Wasim Akram: వచ్చే ఏడాది జరుగబోయే చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ప్రతిష్ఠంభన నెలకొంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీకి టీమిండియా (Team India) వెళ్లడం లేదని సమాచారమే అందుకు కారణం. దాంతో, నిరుడు ఆసియా కప్ మాదిరిగానే హైబ్రిడ్ మోడల్లో టోర్నీ జరుపుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ లెజెండరీ బౌలర్ వసీం అక్రమ్ (Wasim Akram) తమ దేశమంతా టీమిండియా రాక కోసం ఎదురు చూస్తోందని అన్నాడు.
‘రాజకీయాలను ఆటకు ముడిపెట్టొద్దు. పాక్లో చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు వస్తే మేమంతా ఘన స్వాగతం పలుకుతాం. మా దేశ పౌరులంతా టీమిండియా రాక కోసం చూస్తున్నారు’ అని వసీం తెలిపాడు. అంతేకాదు చాంపియన్స్ ట్రోఫీకి పాక్లో ఏర్పాట్లు చకాచకా సాగుతున్నాయని వసీం చెప్పాడు. సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి. కొత్త స్టేడియాలు కట్టించారు. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీల్లో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కొత్త మైదానాలు నిర్మించాడు. కాబట్టి ఈసారి టోర్నీ గొప్పగా సాగుతుందని ఆశిస్తున్నా అని వసీం వెల్లడించాడు.
𝐈𝐀𝐍𝐒 𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞
Watch: Former seamer Wasim Akram ‘hopes’ Indian team will travel to Pakistan for 2025 Champions Trophy pic.twitter.com/5B09C7JCUQ
— IANS (@ians_india) July 11, 2024
సరిహద్దు వివాదం కారణంగా భారత్, పాకిస్థాన్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఆగిపోయి ఏండ్లు గడుస్తోంది. దాంతో, ఐసీసీ టోర్నీల్లోనూ దాయాది జట్లు తలపడుతున్నాయి. అందుకని చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ అంటే చాలు స్టేడియాలు నిండిపోతున్నాయి. ఇక నిరుడు కూడా పాక్ గడ్డపై ఆసియా కప్ ఆడమంటే ఆడమని బీసీసీఐ తెగేసి చెప్పింది. దాంతో, లంక వేదికగా టీమిండియా మ్యాచ్లు నిర్వహించారు.

ఇప్పుడేమో చాంపియన్స్ ట్రోఫీ విషయం మరోసారి చర్చకు వచ్చింది. 2025 ఫిబ్రవరిలో పాక్ క్రికెట్ బోర్డు ఈ మెగా టోర్నీ ఆతిథ్యానికి సిద్ధమైంది. కానీ, బీసీసీఐ మాత్రం జట్టును పంపేందుకు రెడీగా లేదు. దాంతో, భారత బోర్డు వైఖరిపై మరోసారి అంతర్జాయ క్రికెట్ మండలి (ICC)ని పీసీబీ ఆశ్రయించే అవకాశముంది. అయితే.. రోహిత్ సేనను పంపాలా? వద్దా? అనే అంశంపై కేంద్ర హోమ్ శాఖ నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాతే బీసీసీఐ ప్రకటన వెల్లడించే అవకాశముంది.