ముంబై: గత కొంతకాలంగా పేలవమైన ఆటతీరుతో ఇంటాబయటా విమర్శలు ఎదుర్కుంటున్న సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్ఇండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ అన్నాడు. ఆ ఇద్దరిలో ఇప్పటికీ పరుగుల దాహం తీరలేదని, రాబోయే ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో వాళ్లిద్దరూ రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లబోయే ముందు సోమవారం ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గంభీర్ పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సీనియర్ల ఫామ్, పాంటింగ్ కామెంట్స్‌పై..
సీనియర్ బ్యాటర్లు కోహ్లీ, రోహిత్ పేలవ పామ్‌పై వస్తున్న విమర్శలపై గంభీర్ స్పందించాడు. ఇటీవలే ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ కోహ్లీ ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా గంభీర్ స్పందిస్తూ.. ‘భారత క్రికెట్‌తో పాంటింగ్‌కు ఏం పని? ఆయన ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచిస్తే మంచిది. విరాట్ కోహ్లీ, రోహిత్ ఫామ్‌పై నాకెలాంటి ఆందోళనా లేదు. వాళ్లిద్దరూ ఇప్పటికీ పరుగుల వేటలో బాగా ఆకలితో ఉన్నారు’ అని అన్నాడు.
ఒత్తిడి లేదు..
రోహిత్, కోహ్లీ, అశ్విన్ వంటి సీనియర్లు కెరీర్ చరమాంకంలో ఉన్న నేపథ్యంలో భారత క్రికెట్ ప్రస్తుతం పరివర్తన దశలో ఉండగా కోచ్‌గా ఏదైనా ఒత్తిడి ఎదుర్కుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘నేను పరివర్తన గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతం మా లక్ష్యం ఆస్ట్రేలియా సిరీస్ మీదే ఉంది. ఒకవేళ అది (ట్రాన్సిషన్) జరిగేది ఉంటే జరుగుతుంది. అది మా చేతుల్లో లేదు. కానీ మాకు డ్రెస్సింగ్ రూమ్‌లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు’ అని తెలిపాడు.
బుమ్రా సారథి.. రాహుల్ ఓపెనర్!
ఆసీస్‌తో తొలి టెస్టుకు సారథి రోహిత్ అందుబాటులో ఉండేది, లేనిది స్పష్టత లేదని చెప్పిన గంభీర్.. ఒకవేళ అదే జరిగితే పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని గంభీర్ అన్నాడు. ‘ప్రస్తుతానికైతే రోహిత్ అందుబాటులో ఉండటంపై మాకు స్పష్టత లేదు. అతడు తొలి టెస్టు ఆడతాడనే నమ్మకంతోనే ఉన్నాం. సిరీస్ ఆరంభానికి ముందు దానిపై మాకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ రోహిత్ లేకుంటే పెర్త్ టెస్టులో బుమ్రా సారథిగా జట్టును నడిపిస్తాడు’ అని చెప్పాడు. రోహిత్ లేనిపక్షంలో యశస్వీ జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే ఓపెనర్ గురించి తమకు టెన్షన్ లేదని.. కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్ రూపంలో తమకు చాలా ఆప్షన్లు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. జట్టుతో అందరి కంటే ముందే ఆసీస్‌కు వెళ్లి అక్కడ ఆస్ట్రేలియా-ఏతో రెండో అనధికారిక టెస్టు ఆడిన రాహుల్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమైన విషయం విదితమే. ఇటీవల అతడి ఫామ్ సరిగ్గా లేకపోయినా రాహుల్ ఓపెనర్‌గా గానే గాక 3, 6వ స్థానంలో ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల సమర్థుడని గంభీర్ చెప్పాడు. యువ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా ఆస్ట్రేలియాలో రాణిస్తారన్న విశ్వాసం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
మీడియాకు దూరంగా ఉంచండి: మంజ్రేకర్
న్యూఢిల్లీ: టీమ్ఇండియా చీఫ్ కోచ్ గౌతం గంభీర్‌పై సంజయ్ మంజ్రేకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆసీస్‌కు బయల్దేరే వెళ్లే ముందు ఏర్పాటు చేసిన మీడియా భేటీలో గంభీర్ వ్యవహరశైలిపై మంజ్రేకర్ ఎక్స్‌లో స్పందించాడు. ‘ఇప్పుడే గంభీర్ మీడియా సమావేశం చూశాను. ఇప్పటి నుంచి అతన్ని మీడియా సమావేశాలకు దూరం ఉంచడం బెటర్. తెర వెనుక పనిచేసుకోనివ్వండి. రోహిత్‌శర్మ, అజిత్ అగార్కర్.. హాజరుకావడం మంచిది’ అని రాసుకొచ్చాడు.