Virat Kohli : టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా చేరుకున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఐసీసీ అవార్డు అందుకున్నాడు. ఆదివారం ఐసీసీ(ICC) అధికారులు విరాట్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డును అప్పజెప్పారు. గత ఏడాది సంచలన బ్యాటింగ్‌తో అలరించినందుకు కోహ్లీ.. ‘వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023’ అవార్డుకు ఎంపికయ్యాడు. వరల్డ్ కప్ సందర్భంగా ఆ ట్రోఫీని అందుకున్న కోహ్లీ మస్త్ ఖుషీ అయ్యాడు.
ఆ ట్రోఫీని చేతుల్లోకి తీసుకొని ‘దేవుడు ప్లాన్ చేసిన బేబీ’ అని అన్నాడు. అంతేకాదు ఐసీసీ షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియోలో ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023′(ODI Team Of The Year) టోపీని సైతం విరాట్ నెత్తిన పెట్టుకొని కనిపించాడు. టీమిండియా 2023కు గానూ ఓడీఐ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకుంది. అందుకని వరల్డ్ కప్ కోసం న్యూయార్క్ చేరుకున్న భారత ఆటగాళ్లకు ఐసీసీ ఈ టోపీలతో స్వాగతం పలికిన విషయం తెలిసిందే.
ప్రపంచ క్రికెట్లో గొప్ప ఆటగాడైన కోహ్లీ కెరీర్లో చివరి టీ20 వరల్డ్ కప్ ఆడనున్నాడు. ఫిట్నెస్ పరంగా చూస్తే.. మరో రెండేళ్లు ఆడగల సత్తా ఉన్నా.. కుర్రాళ్లు దూసుకొస్తున్నారు. దాంతో, విరాట్ ఇక వన్డే, టెస్టు ఆటగాడిగానే కొనసాగే చాన్స్ ఉంది. దాంతో, ఈసారి టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ కట్టబెట్టాలనే కసితో ఉన్నాడీ ఛేజ్ మాస్టర్.
ప్రతి ఫార్మాట్లో దంచికొట్టే విరాట్ ఐసీసీ టోర్నీ అంటే చాలు పరుగుల వరద పారిస్తుంటాడు. ఆస్ట్రేలియా గడ్డపై 2022లో జరిగిన వరల్డ్ కప్‌లో సైతం విరాట్ విశ్వరూపం చూపించాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్(Pakistan)పై అయితే సంచలన బ్యాటింగ్‌తో అలరించాడు. ఒకదశలో ఓటమి అంచున నిలిచిన జట్టును అజేయ అర్ధశతకంతో అద్భుత విజయాన్ని అందించాడు.
ఆ తర్వాత ఐపీఎల్ 16వ సీజన్లోనూ జోరు చూపిన విరాట్.. నిరుడు ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ టోర్నీలో రికార్డు సెంచరీలతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)ను వెనక్కి నెట్టాడు. ప్రస్తుతం కోహ్లీ వన్డేల్లో 50 శతకాలతో అత్యధిక సెంచరీల వీరుడుగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. వరల్డ్ కప్ వేళ ఐసీసీ అవార్డుతో కోహ్లీ జోష్ రెండింతలవ్వడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.