ఢిల్లీ: ఇటీవల పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశవాళీలో ఆడాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. సుమారు పదేండ్లుగా దేశవాళీ వైపు కన్నెత్తి చూడని కోహ్లీ.. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు మాత్రం తన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. కానీ భారత్‌లో కాకుండా ఇంగ్లండ్ కౌంటీలలో ఆడాలని విరాట్ నిశ్చయించుకున్నట్టు సమాచారం. జూన్ 20 నుంచి మొదలుకాబోయే టెస్టు సిరీస్‌కు ముందు కోహ్లీ.. కౌంటీలు ఆడనున్నాడని తెలుస్తోంది.
ఒకవేళ ఐపీఎల్-2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్లేఆఫ్స్‌కు వెళ్తే అతడు కనీసం రెండు వారాల పాటు అయినా కౌంటీలు ఆడతాడని, లీగ్ దశలోనే వెనుదిరిగితే సుమారు నెల రోజుల పాటు కౌంటీలకు కేటాయించనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ కోహ్లీ గనక కౌంటీలలో ఆడితే ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు అవి అతడికి ఎంతగానో ఉపయోగపడతాయి.