Wasim Akram | పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసిం అక్రమ్ చిక్కుల్లో పడ్డాడు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌కు ప్రచారం చేస్తున్న మాజీ బౌలర్‌పై సైబర్ క్రైమ్ ఏజెన్సీకి ఫిర్యాదు చేశారు. జూదం, బెట్టింగ్ యాప్స్‌ను ప్రోత్సహిస్తున్న అక్రమ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ముహమ్మద్ ఫైజ్ లాహోర్‌లోని నేషన్ సైబర్ క్రైమ్ ఏజెన్సీ(NCCIA)కి ఫిర్యాదు చేశాడు. విదేశీ బెట్టింగ్ యాప్ ‘బాజీ’తో అక్రమ్‌కు సంబంధం ఉందని ఫైజ్ ఆరోపించారు. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఈ బెట్టింగ్ యాప్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాడన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన పోస్టర్, వీడియో క్లిప్‌లో వసీం అక్రమ్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌కు మద్దతు తెలుస్తోందని.. ఇది యాప్‌పై సాధారణ ప్రజల్లో ఆసక్తిని పెంచిందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్ 2016 కింద అక్రమ్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫైజ్ సైబర్ క్రైమ్ ఏజెన్సీకి విజ్ఞప్తి చేశాడు.
ఇదిలా ఉండగా.. భారత్‌లో బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన పలువురు సెలబ్రిటీలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నిస్తున్నది. అక్రమ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన అనేక కేసులను ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. చాలామంది పెట్టుబడిదారులను రూ.కోట్లల్లో మోసం చేయడం, పెద్ద మొత్తంలో పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆ యాప్‌కు సంబంధించిన ప్రకటనల్లో పాల్గొన్న వ్యక్తులు, ముఖ్యంగా సినీతారలు, క్రికెటర్లపై ఈడీ చర్యలు చేపడుతున్నది. ఈ కేసులో ఈడీ చాలా మంది నటీనటులు, ప్లేయర్స్‌ను ప్రశ్నించింది. ఈ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్ ప్రజల నుంచి డబ్బును దోచుకుంటున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లు తమను తాము నాలెడ్జ్ ఆధారిత గేమింగ్‌గా చూపించుకుంటాయని, కానీ నకిలీ అల్గారిథమ్‌ల ద్వారా అక్రమ బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తాయని దర్యాప్తులో వెల్లడైంది.