బెంగళూరు: ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్‌ల్లో శతకాల వరద పారించిన బ్యాటర్లు.. రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించారు. ఆంధ్రాతో తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ (61 బంతుల్లో 77, 13 ఫోర్లు, 1 సిక్స్).. తాజాగా గుజరాత్‌తో పోరులోనూ రాణించడంతో రెండో మ్యాచ్‌లో ఢిల్లీ విజయపరంపరను కొనసాగించింది. కోహ్లీకి తోడు కెప్టెన్ రిషభ్ పంత్ (70) కూడా రాణించాడు. కాగా తొలి మ్యాచ్‌లో శతకం బాదిన రోహిత్ శర్మ.. ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో మాత్రం డకౌట్ అయి అభిమానులను నిరాశపరిచాడు. రోహిత్ విఫలమైనా హార్ధిక్ (93), ముషీర్ ఖాన్ (55), సర్ఫరాజ్ ఖాన్ (55) అర్ధ శతకాలతో మెరిసి ఆ జట్టుకు విజయాన్ని అందించారు. జాతీయ జట్టులో చోటు కోల్పోయి ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లో స్థానం దక్కించుకున్న రింకూ సింగ్ (60 బంతుల్లో 106, 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
అతడికి తోడు ఆర్యన్ జుయల్ (134) కూడా సెంచరీ చేయడంతో ఉత్తరప్రదేశ్.. 367 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో చండీగఢ్ 140 రన్స్‌కే ఆలౌట్ అవడంతో యూపీ 227 పరుగుల భారీ తేడాతో గెలిచింది. కర్నాటక బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ (124) వరుసగా రెండో సెంచరీ సాధించాడు. కేరళతో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్‌తో పాటు కరుణ్ నాయర్ (130*) కూడా శతకం బాదడంతో కర్నాటక రెండో విజయాన్ని నమోదుచేసింది. ఇక ఈ టోర్నీలో హైదరాబాద్‌కు వరుసగా రెండో పరాభవం తప్పలేదు. రాజ్‌కోట్ వేదికగా విదర్భతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్.. 89 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విదర్భ నిర్దేశించిన 366 పరుగుల భారీ ఛేదనలో హైదరాబాద్.. 276కే ఆలౌటైంది.