ఐపీఎల్ ట్రోఫీ కోసం 18 ఏండ్లుగా వేచి చూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కల ఎట్టకేలకు నెరవేరింది. రెండు నెలల పాటు పదిజట్లతో సాగిన ధనాధన్ సమరంలో ఒక్కో మెట్టు అధిగమిస్తూ, ఎదురైన సవాళ్లను దాటుకుంటూ ఫైనల్ చేరిన ఆర్సీబీ.. 18వ సీజన్లో తమ టైటిల్ కలను నెరవేర్చుకుంది. ఐపీఎల్లో ప్రతి సీజన్ ఆరంభానికి ముందు ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ హంగామా చేసే అభిమానుల ఆశలను నెరవేర్చుతూ టైటిల్‌ను తొలిసారి ముద్దాడింది. సీజన్ ఆసాంతం దుమ్మురేపిన పంజాబ్ కింగ్స్‌కు మరోసారి ఆఖరి మెట్టుపై నిరాశ తప్పలేదు. బంతితో పాటు బ్యాట్‌తోనూ విఫలమైన ఆ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
అహ్మదాబాద్ : 18 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్లో తొలి టైటిల్‌ను ముద్దాడింది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో హోరాహోరిగా జరిగిన ఫైనల్లో ఆర్సీబీ.. ఆరు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 191 పరుగుల ఛేదనలో పంజాబ్.. 184/7 వద్దే ఆగిపోవడంతో మొదటి టైటిల్ నెగ్గాలన్న ఆ జట్టు ఆశలు అడియాసలయ్యాయి. ఛేదనలో శశాంక్ సింగ్ (30 బంతుల్లో 61 నాటౌట్, 3 ఫోర్లు, 6 సిక్సర్లు), జోష్ ఇంగ్లిస్ (23 బంతుల్లో 39, 1 ఫోర్, 4 సిక్సర్లు) పోరాడినా ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (35 బంతుల్లో 43, 3 ఫోర్లు) నెమ్మదిగా ఆడినా కెప్టెన్ రజత్ పటీదార్ (16 బంతుల్లో 26, 1 ఫోర్, 2 సిక్స్‌ర్లు), జితేశ్ శర్మ (10 బంతుల్లో 24, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), లివింగ్‌స్టొన్ (15 బంతుల్లో 25, 2 సిక్సర్లు) మెరుపులతో ఆ జట్టుకు పోరాడగలిగే స్కోరును అందించారు.
మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. ఒకవైపు స్కోరుబోర్డు వేగంగానే కదులుతున్నా మరోవైపు కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం ఆ జట్టు భారీ స్కోరు ఆశలపై నీళ్లు చల్లింది. అర్ష్‌దీప్ మొదటి ఓవర్లోనే 6, 4తో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఫిల్ సాల్ట్ (16).. జెమీసన్ వేసిన రెండో ఓవర్లో భారీ షాట్ ఆడబోయి మిడాన్ వద్ద శ్రేయాస్ చేతికి చిక్కాడు. మూడో స్థానంలో వచ్చిన మయాంక్ (24) రెండు బౌండరీలు ఓ సిక్సర్‌తో టచ్‌లోనే కనిపించినా ఏడో ఓవర్లో బంతినందుకున్న చాహల్.. రెండో బంతికి అతడి ఇన్నింగ్స్‌కు తెరదించాడు. కెప్టెన్ రజత్ కూడా ఓ బౌండరీ, రెండు సిక్సర్లతో రెచ్చిపోయినా జెమీసన్ పదో ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
మరో ఎండ్‌లో కోహ్లీ.. ఆరంభం నుంచే వికెట్లు కోల్పోవడంతో తన సహజశైలికి భిన్నంగా ఆడాడు. 11 ఓవర్ల వరకు అతడు ఆడిన బంతులు 22 కాగా చేసిన పరుగులు 28 మాత్రమే. అజ్మతుల్లా 15వ ఓవర్లో షార్ట్ బాల్‌గా వేసిన ఐదో బంతిని ఆడబోయిన కోహ్లీ.. బాల్ కాస్తా బ్యాట్ ఎడ్జ్‌కు తాకి అక్కడే పైకి లేవడంతో కోహ్లీ కథ ముగిసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జితేశ్ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ స్కోరుబోర్డు మళ్లీ వేగం పుంజుకుంది. అర్ష్‌దీప్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన జితేశ్.. జెమీసన్ మరుసటి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఇదే ఓవర్లో లివింగ్‌స్టొన్ ఓ సిక్సర్ కొట్టి ఐదో బంతికి ఎల్బీగా వెనుదిరగ్గా విజయ్‌కుమార్ 18వ ఓవర్లో జితేశ్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. షెపర్డ్ (17) క్రీజులో ఉన్నా ధాటిగా ఆడలేకపోయాడు. అర్ష్‌దీప్ ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టాడు.
ఛేదనలో పంజాబ్ ఇన్నింగ్స్ సైతం ఒడిదొడుకుల మధ్యే కొనసాగింది. భువనేశ్వర్ వేసిన తొలి బంతినే బౌండరీకి తరలించి ఛేదనను ప్రారంభించిన ప్రియాన్ష్ (19 బంతుల్లో 24, 4 ఫోర్లు), ఎదుర్కున్న రెండో బంతినే సిక్సర్‌గా మలిచిన ప్రభ్‌సిమ్రన్ (22 బంతుల్లో 26, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 5 ఓవర్లలో 43 రన్స్ జోడించారు. వీళ్లు పవర్ ప్లేలో వేగంగా రన్స్ రాబట్టలేకపోయారు. హాజిల్‌వుడ్ ఐదో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన ప్రియాన్ష్.. ఆఖరి బంతికి బౌండరీ లైన్ వద్ద సాల్ట్ సూపర్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. ప్రభ్‌సిమ్రన్‌ను కృనాల్ ఔట్ చేశాడు.
పంజాబ్ భారీ ఆశలు పెట్టుకున్న ‘సర్పంచ్ సాబ్’ శ్రేయాస్ (1).. షెపర్డ్ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇవ్వడంతో కింగ్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఓవర్ వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయినా దూకుడుగా ఆడిన ఇంగ్లిస్‌ను కృనాల్ 13వ ఓవర్లో ఔట్ చేసి ఆ జట్టుకు మరో షాకిచ్చాడు. ఈ క్రమంలో బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పంజాబ్ ఒత్తిడికి లోనైంది. ఆరు ఓవర్లలో ఆ జట్టు విజయానికి 85 పరుగులు అవసరం కాగా.. ఆ జట్టు 184 వద్దే ఆగిపోయింది. భువి ఒకే ఓవర్లో వధెర (15), స్టోయినిస్ (6)ను ఔట్ చేసి మ్యాచ్‌ను పూర్తిగా బెంగళూరు వైపునకు తిప్పాడు. శశాంక్ ఆఖరి ఓవర్లో మెరుపులు ఆ జట్టు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాయి.
బెంగళూరు: 20 ఓవర్లలో 190/9 (కోహ్లీ 43, రజత్ 26, అర్ష్‌దీప్ 3/40, జెమీసన్ 3/48);
పంజాబ్: 20 ఓవర్లలో 184/7 (శశాంక్ 61, ఇంగ్లిస్ 39, కృనాల్ 2/17, భువనేశ్వర్ 2/38)
Read Also..