Harbhajan Singh | జట్టుల్లో సూపర్‌స్టార్ సంస్కృతికి స్వస్తి పలకాలని.. ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేయాలని మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బీసీసీఐని కోరారు. పదేళ్ల తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ స్పందించాడు. యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. జట్టులో సూపర్ స్టార్ సంస్కృతి ఉందని.. తమకు సూపర్స్టార్లు వద్దని.. కేవలం మంచి ప్రదర్శన చేసే ఆటగాళ్లు కావాలన్నాడు. జట్టు ఆట తీరును బాగుంటేనే రాణిస్తుందని.. సూపర్ స్టార్ అవ్వాలనుకునే వారు ఇంట్లోనే ఉండి.. ఆడుకోవాలని సూచించాడు. జూన్‌లో భారత్‌లో ఇంగ్లండ్ జట్టు పర్యటించనున్నది. అప్పటి వరకు ఏం జరుగబోతోంది.. టీమ్‌లో ఎవరుంటారు? ఎవరు ఉండరనే అంశంపై అందరూ చర్చిస్తున్నారని.. ఇది సాధారణ సమస్యేనని తాను నమ్ముతున్నానని హర్భజన్ పేర్కొన్నాడు.
మంచి ప్రదర్శన చేసే ఆటగాళ్లు మాత్రమే జట్టులో ఉండాలని.. పేరు ప్రతిష్టల ఆధారంగా జట్టును ఎంపిక చేయొద్దని బీసీసీఐకి సూచించాడు. ఇదే చేయాలనుకుంటే.. కపిల్ దేవ్ సర్, అనిల్ భాయ్ (అనిల్ కుంబ్లే)లను తీసుకెళ్లాలని ఘాటుగా స్పందించాడు. బీసీసీఐ, సెలెక్టర్లు కఠినంగా వ్యవహరించాల్సి ఉందని.. సూపర్ స్టార్ యాటిట్యూడ్‌తో జట్టు ముందుకు సాగదని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌తో భారీ స్కోర్ సాధించడంలో విఫలమయ్యారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఓటమితో భారత్ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే అవకాశాలను కోల్పోయింది. పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న క్రికెటర్లు ఏ ఫార్మాట్లోనైనా ఆడి ఇంగ్లండ్ టెస్టు పర్యటనకు ముందు తమను తాము నిరూపించుకోవాలని.. ప్రదర్శన ఆధారంగానే జట్టును ఎంపిక చేయాలని హర్భజన్ సూచించాడు. అది విరాట్ అయినా.. రోహిత్ అయినా.. మరెవరైనా కావచ్చని చెప్పాడు.
ఏ ఆటగాడైన పెద్ద సూపర్ స్టార్ అనుకుంటే.. జట్టు కంటే సూపర్ స్టార్ కాదని స్పష్టం చేశాడు. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లాలంటే కఠిన ప్రశ్నలు వేయాల్సిందేనన్నాడు. వాళ్లను వదిలేయాలని తాను చెప్పడం లేదని.. పేలవమైన ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న ఆటగాళ్లను ఇంగ్లండ్ పర్యటనకు కొంత క్రికెట్ ఆడించి.. రాణించినట్లయితేనే ఎంపిక చేయాలని బీసీసీఐకి మాజీ ఆటగాడు సూచించాడు. విరాట్ 2024లో 11 టెస్టుల్లో 440 పరుగులు చేయగా.. సగటు 23.15గా ఉన్నది. ఈ గణాంకాలు వింతగా వింతగా అనిపిస్తాయని.. తాను కూడా ఆశ్చర్యపోయానని చెప్పాడు. బుమ్రా లేకపోతే భారత్ సిరీస్‌ను 5-0 లేదంటే 4-0 తేడాతో ఓడిపోయేదని మాజీ ఆఫ్ స్పిన్నర్ పేర్కొన్నారు. ట్రావిస్ హెడ్, మార్కస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ ఇలా ఎవరు వచ్చినా బంతిని బుమ్రాకే ఇస్తున్నారని.. అతని ఎన్ని ఓవర్లు వేస్తాడని ప్రశ్నించాడు. దాంతోనే బుమ్రాకు ఇబ్బందికరంగా మారిందని.. బుమ్రా ఎన్ని ఓవర్లు వేయాలనేది టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించాలని మాజీ కెప్టెన్ స్పష్టం చేశాడు.