ముంబై : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు విరాట్‌కోహ్లీ, రోహిత్‌శర్మ ఎంపికపై వివాదం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే పలువురు మాజీలు వీరిద్దరిని తీసుకోవడంపై ప్రశ్నించగా, తాజాగా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్..సెలెక్షన్ కమిటీని నిలదీశాడు. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు కోహ్లీ, రోహిత్‌ను ఎంపిక చేయాల్సిన అవసరం ఏంటని వెంగ్‌సర్కార్ సూటిగా ప్రశ్నించాడు. ప్రముఖ ఇంగ్లిష్ వార్తాసంస్థతో వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ ‘గత కొన్నేండ్లుగా రోహిత్, కోహ్లీ దేశ క్రికెట్‌కు ఎనలేని సేవలందించారు.
కానీ వారు ఒక ఫార్మాట్ పరిమితమైనందువల్ల ఆటతీరు, ఫిట్నెస్ మనం సరిగ్గా అంచనా వేయలేం. ఈ విషయంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సరైన నిర్ణయం తీసుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్ ఆడక వాళ్లు చాలా రోజులవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారి మ్యాచ్ ఫిట్నెస్ కీలకంగా మారుతుంది. కోహ్లీ, రోహిత్ గొప్ప క్రికెటర్లు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఒంటిచేత్తో జట్టుకు ఎన్నో విజయాలందించారు. కానీ ఒకే ఫార్మాట్‌కే పరిమితమైన వాళ్లను కాకుండా అన్నింటికి అందుబాటులో ఉండే వారిని తీసుకుంటే మంచిది. ఇదంతా సెలెక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంది’ అని అన్నాడు.