హోబర్ట్: ఆస్ట్రేలియా పర్యటనలో భారత పురుషుల జట్టు బోణీ కొట్టింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా ముగిసిన మూడో టీ20లో టీమ్ఇండియా.. 5 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తుచేసి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 187 పరుగుల ఛేదనను భారత్ మరో 9 బంతులు మిగిలుండగానే దంచేసింది. వాషింగ్టన్ సుందర్ (23 బంతుల్లో 49 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌కు తోడు తిలక్ వర్మ (29), అభిషేక్ శర్మ (25) రాణించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 రన్స్ చేసింది. టిమ్ డేవిడ్ (38 బంతుల్లో 74, 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), మార్కస్ స్టోయినిస్ (39 బంతుల్లో 64, 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో ఆ జట్టుకు భారీ స్కోరునందించారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అర్ష్‌దీప్ సింగ్ (3/35), వరుణ్ చక్రవర్తి (2/33) ఆ జట్టును కట్టడిచేశారు. ఇరుజట్ల మధ్య నాలుగో మ్యాచ్ ఈనెల 6న జరుగుతుంది.
భారీ ఛేదనను అభిషేక్ ఎప్పట్లాగే దంచుడుతో మొదలుపెట్టాడు. సిక్సర్‌తో పరుగుల వేటను ఆరంభించిన అతడు.. అబాట్ రెండో ఓవర్లో 4, 6, 6తో 17 రన్స్ పిండుకున్నాడు. కానీ ఎల్లీస్ 4వ ఓవర్లో వేసిన షార్ట్ బాల్ మిడ్ వికెట్ మీదుగా ఆడబోయినా బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకడంతో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. గిల్ (15) మళ్లీ విఫలమయ్యాడు. కెప్టెన్ సూర్య (11 బంతుల్లో 34, 1 ఫోర్, 2 సిక్స్‌లు) రెండు సిక్సర్లతో ఊపు మీదే కనిపించినా స్టోయినిస్ 8వ ఓవర్లో స్లో డెలివరీకి బలయ్యాడు. అక్షర్ పటేల్ (17) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. తిలక్ వర్మ క్రీజులో ఉన్నా వేగంగా ఆడలేకపోయాడు. అక్షర్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్.. ఎదుర్కున్న తొలి బంతినే మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టాడు. అబాట్ 14వ ఓవర్లో 4, 6, 6తో 19 పరుగులు రావడంతో భారత్ విజయం ఖరారైంది. ఆ తర్వాత తిలక్ నిష్క్రమించినా జితేశ్ (13 బంతుల్లో 22*, 3 ఫోర్లు) అండతో వాషింగ్టన్ గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఇన్నింగ్స్‌కు అర్ష్‌దీప్ ఆరంభంలోనే షాకులిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతికే అతడు ప్రమాదకర హెడ్ (6)ను ఔట్ చేశాడు. తన మరుసటి ఓవర్లో జోష్ ఇంగ్లిస్ (1)నూ వెనక్కి పంపాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందిన డేవిడ్.. ఆరంభం నుంచే భారత్‌పై ఎదురుదాడికి దిగాడు. వరుణ్ ఐదో ఓవర్లో 4,6 బాదిన అతడు. 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా బౌలింగ్‌లో కవర్ పాయింట్ వద్ద వాషింగ్టన్ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయాడు. దూబె బౌలింగ్‌లో మూడు ఫోర్లు కొట్టి 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. 9వ ఓవర్లో వరుణ్.. మార్ష్ (11)తో పాటు ఓవెన్ (0)నూ ఔట్ చేసినా డేవిడ్‌కు స్టోయినిస్ జతకలిశాడు. దూబె 13వ ఓవర్లో స్టోయినిస్ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. కానీ ఆ ఓవర్ చివరి బంంతికి డేవిడ్.. లాంగాఫ్ వద్ద తిలక్ సూపర్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఆఖర్లో షార్ట్ (26*)తో కలిసి స్టోయినిస్ మెరుపులు మెరిపించడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది.
ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 186/6 (డేవిడ్ 74, స్టోయినిస్ 64, అర్ష్‌దీప్ 3/35, వరుణ్ 2/33); భారత్: 18.3 ఓవర్లలో 188/5 (వాషింగ్టన్ 49*, తిలక్ 29, ఎల్లీస్ 3/36, స్టోయినిస్ 1/22)