Wasim Akram : పొట్టి క్రికెట్ రాకతో సుదీర్ఘ ఫార్మాట్, వన్డేలు కొద్ది కొద్దిగా కళ తప్పుతున్నాయి. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీ అయితే తప్ప స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూసేవాళ్లు కరువవుతున్నారు. ఈ నేపథ్యంలో వన్డేలకు మునపటి వైభవం తెచ్చేందుకు పాకిస్థాన్ వెటరన్ వసీమ్ అక్రమ్(Wasim Akram) ఓ సలహా చెప్పాడు. 50 ఓవర్ల ఆటను 40 ఓవర్లకు కుదించాలని అక్రమ్ అభిప్రాయపడ్డాడు.
‘నా దృష్టిలో వన్డేల్లో 10 నుంచి 40 ఓవర్లు పెద్ద సమస్య. ఈ ఓవర్లలో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేటంతగా ఏమీ జరుగదు. అందుకని వన్డేలను 40 ఓవర్లకు కుదిస్తే బెటర్. అప్పుడు ఆట మరింత ఇంట్రస్టింగ్‌గా మారుతుంది’ అని అక్రమ్ వెల్లడించాడు. అంతేకాదు మరికొన్ని రోజుల్లో వన్డే వరల్డ్ కప్ టోర్నీని చూస్తామో? లేదో? అని ఈ లెజెండరీ పేసర్ వ్యాఖ్యానించాడు.
గతంలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) సైతం అచ్చం ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వన్డేలను ఆసక్తిగా మార్చాలంటే.. 25 ఓవర్ల చోప్పున నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడించాలని సచిన్ అన్నాడు. కానీ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) మాత్రం వన్డేల్లో మార్పులపై స్పందించాల్సి ఉంది.
వరల్డ్ కప్(2023) ట్రోఫీతో 10 జట్ల సారథులు
భారత గడ్డపై ఈ మధ్యే ముగిసిన వన్డే వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లకు ప్రేక్షకులు కరువయ్యారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో స్టేడియం అభిమానులు లేక వెలవెలబోయింది. లీగ్ దశ తర్వాత సెమీస్ పోరు ఆసక్తికరంగా మారడంతో ఫ్యాన్స్ స్టేడియాలకు పోటెత్తారు. ఇక భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు అయితే.. అభిమానులు వేల సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. టీవీల్లో, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కోట్లాది మంది వీక్షించారు.