ఒకటా, రెండా ఏకంగా 18 ఏండ్లు కండ్లు కాయలు కాసేలా చూసిన వైనం. 2008లో ఏ క్షణాన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చేరాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు తన అణువణువు జట్టు కోసం ధారపోసిన కోహ్లీ కన్న కల ఇన్నాళ్లకు సాకారమైంది. అండర్-19 ప్రపంచకప్‌తో మొదలైన కోహ్లీ విజయ ప్రస్థానంలో మరో కలికుతురాయి చేరింది. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో వన్డే, టీ20 ప్రపంచకప్‌లకు తోడు చాంపియన్స్ ట్రోఫీ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలను ముద్దాడిన కోహ్లీకి ఐపీఎల్ టైటిల్ ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఊరిస్తూనే వచ్చింది. ఏడాది ఏడాదికి ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ అభిమానుల ఆశలు మోసుకుంటూ లీగ్‌లో అడుగుపెట్టిన ప్రతీసారి ఆర్సీబీకి ఆశాభంగమే అయ్యింది.
ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించిన ఆర్సీబీ కన్న కల ఇన్నేండ్లకు నెరవేరింది. అభిమానుల ఆశలు ఫలించిన వేళ 18 ఏండ్ల విరామం తర్వాత జూన్ 3, 2025న ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. గత సీజన్ల లాగే ఈసారి ఆర్సీబీకి టైటిల్ సాధ్యమయ్యేనా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ కల కప్‌ను సొంతం చేసుకుంది. పంజాబ్ కింగ్స్‌తో హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. ఈ ప్రయాణంలో కోహ్లీ కల నెరవేరడం మరిచిపోలేని మధుర జ్ఞాపకం. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ, అంచనాలకు మించి రాణించిన ఆర్సీబీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఈ ప్రయాణంలో కోహ్లీ పాత్ర మరువలేనిది. మ్యాచ్ మరో రెండు ఓవర్లలో ముగుస్తుందనగా అప్పటికే ఒక అంచనాకు వచ్చిన కోహ్లీ తన భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయాడు.
ఉబికి వస్తున్న కన్నీటిని దిగమింగుకుంటూ విజయం సాధించగానే మైదానంలో అలాగే కూర్చుండిపోయాడు. సహచరులందరితో చిరస్మరణీయ విజయాన్ని ఆస్వాదిస్తూ మైదానం మొత్తం కలియతిరిగాడు. తన భార్య అనుశ్కశర్మను అప్యాయంగా కౌగిలించుకుంటూ విజయాన్ని ఆస్వాదించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ ‘ఈ విజయం జట్టుకే కాదు మాకు ఎల్లవేళలా మద్దతుగా నిలిచిన అభిమానులకు చెందుతుంది. ఆర్సీబీతో 18 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణంలో యువకునిగా మొదలై, ఎంతో అనుభవం గడించాను. ప్రతీ సీజన్లో నా శక్తినంతా ధారపోశాను. ఇన్ని రోజులకు సాధించడం మరిచిపోలేని అనుభూతి. చివరి బంతి తర్వాత భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయాను. నా హృదయం, శరీరం బెంగళూరుతోనే’ అని అన్నాడు.
Read Also..