David Warner : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) తన బ్రాండ్ క్రికెట్‌తో అలరిస్తున్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రమే ఆడుతున్న ఈ డేరింగ్ ఓపెనర్ టీ20ల్లో మళ్లీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. స్వదేశంలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఈ లెఫ్ట్ హ్యాండర్ విధ్వంసక శతకంతో రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా పొట్టి ఫార్మాట్లో తొమ్మిదోసారి మూడంకెల స్కోర్ అందుకున్నాడు. తద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) రికార్డును వార్నర్ బ్రేక్ చేశాడు.
ఫార్మాట్ ఏదైనా దూకుడే మంత్రంగా చెలరేగే డేవిడ్ వార్నర్ ఈసారి సెంచరీతో మెరిశాడు. బీబీఎల్‌లో హోబర్డ్ హరికేన్స్ బౌలర్లను ఉతికేస్తూ 57 బంతుల్లోనే వంద కొట్టి.. 130 పరుగులతో అజేయంగా నిలిచాడీ మాజీ ప్లేయర్. సెంచరీ తర్వాత తనదైన స్టయిల్లో గాల్లోకి ఎగిరి పంచ్ విసిరి సెలబ్రేట్ చేసుకున్నాడతడు. అంతర్జాతీయ, ఫ్రాంచైజీ టీ20ల్లో అతడికి 9వ సెంచరీ. పొట్టి క్రికెట్లో విరాట్ కోహ్లీ, రీలే రస్సో(దక్షిణాఫ్రికా)లు కూడా ఇన్నేసి శతకాలు సాధించారు. రోహిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోస్ బట్లర్, డూప్లెసిస్, అరోన్ ఫించ్, మైఖేల్ కింగ్లర్, అభిషేక్ శర్మల పేరిట 8 టీ20 సెంచరీలు ఉన్నాయి.
David Warner brought out the ‘6-7’ celebration after his trademark jump 😂 #BBL15 pic.twitter.com/e3TtlebNBf
— KFC Big Bash League (@BBL) January 3, 2026
రెండేళ్ల క్రితం సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరిగిన సిడ్నీ టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు వార్నర్. అనంతరం భారత్‌లో వరల్డ్ కప్ ట్రోఫీ గెలుపొదాక వన్డేలకు వీడ్కోలు పలికేసిన డేవిడ్ భాయ్.. టీ20 వరల్డ్ కప్‌తో మూడు ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. తన సుదీర్ఘ కెరీర్లో బాదుడే పరమావధిగా అభిమానులను అలరించిన వార్నర్ పలు రికార్డులు తన పేరిట రాసుకున్నాడు.
టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అత్యధిక శతకాలు బాదిన తొలి ఓపెనర్‌గా ఈ లెఫ్ట్ హ్యాండర్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతడు భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డు బద్దలు కొట్టాడు. ప్రస్తుతానికి వార్నర్ 49 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సచిన్ 45 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. మరో విషయం ఏంటంటే.. వార్నర్ 451 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయికి చేరుకోగా.. మాస్టర్ బ్లాస్టర్ 342 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.