BCCI : టీ20 వరల్డ్ కప్ ముగింపు దశకు చేరుకుంటోంది. అయినా సరే.. భారత పురుషుల జట్టు కొత్త హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది మాత్రం బీసీసీఐ ఇంకా చెప్పలేదు. కోచ్ పదవికి పోటీలో ఉన్న మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ (Gautam Gambhir) నియామకం జరిగిపోయిందని చెప్తున్నా అధికారిక ప్రకటన రాలేదు. దాంతో, కోచ్‌గా గంభీర్ పోస్టింగ్ ఆలస్యం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జింబాబ్వే పర్యటనలో టీమిండియాకు కోచ్‌గా ఉండేది ఎవరు? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో జింబాబ్వే టూర్ (Zimbabwe Tour)కు వెళ్లే భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ఎంపికయ్యాడని సమాచారం. అయితే.. హెడ్‌కోచ్ పదవి పట్ల అయిష్టంగా ఉన్న లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా ఉండేందుకు అంగీకరిస్తాడా? లేదా? చూడాలి.
తొమ్మిదో సీజన్ టీ20 వరల్డ్ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీ కాలం ముగియనుంది. ఆ తర్వాత భారత జట్టు జూలైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అక్కడ టీమిండియా ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు జాతీయ క్రికెట్ అకాడమీ(NCA) అధ్యక్షుడు లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని టాక్. ఇంతకముందు ఐర్లాండ్ సిరీస్(Ireland)కు కోచ్‌గా వెళ్లిన అనుభవం హైదరబాదీ మాజీ ఆటగాడికి ఉంది. దాంతో, మళ్లీ లక్ష్మణ్‌కు తాత్కాలిక కోచ్ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తోంది.
టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్.. ఐపీఎల్లో మెంటార్‌గా హిట్ కొట్టాడు. వస్తూ వస్తూనే కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)ను చాంపియన్‌గా నిలిపాడు. గంభీర్ మార్పులు, చేర్పులతో రాటుదేలిన కోల్‌కతా మూడో ట్రోఫీని ముద్దాడింది. దాంతో, బీసీసీఐ గౌతీకి టీమిండియా ప్రధాన కోచ్ పదవిని ఆఫర్ చేసింది.