తిరుమల : తిరుమల(Tirumala) లో నాణ్యమైన నెయ్యి, శెనగపిండి, యాలకులు ఉపయోగించి నమూనా లడ్డూలను సిద్ధం చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు పోటు కార్మికులకు సూచించారు. శుక్రవారం తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో లడ్డూ తయారీపై జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహకిషోర్‌తో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో లడ్డూ తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యత తగ్గుముఖం పట్టడంపై కారణాలను పోటు కార్మికులను ఈవో అడిగి తెలుసుకున్నారు.
లడ్డూల తయారీలో వినియోగిస్తున్న బేసన్ పిండి, నెయ్యి, యాలకుల నాణ్యతను పెంచాలని పోటు కార్మికులు సూచించారు. లడ్డూల తయారీలో పనిభారం పెరిగిందని, మ్యాన్ పవర్‌ను పెంచాలని విన్నవించారు. అన్ని మెటీరియల్‌లను ఫ్లోటింగ్ టెండర్ల ద్వారా సేకరిస్తున్నామని, తక్కువ ధర పలికిన వారికి దినుసులు సరఫరా చేసేందుకు బిడ్‌ను కేటాయిస్తామని సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు. ఆలయ డీఈవో లోకనాథం, ఏఈవో పోటు శ్రీనివాసులు, రిటైర్డ్ ఏఈవోలు శ్రీనివాసులు, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.