ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు.. ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్‌కు వెళ్తుంది. ఈ మధ్యలోనే ఐర్లాండ్‌తో డబ్లిన్ వేదికగా రెండు టీ20లు ఆడాల్సి ఉంది. దీనికోసం గతేడాది చేసినట్లే మరో యువ జట్టును పంపాలని బీసీసీఐ భావిస్తోంది. గతేడాది భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుండగా.. శ్రీలంకతో సిరీస్‌కు యువ ఆటగాళ్లతో మరో జట్టును పంపారు.
సీనియర్ జట్టుకు రవిశాస్త్రి కోచ్‌గా వ్యవహరించగా.. శ్రీలంక వెళ్లిన జట్టుకు రాహుల్ ద్రావిడ్ కోచ్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈసారి ఇంగ్లండ్‌లో పర్యటించే జట్టుకు కోచ్‌గా ద్రావిడ్ బాధ్యతలు నిర్వహిస్తాడు. అదే సమయంలో ఐర్లాండ్ వెళ్లే యువజట్టుకు కోచ్‌గా క్లాసికల్ ప్లేయర్, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నట్లు సమాచారం.
ఎన్సీయే కోచింగ్ స్టాఫ్ సితాన్షు కోటక్, సాయిరాజ్ బహుతూలే, మునీష్ బాలినే ఐర్లాండ్ టూర్లో లక్ష్మణ్‌తోపాటు జట్టుకు కోచింగ్ స్టాఫ్‌గా పనిచేస్తారట. వీళ్లు కూడా చాలా అనుభవం ఉన్న వాళ్లే కావడం గమనార్హం. ఇండియా-ఎ, అండర్ 19 జట్లకు వీళ్లు కోచ్‌లుగా పనిచేసి ఉన్నారు. అయితే ఇంకా ఐర్లాండ్‌లో పర్యటించే జట్టును బీసీసీఐ ప్రకటించలేదు. ఆ ప్రకటన చేసే సమయంలోనే కోచింగ్ స్టాఫ్ వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది.