Virat Kohli : ప్రపంచ క్రికెట్లో అతడొక రన్ మెషీన్.. రికార్డులు బద్ధలు కొట్టేందుకే పుట్టిన రారాజు.. ఎంతటి లక్ష్యాన్నైనా ఆడుతూపాడుతూ కరిగించే ఛేజ్ మాస్టర్.. అంతేనా ఈతరం క్రికెటర్లకు ఆరాధ్యుడు. అథ్లెట్‌ను తలపించే దేహధారుడ్యంతో ఎందరికో స్ఫూర్తిగా మారిన ఫిట్నెస్ ఫ్రీక్.. ఇన్ని విశేషణాలు ఉన్న ఆ ఆటగాడు ఇంకెవరు.. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli ). తన క్లాస్ ఇన్నింగ్స్‌లతో అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించిన విరాట్ పుట్టిన రోజు ఇవాళే.
అండర్ -19 వరల్డ్ కప్ హీరోగా జట్టులోకి వచ్చి.. విలువైన ఆటగాడిగా.. సమర్ధుడైన నాయకుడిగా జట్టుపై తన ముద్ర వేసిన కోహ్లీ 36వ వసంతంలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అభిమానగణం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. క్రికెట్లో దిగ్గజ ఆటగాడిగా నిలిచిపోయే కోహ్లీ 1988 నవంబర్ 5వ తేదీన జన్మించాడు. ఢిల్లీలో నివాసముంటున్న పంజాబీ దంపతులు ప్రేమ్‌నాథ్ కోహ్లీ, సరోజ్ కోహ్లీలు విరాట్ తల్లిదండ్రులు. తండ్రి ప్రేమ్‌నాథ్ ఓ క్రిమినల్ లాయర్. కోహ్లీకి సోదరుడు వికాస్, సోదరి భావన ఉన్నారు.
Happy 36th idolo @imVkohli ❤️
Stay blessed, stay happy, and play a few more years at the highest level 🙏❤️#HappyBirthdayViratKohli— 𝘿 (@DilipVK18) November 4, 2024
కోహ్లీ బాల్యమంతా ఉత్తమ్ నగర్లోనే గడిచిపోయింది. భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను ఆరాధిస్తూ పెరిగిన కోహ్లీ.. పెద్దయ్యాక అతడి మాదిరిగానే క్రికెటర్ అవ్వాలని కలలు కన్నాడు. అనుకున్నట్టే తన ఫేవరెట్ ఆటగాడితో కలిసి దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు సచిన్ పేరిట ఉన్న పలు రికార్డులు బ్రేక్ చేసి తానొక చాంపియన్ ప్లేయర్ అని చాటుకున్నాడు.
ఇక కోహ్లీ వ్యక్తిగత విషయానికొస్తే.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మ(Anushka Sharma)ను 2017లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఓ షాంపూ యాడ్‌లో కలిసి నటించిన ఈ ఇద్దరూ .. ఆపై ప్రేమ పక్షుల్లా విహరించారు. చివరకు ఇరువురు కుటుంబాలను ఒప్పించి పెండ్లితో ఒక్కటయ్యారు. ఇటలీలోని ఓ రిసార్ట్‌లో వీళ్ల పెండ్లి అంగరంగ వైభవంగా జరిగింది. విరుష్కగా పాపులర్ అయిన ఈ జంటకు వామిక, అకాయ్ అనే పిల్లలు ఉన్నారు.
మైదానంలో చిరుతను తలపించే కోహ్లీ పలు రికార్డుల దుమ్ముదులిపాడు. క్రికెట్‌కు ఎనలేని గుర్తింపు తెచ్చిన కోహ్లీకి భారత ప్రభుత్వం ఎన్నోసార్లు పురస్కారాలతో గౌరవించింది. 2013లో అర్జున అవార్డు అందుకున్న విరాట్‌ను 2017లో పద్మశ్రీ వరించింది. ఆ మరుసటి ఏడాదే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు లభించింది.
ఇక కోహ్లీ బ్యాట్ విధ్వంసానికి చెల్లాచెదురైన రికార్డులు మచ్చుకు కొన్ని.. నిరుడు స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్‌లో 50వ వన్డే శకతంతో ప్రకంపనలు రేపిన విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో 27 వేల పరుగుల మైలురాయికి చేరుకున్నాడు. అత్యంత వేగంగా ఈ క్లబ్లో చేరిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ కంటే ముందు ముగ్గురు దిగ్గజాలు 27 వేల క్లబ్లో చేరారు. వీళ్లలో సచిన్ టెండూల్కర్ 34,357 రన్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. కుమార సంగక్కర 28,016 రన్స్, ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్(Ricky Ponting) 27,483 పరుగులతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.
“If you can give it, you gotta take it back as well. Otherwise don’t give it”. 😎🔥
Happy Birthday to His Majesty 👑#HappyBirthdayViratKohli pic.twitter.com/FwkLyWEuzB
— @Urstrulysai (@BrahmaSai77) November 4, 2024
రికార్డులను అధిగమిస్తూ సాగిపోతున్న కోహ్లీ ఈమధ్యే సుదీర్ఘ ఫార్మాట్లో 9వేల పరుగుల క్లబ్లో చేరాడు. చిన్నస్వామి స్టేడియంలో క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌండరీలతో చెలరేగి 31వ టెస్టు ఫిఫ్టీ బాదేసిన విరాట్ 9 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు. పదహారేండ్ల కెరీర్లో చేజ్ మాస్టర్‌గా, రన్ మెషీన్‌గా పేరొందిన కోహ్లీ.. క్రీజులో కుదురుకున్నాడంటే పరగుల వరదే. ఈ కాలపు అత్యుత్తమ ఆటగాడిగా ప్రశంసలు అందుకున్నాడు. అందుకు నిదర్శనంగా పలు రికార్డులు అతడి పాదక్రాంతం అయ్యాయి. టెస్టుల్లో.. 8,871 రన్స్, వన్డేల్లో 13,096 పరుగులు.. టీ20ల్లో 4,188 రన్స్ కొట్టాడు.