు మళ్లీ దొరుకలేదు.
బుమ్రా రాకతో : స్టార్ పేసర్ బుమ్రా రాకతో భారత బౌలింగ్ మరింత బలం పుంజుకున్నది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటర్లకు సవాల్ విసిరే సత్తా ఉన్న బుమ్రా చేరికతో టీమ్ఇండియాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చి చేరింది. పని ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుంటూ రెండో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతినిచ్చిన టీమ్ మేనేజ్మెంట్ సిరీస్ విజేతను నిర్ణయించేందుకు మూడో టెస్టులో స్టార్ పేసర్‌ను బరిలోకి దించుతున్నది. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో తుది జట్టులోకి రానున్న బుమ్రాకు సిరాజ్, ఆకాశ్‌దీప్‌తో టీమ్ఇండియా పేస్ దళం మరింత పదునెక్కనుంది. ఈ ముగ్గురూ చెలరేగితే ఇంగ్లండ్ బ్యాటర్లకు కష్టాలు తప్పవు. బ్యాటింగ్ విషయానికొస్తే..దాదాపు ఏడేండ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ ఫామ్ అందుకోలేకపోతున్నాడు. దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపినా..ఇంగ్లండ్ పిచ్‌లపై తేలిపోతున్నాడు. లార్డ్స్ టెస్టులో రాణించడంపై నాయర్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఆల్రౌండర్లుగా నితీశ్‌కుమార్, సుందర్, జడేజా కొనసాగే అవకాశముంది.
స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ రీఎంట్రీ ఇంగ్లండ్‌కు కొత్త జోష్ తీసుకొచ్చింది. దాదాపు నాలుగేండ్ల తర్వాత తిరిగి టెస్టు జట్టులోకి వచ్చిన ఆర్చర్..ఇంగ్లండ్‌కు కీలకం కానున్నాడు. బుల్లెట్ లాంటి వేగంతో ఆర్చర్ సంధించే బంతులు బ్యాటర్లకు పరీక్ష పెడుతుంటాయి. జోష టంగ్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆర్చర్ ఏ మేరకు ప్రభావం చూపిస్తాడో చూడాలి. అనుభవలేమి ఇంగ్లండ్‌ను ఇబ్బంది పెడుతున్నది. క్రిస్ వోక్స్, బ్రెండన్ కార్స్, స్టోక్స్‌తో నెట్టుకొస్తున్న ఇంగ్లిష్ టీమ్..భారత బ్యాటర్లను నిలువరించలేకపోతున్నది. ఓపెనర్ జాక్ క్రాలీ ఫామ్ ఆందోళన కల్గిస్తుండగా, ఒలీ పోప్, బ్రూక్, డకెట్, స్మిత్ రాణిస్తుండటం ఆ జట్టుకు కలిసి వస్తున్నది.
జట్లు : భారత్ (అంచనా) : జైస్వాల్, రాహుల్, కరుణ్, గిల్ (కెప్టెన్), పంత్, జడేజా, వాషింగ్టన్, నితీశ్, బుమ్రా, ఆకాశ్, సిరాజ్
ఇంగ్లండ్: స్టోక్స్(కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్మిత్, వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్.