Bangladesh: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి నేపథ్యంలో భారత్-బంగ్లా మధ్య వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ టీం నుంచి బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ ను తొలగించాలని బీసీసీఐ ఆదేశించింది. దీంతో బంగ్లా-భారత్ మధ్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి. ముస్తాఫిజుర్ ను తొలగించినందుకు నిరసనగా.. బంగ్లాదేశ్ లో ఐపీఎల్ పై నిషేధం విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
దీని ప్రకారం దేశంలో ఐపీఎల్ ప్రసారాలతోపాటు, ప్రచారం కూడా చేయకూడదు. ఈ మేరకు బంగ్లా ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇటీవల మినీ వేలంలో ముస్తాఫిజుర్ ను కోల్ కతా జట్టు రూ.9.2 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా పలువురు కేకేఆర్, బీసీసీఐపై విమర్శలు చేశారు. ఒక పక్క బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతుంటే.. ఆ దేశానికి చెందిన క్రీడాకారుడిని ఐపీఎల్ టీంలోకి తీసుకోవడంపై సోషల్ మీడియా వేదికగా పలువురు విమర్శించారు. దీంతో స్పందించిన బీసీసీఐ అతడిని తొలగించాలని కేకేఆర్ కు ఆదేశాలు జారీ చేసింది. అతడి స్థానంలో మరొకరిని తీసుకునేందుకు అనుమతిస్తామని చెప్పింది. దీంతో ముస్తాఫిజుర్ ను కేకేఆర్ విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.
దీనిపై బంగ్లా క్రికెట్ బోర్డ్ (బీసీబీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీసీఐ నిర్ణయం బంగ్లా ప్రజల్ని ఆగ్రహానికి, విస్మయానికి గురి చేసిందని తెలిపింది. ఇలా చేస్తే.. ఇండియాలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ లు తమ జట్టు పాల్గొనబోదని, తమ జట్టు ఆడే మ్యాచుల వేదికలు ఇండియా నుంచి మార్చాలని ఐసీసీని కోరింది. తమ క్రికెటర్ల భద్రత రీత్యా తమ ఆటగాళ్లను ఇండియా పంపించకూడదని నిర్ణయించుకున్నట్లు బీసీబీ తెలిపింది. ఈ అంశంపై త్వరలోనే ఐసీసీ చర్చించనుంది. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. బంగ్లాదేశ్.. ఇండియాలో నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఒకవేళ బీసీబీ కోరినట్లు ఇండియా నుంచి వేదికలు మారిస్తే.. శ్రీలంకలో ఆడే ఛాన్స్ ఉంది.